హోషేయ 13
13
ఇశ్రాయేలుపై యెహోవా కోపం
1ఎఫ్రాయిం మాట్లాడినప్పుడు ప్రజలు వణికారు;
అతడు ఇశ్రాయేలులో ఘనపరచబడ్డాడు.
కాని అతడు బయలును పూజించి అపరాధిగా చనిపోయాడు.
2ఇప్పుడు వారు మరి ఎక్కువ పాపం చేస్తున్నారు;
వారు వెండితో తమ కోసం విగ్రహాలను చేసుకుంటున్నారు,
అవి నైపుణ్యంతో చేయబడిన ప్రతిమలు,
అవన్నీ కళాకారుని చేతిపనులు.
ఈ ప్రజల గురించి ఇలా చెప్తారు,
“వారు నరబలులు అర్పిస్తారు!
దూడ విగ్రహాలను ముద్దు పెట్టుకుంటారు!”
3కాబట్టి వారు ఉదయకాలపు పొగలా ఉంటారు,
ఉదయకాలపు మంచులా అదృశ్యం అవుతారు,
నూర్పిడి కళ్ళంలో నుండి గాలికి ఎగిరే పొట్టులా ఉంటారు,
కిటికీలో గుండా పోయే పొగలా అయిపోతారు.
4“మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పటి నుండి
యెహోవానైన నేను మీకు దేవునిగా ఉన్నాను;
మీరు నన్ను తప్ప మరే దేవున్ని అంగీకరించకూడదు,
నేను తప్ప రక్షకుడు ఎవరూ లేరు.
5మీరు తీవ్రమైన వేడిగల అరణ్యంలో ఉన్నప్పుడు,
నేను మిమ్మల్ని సంరక్షించాను.
6నేను వారిని పోషించగా వారు తృప్తి చెందారు.
వారు తృప్తి చెందిన తర్వాత గర్వించి;
నన్ను మరచిపోయారు.
7కాబట్టి నేను వారికి సింహంలా ఉంటాను,
చిరుతపులిలా దారిలో పొంచి ఉంటాను.
8పిల్లలు పోయిన ఎలుగుబంటిలా,
నేను వారిపై పడి వారిని చీల్చివేస్తాను;
సింహంలా వారిని మ్రింగివేస్తాను,
అడవి మృగంలా వారిని చీల్చివేస్తాను.
9“ఇశ్రాయేలూ! నీవు నాశనమవుతావు
ఎందుకంటే నీవు నీ సహాయకుడనైన నాకు విరుద్ధంగా ఉన్నావు.
10నిన్ను కాపాడగలిగే నీ రాజు ఎక్కడా?
మీ పట్టణాలన్నిటిలో ఉండే మీ అధిపతులు ఎక్కడా?
వారి గురించి నీవు, ‘నాకు రాజును అధిపతులను ఇవ్వండి’
అని నీవు అడిగావు కదా?
11కాబట్టి నేను కోపంలో నీకు రాజును ఇచ్చాను.
నా ఆగ్రహంతో అతన్ని తొలగించాను.
12ఎఫ్రాయిం అపరాధం పోగుచేయబడింది,
అతని పాపాలు వ్రాయబడ్డాయి.
13ప్రసవ వేదనలాంటి శ్రమ అతనికి కలుగుతుంది,
కాన్పు సమయం వచ్చినప్పుడు కాని అతడు జ్ఞానంలేని శిశువుగా ఉన్నాడు;
గర్భం నుండి బయటకు రాని శిశువులా
అతడు జ్ఞానంలేనివానిగా ఉన్నాడు.
14“నేను ఈ ప్రజలను పాతాళం శక్తి నుండి విడిపిస్తాను;
మరణం నుండి వారిని విమోచిస్తాను.
ఓ మరణమా, నీవు కలిగించే తెగుళ్ళు ఎక్కడ?
ఓ పాతాళమా, నీవు కలిగించే నాశనం ఎక్కడ?
“అతడు తన సోదరుల మధ్య ఎదుగుతున్నా సరే,
15నేను ఎఫ్రాయిం పట్ల దయ చూపించను.
యెహోవా నుండి తూర్పు గాలి వస్తుంది,
ఎడారి నుండి అది వీస్తుంది.
అతని నీటిబుగ్గ ఎండిపోతుంది
అతని బావి ఇంకిపోతుంది.
అతని ధననిధులు, ప్రియమైన వస్తువులు దోచుకోబడతాయి.
16సమరయ ప్రజలు తమ అపరాధాన్ని భరించాలి,
ఎందుకంటే వారు తమ దేవుని మీద తిరుగుబాటు చేశారు.
వారు ఖడ్గానికి కూలుతారు;
వారి చంటి పిల్లలు నేలకు కొట్టబడతారు,
వారి గర్భిణీల కడుపులు చీల్చబడతాయి.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
హోషేయ 13: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.