యాకోబు పత్రిక 1

1
1దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు సేవకుడనైన యాకోబు,
వివిధ దేశాలకు చెదిరిపోయిన పన్నెండు గోత్రాల వారికి వ్రాస్తున్నాను:
మీకు శుభాలు.
శ్రమలు, శోధనలు
2నా సహోదరీ సహోదరులారా, మీ విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలవల్ల ఓర్పు వస్తుందని మీకు తెలుసు కాబట్టి, 3మీకు ఎప్పుడైనా ఎలాంటి శోధనలు ఎదురైనా వాటిని బట్టి సంతోషించండి. 4మీరు పరిణతి చెంది సంపూర్ణులై ఏ విషయంలో కొదువలేనివారై ఉండేలా పట్టుదల తన పనిని చేయనివ్వండి. 5మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవున్ని అడగాలి, ఆయన తప్పులను ఎంచకుండా అందరికి ధారాళంగా ఇస్తారు. 6మీరు అడిగినప్పుడు సందేహించకుండా విశ్వాసంతో అడగండి ఎందుకంటే, సందేహించేవారు గాలికి రేగి ఎగసిపడే సముద్రపు అలల్లాంటివారు; 7కాబట్టి వారు ప్రభువు నుండి తమకు ఏమైనా దొరుకుతుందని ఆశించకూడదు. 8అలాంటివారు రెండు రకాల మనస్సులను కలిగి ఉంటారు, తాము చేసేవాటన్నిటిలో అస్థిరంగా ఉంటారు.
9దీనస్థితిలో ఉన్న విశ్వాసులు తమకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి అతిశయించాలి. 10అయితే ధనవంతులైనవారు తమ దీనస్థితిని బట్టి అతిశయించాలి, ఎందుకంటే వారు గడ్డి పువ్వులా కనుమరుగవుతారు. 11కాల్చివేసే వేడిమితో సూర్యుడు ఉదయించినప్పుడు గడ్డి వాడిపోతుంది; దాని పువ్వు రాలిపోతుంది, దాని అందం నశించిపోతుంది; ధనవంతుల పట్ల కూడా అలాగే జరుగుతుంది; తమ తీరికలేని జీవితం మధ్యలో వారు వాడిపోతారు.
12శోధన సహించినవారు ధన్యులు. పరీక్షలో నిలబడినవారు ప్రభువు తాను ప్రేమించినవారికి ఇస్తానని వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుతారు.
13దేవుడు కీడు చేత శోధించబడడు; ఆయన ఎవరిని శోధించడు కాబట్టి ఎవరికైనా శోధన ఎదురైతే, “నేను దేవుని చేత శోధించబడుతున్నాను” అని అనకూడదు. 14ఒకరు తమ సొంత కోరికతోనే ఆకర్షించబడి వాటి ద్వారా ప్రలోభాలకు గురై శోధించబడతారు. 15చెడు కోరిక గర్భాన్ని ధరించి పాపానికి జన్మనిస్తుంది, ఆ పాపం పండి మరణానికి జన్మనిస్తుంది.
16నా ప్రియ సహోదరీ సహోదరులారా, మోసపోకండి. 17పైనుండి వచ్చే ప్రతీ శ్రేష్ఠమైన సంపూర్ణమైన బహుమానం వెలుగును కలిగించిన తండ్రి దగ్గర నుండి క్రిందకు వస్తున్నాయి, ఆయన ఒకచోట నిలబడని నీడల్లా ఎన్నడు మారరు. 18ఆయన సృష్టంతటిలో మనం మొదటి ఫలాలుగా ఉండాలని, సత్యవాక్యం చేత మనకు జన్మనివ్వడానికి ఎంచుకున్నారు.
వినుట ఆచరించుట
19నా ప్రియ సహోదరీ సహోదరులారా, మీరు దీనిని గ్రహించాలి: ప్రతి ఒక్కరు వినడానికి తొందరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, అలాగే తొందరపడి కోపపడవద్దు; 20ఎందుకంటే మీ కోపం దేవుని నీతిని జరిగించదు. 21కాబట్టి మీ జీవితాల్లోని సమస్త మలినాన్ని చెడును వదిలిపెట్టి, దేవుడు మీ హృదయాల్లో నాటిన వాక్యాన్ని వినయంతో అంగీకరించండి, ఎందుకంటే మీ ఆత్మలను రక్షించే శక్తి దానికే ఉంది.
22మీరు వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వాక్యం చెప్పేది చేయండి. 23ఎవరైతే వాక్యాన్ని విని అది చెప్పిన ప్రకారం చేయరో, వారు తమ ముఖాన్ని అద్దంలో చూసుకునే వారిలా ఉంటారు; 24వారు తమను చూసుకొని ప్రక్కకు వెళ్లిన వెంటనే తాము ఎలా ఉన్నారో మరచిపోతారు. 25అయితే స్వాతంత్ర్యాన్ని ఇచ్చే సంపూర్ణమైన ధర్మశాస్త్రంలోనికి పరిశీలనగా చూసి దానిలో కొనసాగేవారు, విని మరచేవారిగా ఉండకుండా అది చెప్పిన ప్రకారం చేస్తారు; వారు తాము చేసిన దానిలో దీవించబడతారు.
26తాము భక్తిపరులమని భావిస్తూ తమ నాలుకను అదుపులో పెట్టుకోనివారు తమ హృదయాలను తామే మోసం చేసుకుంటారు. అలాంటివారి భక్తి విలువలేనిది. 27తండ్రియైన దేవుని దృష్టిలో పవిత్రమైన నిష్కళంకమైన ధర్మం ఏంటంటే: అనాధలను, ఇబ్బందుల్లో ఉన్న విధవరాండ్రను సంరక్షించడం, లోక మాలిన్యం అంటకుండా తమను కాపాడుకోవడము.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యాకోబు పత్రిక 1: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి