న్యాయాధిపతులు 1

1
మిగిలిన కనానీయులతో ఇశ్రాయేలు యుద్ధం
1యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు, “కనానీయులతో యుద్ధం చేయడానికి మాలో ఎవరు మొదట వెళ్లాలి?” అని యెహోవాను అడిగారు.
2యెహోవా జవాబిస్తూ, “యూదా వారు వెళ్లాలి; నేను ఆ దేశాన్ని వారి చేతికి అప్పగించాను” అన్నారు.
3యూదా గోత్రం వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోను గోత్రం వారితో, “మాకు కేటాయించబడిన భూభాగంలో ఉన్న కనానీయులతో యుద్ధానికి మాతో పాటు రండి. అలాగే మీతో పాటు మేము కూడా మీ భూభాగం కోసం వస్తాం” అన్నారు. కాబట్టి షిమ్యోనీయులు వారితో వెళ్లారు.
4యూదా దాడి చేసినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజ్జీయులను వారి చేతికి అప్పగించారు; వారు బెజెకు దగ్గర పదివేలమంది పురుషులను హతం చేశారు. 5వారు బెజెకు దగ్గర రాజైనా అదోని-బెజెకును చూసి అతనితో యుద్ధం చేసి కనానీయులను, పెరిజ్జీయులను ఓడించారు. 6అదోని-బెజెకు పారిపోయినప్పుడు వారు అతన్ని తరిమి పట్టుకుని అతని కాలు చేతుల బొటన వ్రేళ్ళను కోసివేశారు.
7అప్పుడు రాజైన అదోని-బెజెకు, “ఇలా కాలు చేతుల బొటన వ్రేళ్ళు కోయబడిన డెబ్బైమంది రాజులు నా బల్లక్రింద పడిన ముక్కలు ఏరుకునేవారు. నేను వారికి చేసిన దానికి దేవుడు నాకు తగిన ప్రతిఫలమిచ్చారు” అని అన్నాడు. వారు అతన్ని యెరూషలేముకు తీసుకువచ్చారు, అతడక్కడ చనిపోయాడు.
8యూదా వారు యెరూషలేము మీద దాడి చేసి దానిని పట్టుకుని అక్కడి ప్రజలను ఖడ్గంతో చంపి, వారు పట్టణాన్ని కాల్చివేశారు.
9ఆ తర్వాత యూదా వారు కొండ సీమలో, దక్షిణ దేశంలో, పశ్చిమ కొండ దిగువ ప్రాంతంలో ఉన్న కనానీయులతో పోరాడటానికి వెళ్లారు. 10వారు గతంలో కిర్యత్-అర్బా అని పిలువబడిన హెబ్రోనులో ఉన్న కనానీయుల మీదికి వెళ్లి షేషయి అహీమాను తల్మయి అనే వారిని ఓడించారు. 11అక్కడినుండి వారు గతంలో కిర్యత్-సెఫెరు అని పిలువబడిన దెబీరులో నివసిస్తున్న ప్రజల మీద దాడి చేశారు.
12కాలేబు, “కిర్యత్-సెఫెరు మీద దాడి చేసి స్వాధీనపరచుకున్న వ్యక్తికి నా కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్ళి చేస్తాను” అని అన్నాడు. 13కాలేబు సోదరుడూ కెనజు కుమారుడైన ఒత్నీయేలు దానిని స్వాధీనపరచుకున్నాడు; కాబట్టి కాలేబు తన కుమార్తె అక్సాను అతనికిచ్చి పెళ్ళి చేశాడు.
14ఒక రోజు ఆమె ఒత్నీయేలు దగ్గరకు వచ్చి తన తండ్రిని ఒక పొలం అడగమని అతన్ని కోరింది. ఆమె తన గాడిదను దిగినప్పుడు కాలేబు, “నేను నీకేమి చేయాలి?” అని ఆమెను అడిగాడు.
15ఆమె జవాబిస్తూ, “నాకు ప్రత్యేక దీవెన కావాలి. నీవు నాకు దక్షిణం దేశంలో భూమి ఇచ్చావు, ఇప్పుడు నీటి ఊటలు కూడా ఇవ్వు” అని అన్నది. కాబట్టి కాలేబు ఆమెకు ఎగువ, దిగువ నీటి మడుగులను ఇచ్చాడు.
16కెనీయుడైన మోషే మామ యూదా ప్రజలతో ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా ఎడారికి వెళ్లి అక్కడ ఉన్నవారితో నివసించారు.
17తర్వాత యూదా వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోనీయులతో వెళ్లి జెఫతులో నివసిస్తున్న కనానీయులపై దాడి చేసి, పట్టణాన్ని పూర్తిగా నాశనం చేశారు. కాబట్టి ఆ పట్టణానికి హోర్మా#1:17 హోర్మా అంటే నాశనం అని పేరు పెట్టారు. 18యూదా వారు గాజాను అష్కెలోనును ఎక్రోనును ఈ పట్టణాల చుట్టూ ఉన్న ప్రదేశాలతో పాటు పట్టుకున్నారు.
19యెహోవా యూదా మనుష్యులతో ఉన్నారు కాబట్టి వారు కొండ సీమను స్వాధీనం చేసుకున్నారు, కానీ మైదాన ప్రాంతాల్లో ఉన్న వారి దగ్గర ఇనుప రథాలు ఉండినందుకు వారిని తరుమలేకపోయారు. 20మోషే వాగ్దానం చేసినట్లు కాలేబుకు హెబ్రోను ఇవ్వబడింది, అతడు అనాకు యొక్క ముగ్గురు కుమారులను తరిమేశాడు. 21అయితే బెన్యామీను గోత్రం వారు యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయులను తరమలేదు; ఇప్పటివరకు యెబూసీయులు బెన్యామీనీయులతో కలిసి నివసిస్తున్నారు.
22యోసేపు గోత్రాల వారు బేతేలుపై దాడి చేసినప్పుడు యెహోవా వారితో ఉన్నారు. 23పూర్వం లూజు అని పిలువబడిన బేతేలును వేగుచూడటానికి వారు యోసేపు ఇంటివారు మనుష్యులను పంపినప్పుడు, 24ఆ వేగులవారు ఆ పట్టణం నుండి ఒక వ్యక్తి రావడం చూసి అతనితో, “అయ్యా, దయచేసి పట్టణంలోకి ఎలా వెళ్లాలో మాకు చూపించు, మేము నీకు ఏదైనా ఉపకారం చేస్తాం” అని అన్నారు. 25కాబట్టి అతడు చూపించాడు, వారు అతన్ని, అతని కుటుంబాన్నంతటిని వదిలి పట్టణస్థులందరిని ఖడ్గంతో హతం చేశారు. 26తర్వాత ఆ వ్యక్తి హిత్తీయుల దేశానికి వెళ్లి, అక్కడ పట్టణం కట్టుకుని దానికి లూజు అనే పేరు పెట్టాడు. నేటి వరకు దాని పేరు అదే.
27అయితే మనష్షే గోత్రం వారు బేత్-షానును తానాకును దోరును ఇబ్లెయామును మెగిద్దో ప్రజలను, వారి చుట్టూ ఉన్న స్థావరాలను వెళ్లగొట్టలేదు, ఎందుకంటే కనానీయులు అక్కడ నివసించడానికి గట్టిగా పట్టుపట్టారు. 28ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత కనానీయుల చేత వెట్టిపనులు చేయించుకున్నారు కాని వారిని ఎప్పుడూ పూర్తిగా వెళ్లగొట్టలేదు. 29ఎఫ్రాయిం గోత్రం వారు కూడా గెజెరులో ఉన్న కనానీయులను వెళ్లగొట్టలేదు, కనానీయులు వారి మధ్యలోనే నివసించారు. 30జెబూలూను గోత్రం వారు కూడా కిత్రోను నహలోలులో ఉన్న కనానీయులను వెళ్లగొట్టలేదు, కాబట్టి కనానీయులు వారి మధ్యలోనే నివసించారు. అయితే జెబూలూనీయులు వారితో వెట్టిపనులు చేయించారు. 31ఆషేరు గోత్రం వారు కూడా అక్కోను సీదోనును అహ్లాబును అక్సీబును హెల్బాను ఆఫెకును రెహోబును వెళ్లగొట్టలేదు. 32ఆషేరీయులు వారిని వెళ్లగొట్టలేదు కాబట్టి వారు కనానీయ నివాసుల మధ్యలో నివసించారు. 33నఫ్తాలి గోత్రం వారు కూడా బేత్-షెమెషును బేత్-అనాతులో ఉన్నవారిని వెళ్లగొట్టలేదు; నఫ్తాలీయులు కూడా కనానీయ నివాసుల మధ్యలో నివసించారు, బేత్-షెమెషులో, బేత్-అనాతులో ఉన్నవారు వారికి వెట్టిపనులు చేశారు. 34అమోరీయులు దాను గోత్రం వారిని మైదానం దిగువకు రాకుండ కొండసీమ ప్రాంతానికి పరిమితం చేశారు. 35అమోరీయులు హెరెసు పర్వతంలో, అయ్యాలోనులో, షయల్బీములో నివసించడానికి నిశ్చయించుకున్నారు, కానీ యోసేపు గోత్రాల బలం ఎక్కువైనప్పుడు, వారు అమోరీయులతో వెట్టిపనులు చేయించుకొన్నారు. 36అమోరీయుల సరిహద్దు అక్రబ్బీం#1:36 అక్రబ్బీం అంటే తేలు కనుమ నుండి సెల వరకు విస్తరించింది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

న్యాయాధిపతులు 1: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి