యెషయా 2
2
యెహోవా పర్వతం
1యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన దర్శనం:
2చివరి రోజుల్లో
యెహోవా మందిరం
పర్వతాలన్నిటిలో ఉన్నతమైనదిగా స్థిరపరచబడుతుంది;
అది కొండలకు పైగా హెచ్చింపబడుతుంది,
జనాంగాలన్నీ దాని దగ్గరకు ప్రవాహంలా వెళ్తారు.
3చాలా జనాంగాలు వచ్చి ఇలా అంటారు,
“రండి, మనం యెహోవా పర్వతం మీదికి,
యాకోబు దేవుని ఆలయానికి వెళ్దాము.
మనం ఆయన మార్గంలో నడిచేలా,
ఆయన మనకు తన మార్గాల్ని బోధిస్తారు.”
సీయోనులో నుండి ధర్మశాస్త్రం,
యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయటకు వెళ్తాయి.
4ఆయన దేశాల మధ్య తీర్పు తీరుస్తారు,
అనేక జనాంగాల వివాదాలను పరిష్కరిస్తారు.
వారు తమ ఖడ్గాలను సాగగొట్టి నాగటి నక్కులుగా,
తమ ఈటెలను సాగగొట్టి మడ్డికత్తులుగా చేస్తారు.
ఒక దేశం మరొక దేశం మీద ఖడ్గం ఎత్తదు,
వారు ఇకపై యుద్ధానికి శిక్షణ పొందరు.
5యాకోబు వారసులారా రండి,
మనం యెహోవా వెలుగులో నడుద్దాము.
యెహోవా దినం
6యెహోవా, యాకోబు వారసులైన
మీ ప్రజలను మీరు విడిచిపెట్టారు.
వారు తూర్పు దేశాలకున్న మూఢనమ్మకాలతో నిండి ఉన్నారు;
వారు ఫిలిష్తీయుల్లా భవిష్యవాణి చూస్తారు,
ఇతరుల ఆచారాలను పాటిస్తారు.
7వారి దేశం వెండి బంగారాలతో నిండి ఉంది;
వారి ధనానికి అంతులేదు.
వారి దేశం గుర్రాలతో నిండి ఉంది;
వారి రథాలకు అంతులేదు.
8వారి దేశం విగ్రహాలతో నిండి ఉంది.
వారు తమ చేతులతో చేసిన వాటికి,
తమ వ్రేళ్లతో చేసిన వాటికి తలవంచి నమస్కరిస్తారు.
9కాబట్టి ప్రజలు అణచివేయబడతారు
ప్రతి ఒక్కరు తగ్గించబడతారు
వారిని క్షమించకండి.#2:9 లేదా వారిని లేవనెత్తకండి
10యెహోవా భీకర సన్నిధి నుండి,
ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి
బండ సందులకు వెళ్లి నేలలో దాక్కోండి.
11మనుష్యుల అహంకారపు చూపు తగ్గించబడుతుంది,
మనుష్యుల గర్వం అణచివేయబడుతుంది;
ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతారు.
12సైన్యాల యెహోవా
అహంకారం, గర్వం ఉన్న ప్రతివారి కోసం
హెచ్చింపబడిన వాటన్నిటి కోసం ఒక రోజును నియమించారు.
(అవి అణచివేయబడతాయి),
13ఎందుకంటే ఎత్తైన పొడవైన లెబానోను దేవదారు చెట్లన్నిటికి,
బాషాను సింధూర వృక్షాలన్నిటికి,
14పెద్ద పర్వతాలన్నిటికి,
ఎత్తైన కొండలన్నిటికి
15ఉన్నతమైన ప్రతి గోపురానికి
ప్రతి కోటగోడకు,
16ప్రతీ వాణిజ్య నౌకకు#2:16 హెబ్రీలో తర్షీషు ఓడలన్నిటికి
మనోహరమైన నౌకలకు ఒక రోజును నియమించారు.
17మనుష్యుల అహంకారం అణచివేయబడుతుంది
మానవుల గర్వం తగ్గించబడుతుంది;
ఆ రోజు యెహోవా మాత్రమే ఘనపరచబడతారు.
18విగ్రహాలు పూర్తిగా అదృశ్యమవుతాయి.
19యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు,
ఆయన భీకర సన్నిధి నుండి
ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి పారిపోయి
వారు కొండల గుహల్లో
నేలలో ఉన్న సందుల్లో దాక్కుంటారు.
20ఆ రోజున మనుష్యులు
తాము పూజించడానికి తయారుచేసుకున్న
వెండి విగ్రహాలను బంగారు విగ్రహాలను
ఎలుకలకు గబ్బిలాలకు పారేస్తారు.
21యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు,
ఆయన భీకర సన్నిధి నుండి పారిపోయి
ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి
వారు కొండల గుహల్లో
బండ బీటల్లో దాక్కుంటారు.
22తమ నాసికారంధ్రాలలో ఊపిరి తప్ప ఏమీ లేని
నరులను నమ్మడం మానండి.
వారిని ఎందుకు లక్ష్యపెట్టాలి?
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 2: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.