యెషయా 35
35
విమోచన పొందినవారి ఆనందం
1ఎడారి, ఎండిన భూమి సంతోషిస్తాయి;
అరణ్యం సంతోషించి పూస్తుంది.
అది కుంకుమ పువ్వులా, 2ఒక్కసారిగా విచ్చుకుంటుంది;
అది గొప్పగా సంతోషించి ఆనందంతో కేకలు వేస్తుంది.
లెబానోను మహిమ దానికి ఇవ్వబడుతుంది,
కర్మెలు షారోనుల వైభవం దానికి ఉంటుంది;
వారు యెహోవా మహిమను
మన దేవుని వైభవాన్ని చూస్తారు.
3బలహీనమైన చేతులను బలపరచండి,
వణుకుతున్న మోకాళ్లను స్థిరపరచండి;
4భయపడేవారితో ఇలా అనండి:
“ధైర్యంగా ఉండండి, భయపడకండి;
మీ దేవుడు వస్తారు
ఆయన ప్రతీకారంతో వస్తారు.
దైవిక ప్రతీకారంతో
ఆయన మిమ్మల్ని రక్షించడానికి వస్తారు.”
5అప్పుడు గ్రుడ్డివారి కళ్లు తెరవబడతాయి
చెవిటి వారి చెవులు వినబడతాయి.
6అప్పుడు కుంటివారు జింకలా గంతులు వేస్తారు,
మూగవాని నాలుక ఆనందంతో కేకలు వేస్తుంది.
అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి
ఎడారిలో కాలువలు పారతాయి.
7మండుతున్న ఇసుక చెరువులా మారుతుంది
ఎండిన నేలలో నీటిబుగ్గలు పుడతాయి.
ఒక్కప్పుడు తోడేళ్లు పడుకున్న స్థలంలో
గడ్డి, రెల్లు, జమ్ము పెరుగుతాయి.
8అక్కడ రహదారి ఉంటుంది;
అది పరిశుద్ధ మార్గమని పిలువబడుతుంది;
అది ఆ మార్గంలో నడిచే వారికి మాత్రమే.
అపవిత్రులు ఆ దారిలో వెళ్లకూడదు;
దుర్మార్గమైన మూర్ఖులు దానిలో నడవరు.
9అక్కడ ఏ సింహం ఉండదు,
ఏ క్రూర జంతువు ఉండదు;
అవి అక్కడ కనబడవు.
విమోచన పొందిన వారే అక్కడ నడుస్తారు.
10యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు.
వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు;
నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది.
వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు.
దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 35: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.