యెషయా 53

53
1మా సందేశాన్ని ఎవరు నమ్మారు?
యెహోవా హస్తం ఎవరికి వెల్లడయింది?
2లేత మొక్కలా ఎండిన భూమిలో మొలిచిన మొక్కలా
అతడు ఆయన ఎదుట పెరిగాడు.
మనల్ని అతనివైపు ఆకర్షించేంత అందం గాని ఘనత గాని అతనికి లేదు,
మనం అతన్ని కోరుకునేంతగా మంచి రూపమేమీ అతనికి లేదు.
3అతడు మనుష్యులచే తృణీకరించబడి తిరస్కరించబడినవానిగా,
శ్రమలు అనుభవించినవానిగా, బాధను ఎరిగినవానిగా ఉన్నాడు.
ప్రజలు అతన్ని చూడకుండ ముఖం దాచుకుంటారు;
అతడు నిర్లక్ష్యం చేయబడ్డాడు, మనం అతన్ని చిన్న చూపు చూశాము.
4ఖచ్చితంగా అతడు మన బాధలను భరించాడు.
మన రోగాలను భరించారు;
అయినా అతడు దేవునిచే శిక్షించబడ్డాడని
దెబ్బలు బాధలు అనుభవించాడని మనం అనుకున్నాము.
5అయితే మన అతిక్రమాల కోసం అతడు గాయపడ్డాడు
మన దోషాల కారణంగా నలగ్గొట్టబడ్డాడు.
మనకు సమాధానం ఇచ్చే శిక్ష అతని మీద పడింది.
అతని గాయాల కారణంగా మనం స్వస్థత పొందాము.
6మనమందరం గొర్రెల్లా దారి తప్పిపోయాము.
మనలో ప్రతి ఒక్కరూ తనకిష్టమైన దారిలో తిరిగిపోయారు.
యెహోవా మనందరి దోషాన్ని
అతని మీద మోపారు.
7అతడు పీడించబడి బాధించబడినా
అతడు తన నోరు తెరవలేదు;
వధించబడడానికి తేబడిన గొర్రెపిల్లలా,
బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు,
ఆయన తన నోరు తెరవలేదు.
8అన్యాయమైన తీర్పుతో అతన్ని తీసుకెళ్లారు.
అయినా అతని తరంలో నిరసన తెలిపింది ఎవరు?
సజీవుల భూమి మీద నుండి అతడు తీసివేయబడ్డాడు;
అతడు నా ప్రజల పాపాల కోసం శిక్షించబడ్డాడు.
9అతడు అన్యాయమేమీ చేయలేదు,
అతని నోటిలో ఏ మోసం లేదు కాని
అతడు చనిపోయినప్పుడు దుర్మార్గులతో సమాధి చేశారు,
ధనవంతుల సమాధిలో అతన్ని ఉంచారు.
10అయినా అతన్ని నలగ్గొట్టడం యెహోవాకు ఇష్టమైంది,
యెహోవా అతని జీవితాన్ని పాపపరిహారబలిగా అర్పించినా,
అతడు తన సంతానాన్ని చూస్తాడు, దీర్ఘకాలం జీవిస్తాడు,
యెహోవా చిత్తం అతని హస్తంలో వృద్ధిచెందుతుంది.
11అతడు శ్రమ పొందిన తర్వాత
జీవిత వెలుగును#53:11 కొ.ప్రా.ప్ర.లలో జీవిత వెలుగు అని లేదు చూసి తృప్తి చెందుతాడు#53:11 లేదా తన శ్రమ యొక్క ఫలితం చూస్తాడు, తృప్తి చెందుతాడు;
నీతిమంతుడైన నా సేవకుడు తన జ్ఞానంతో అనేకమందిని సమర్థిస్తాడు,
వారి దోషాలను అతడు భరిస్తాడు.
12కాబట్టి గొప్పవారితో నేనతనికి భాగం ఇస్తాను.
బలవంతులతో కలిసి అతడు దోపుడుసొమ్ము పంచుకుంటాడు.
ఎందుకంటే తన ప్రాణాన్ని మరణం పొందడానికి ధారపోసాడు,
అతడు అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు.
అతడు అనేకుల పాపభారాన్ని భరిస్తూ,
అపరాధుల గురించి విజ్ఞాపన చేశాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 53: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెషయా 53 కోసం వీడియో