యెషయా 40
40
దేవుని ప్రజలకు ఆదరణ
1నా ప్రజలను ఓదార్చండి, ఓదార్చండి,
అని మీ దేవుడు చెప్తున్నారు.
2యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి
ఆమె యుద్ధకాలం ముగిసిందని
ఆమె పాపదోషం తీరిపోయిందని
యెహోవా చేతిలో ఆమె పాపాలన్నిటి కోసం
రెండింతల ఫలం పొందిందని
ఆమెకు తెలియజేయండి.
3బిగ్గరగా కేక వేస్తున్న ఒక స్వరం:
“అరణ్యంలో యెహోవా కోసం
మార్గాన్ని సిద్ధపరచండి#40:3 లేదా అరణ్యంలో కేక వేస్తున్న ఒక స్వరం: “యెహోవా మార్గం సిద్ధపరచండి”
ఎడారిలో మన దేవునికి
రహదారిని సరాళం చేయండి.
4ప్రతి లోయ ఎత్తు చేయబడుతుంది,
ప్రతి పర్వతం ప్రతి కొండ సమం చేయబడుతుంది;
వంకర త్రోవ తిన్నగా,
గరుకు మార్గాలు నున్నగా చేయబడతాయి.
5యెహోవా మహిమ వెల్లడవుతుంది.
దాన్ని ప్రజలందరు చూస్తారు.
యెహోవాయే ఇది తెలియజేశారు.”
6“మొరపెట్టు” అని ఒక స్వరం అంటుంది,
నేను, “నేనేమని మొరపెట్టాలి?” అన్నాను.
“ప్రజలందరు గడ్డి వంటివారు,
వారి నమ్మకత్వమంతా పొలంలోని పువ్వు వంటిది.
7గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి
ఎందుకంటే యెహోవా తన ఊపిరి వాటి మీద ఊదుతారు.
నిజంగా ప్రజలు గడ్డిలా ఉన్నారు.
8గడ్డి ఎండిపోతుంది, పువ్వులు వాడిపోతాయి,
కాని మన దేవుని వాక్యం నిత్యం నిలిచి ఉంటుంది.”
9సువార్త ప్రకటిస్తున్న సీయోనూ,
ఎత్తైన పర్వతం ఎక్కు.
సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమా,
నీ గొంత్తెత్తి బలంగా
భయపడకుండా ప్రకటించు;
యూదా పట్టణాలకు,
“ఇదిగో మీ దేవుడు” అని చెప్పు.
10చూడండి, ప్రభువైన యెహోవా శక్తితో వస్తున్నారు,
తన బలమైన చేతితో పరిపాలిస్తారు.
చూడండి, ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గర ఉంది,
ఆయన ఇచ్చే ప్రతిఫలం ఆయనను అనుసరిస్తుంది.
11గొర్రెల కాపరిలా ఆయన తన మందను మేపుతారు;
తన చేతితో గొర్రెపిల్లలను చేర్చుకుని
తన హృదయానికి ఆనించి వాటిని మోస్తారు;
పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తారు.
12తన చేతితో నీటిని కొలిచిన వారెవరు?
జేనతో ఆకాశాన్ని కొలిచిన వారెవరు?
భూమిలోని మట్టి అంతటిని బుట్టలో ఉంచిన వాడెవడు?
త్రాసుతో పర్వతాలను తూచిన వాడెవడు?
తూనికతో కొండలను తూచిన వాడెవడు?
13యెహోవా ఆత్మను తెలుసుకున్న వారెవరు?
యెహోవాకు సలహాదారునిగా ఆలోచన చెప్పగలవారెవరు?
14ఎవరి దగ్గర యెహోవా ఆలోచన అడిగారు?
న్యాయ మార్గాన్ని ఆయనకు నేర్పిన వారెవరు?
ఆయనకు తెలివిని నేర్పించిన వారెవరు?
ఆయనకు బుద్ధి మార్గాన్ని చూపించిన వారెవరు?
15నిజంగా దేశాలు చేద నుండి జారే నీటి బిందువుల వంటివి.
వారు కొలబద్దల మీది ధూళివంటి వారు;
ఆయన ద్వీపాలను సన్నటి ధూళిలా కొలుస్తారు.
16బలిపీఠపు అగ్నికి లెబానోను చెట్లు సరిపోవు,
దహనబలికి దాని జంతువులు చాలవు.
17అన్ని దేశాలు ఆయన ముందు వట్టివే;
ఆయన దృష్టికి అవి విలువలేనివిగా
శూన్యం కంటే తక్కువగా ఉంటాయి.
18కాబట్టి మీరు ఎవరితో దేవుని పోలుస్తారు?
ఏ రూపంతో ఆయనను పోలుస్తారు?
19విగ్రహాన్ని ఒక శిల్పి పోతపోస్తాడు,
కంసాలి దానికి బంగారు రేకులు పొదిగి
దానికి వెండి గొలుసులు చేస్తాడు.
20అలాంటి విలువైన దానిని అర్పణగా ఇవ్వలేని పేదవారు
పుచ్చిపోని చెక్కను ఎంచుకుంటారు;
విగ్రహం కదలకుండా నిలబెట్టడానికి
వారు నిపుణుడైన పనివానిని వెదుకుతారు.
21మీకు తెలియదా?
మీరు వినలేదా?
మొదటి నుండి ఎవరు మీకు చెప్పలేదా?
భూమి స్థాపించబడడాన్ని బట్టి మీరు గ్రహించలేదా?
22ఆయన భూమండలంపై ఆసీనుడై కూర్చున్నారు.
ఆయన ముందు ప్రజలు మిడతల్లా ఉన్నారు.
తెరను విప్పినట్లు ఆయన ఆకాశాన్ని పరిచి
గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలంగా ఏర్పరిచారు.
23ఆయన రాజులను నిష్ఫలం చేస్తారు
ఈ లోక పాలకులను ఏమీ లేకుండా చేస్తారు.
24వారు నాటబడిన వెంటనే,
వారు విత్తబడిన వెంటనే,
వారి భూమిలో వేరు పారకముందే
ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోతారు.
సుడిగాలికి పొట్టు ఎగురునట్లు ఆయన వారిని ఎగరగొడతారు.
25“నన్ను ఎవరితో పోలుస్తారు?
నాకు సమానులెవరు?” అని పరిశుద్ధుడైన దేవుడు అడుగుతున్నారు.
26మీ కళ్లు ఎత్తి ఆకాశం వైపు చూడండి:
వీటన్నటిని సృజించింది ఎవరు?
నక్షత్ర సమూహాన్ని ఒక్కొక్క దానిని తీసుకువస్తూ,
వాటి వాటి పేర్ల ప్రకారం పిలిచేవాడే గదా.
తన గొప్ప శక్తినిబట్టి, తనకున్న శక్తివంతమైన బలాన్నిబట్టి
వాటిలో ఏ ఒక్క దానిని విడిచిపెట్టలేదు.
27యాకోబూ, “నా త్రోవ యెహోవాకు మరుగై ఉంది;
నా న్యాయాన్ని నా దేవుడు పట్టించుకోలేదు” అని
నీవెందుకు అంటున్నావు?
ఇశ్రాయేలూ, నీవెందుకు ఇలా చెప్తున్నావు?
28నీకు తెలియదా?
నీవు వినలేదా?
భూమి అంచులను సృష్టించిన
యెహోవా నిత్యుడైన దేవుడు.
ఆయన సొమ్మసిల్లరు, అలసిపోరు,
ఆయన జ్ఞానాన్ని ఎవరూ గ్రహించలేరు.
29ఆయన అలిసిపోయిన వారికి బలమిస్తారు
శక్తిలేనివారికి శక్తిని ఇస్తారు.
30యువత సొమ్మసిల్లి అలసిపోతారు,
యువకులు తడబడి పడిపోతారు.
31కాని యెహోవా కోసం ఎదురు చూసేవారు,
నూతన బలాన్ని పొందుతారు.
వారు గ్రద్ద వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు;
అలసిపోకుండా పరుగెత్తుతారు.
సొమ్మసిల్లకుండా నడుస్తారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 40: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.