యాకోబు 1:2-12

యాకోబు 1:2-12 TCV

నా సహోదరీ సహోదరులారా, మీ విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలవల్ల ఓర్పు వస్తుందని మీకు తెలుసు కనుక, మీకు ఎప్పుడైనా ఎలాంటి శోధనలు ఎదురైనా వాటిని బట్టి సంతోషించండి. మీరు పరిపక్వం చెంది సంపూర్ణులుగా అవడానికి, ఏ విషయంలో కూడా మీకు కొరత లేకుండా ఉండడానికి పట్టుదలను తన పనిని పూర్తి చేయనివ్వండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవుణ్ణి అడగండి అప్పుడు అది మీకు ఇవ్వబడుతుంది. ఆయన తప్పులను ఎంచకుండా అందరికీ ఉదారంగా ఇస్తారు. మీరు అడిగినప్పుడు సందేహించకుండా విశ్వాసంతో అడగండి ఎందుకంటే, సందేహించేవారు గాలిచేత విసరబడి కొట్టివేయబడే సముద్రపు అలల్లాంటివారు; కనుక వారు ప్రభువు నుండి తమకు ఏమైనా దొరుకుతుందని ఆశించకూడదు. అలాంటివారు రెండు రకాల మనస్సులను కలిగివుంటారు, తాము చేసే వాటన్నిటిలో అస్థిరంగా ఉంటారు. దీనులైన విశ్వాసులు తాము పైకెత్తబడుతున్న విధానాన్ని బట్టి అతిశయించాలి, అయితే ధనవంతులైనవారు తమ దీనస్థితిని బట్టి అతిశయించాలి, ఎందుకంటే గడ్డిలోని ఒక పువ్వులా ధనవంతులు కనుమరుగవుతారు. కాల్చివేసే వేడిమితో సూర్యుడు ఉదయించినప్పుడు గడ్డి వాడిపోతుంది; దాని పువ్వు రాలిపోతుంది, దాని అందం నశించిపోతుంది; ధనవంతుల పట్ల కూడా అలాగే జరుగుతుంది; తమ తీరికలేని జీవితం మధ్యలో వారు వాడిపోతారు. శోధన సహించినవారు ధన్యులు. పరీక్షలో నిలబడినవారు ప్రభువు తాను ప్రేమించినవారికి ఇస్తానని వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుతారు.