కాబట్టి, ఇంత గొప్ప సాక్షిసమూహం మన చుట్టూ ఆవరించి ఉంది కనుక, మనకు ఆటంకం కలిగించే ప్రతి దాన్ని, సుళువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెడదాం. విశ్వాసానికి కర్త అయిన దాన్ని పరిపూర్ణం చేసేవాడైన యేసువైపు చూస్తూ, మన ముందు ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరుగెడదాం. ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందం కొరకు సిలువను భరించి దానివల్ల కలిగే అవమానాలను లక్ష్యపెట్టక, ఇప్పుడు దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చునివున్నారు. మీరు అలసిపోకుండా ధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి, క్రీస్తు పాపాత్ముల నుండి ఎదుర్కొన్న వ్యతిరేకతను ఎలా ఓర్చుకున్నాడో జ్ఞాపకం చేసుకోండి. మీరు పాపంతో పోరాడటంలో మీ రక్తం చిందేంతగా ప్రతిఘటించలేదు. తండ్రి తన కుమారునితో మాట్లాడినట్లుగా ఆయన మీతో ప్రోత్సాహకరంగా మాట్లాడిన మాటలను పూర్తిగా మరచిపోయారా? అవి ఇలా చెప్తున్నాయి, “నా కుమారుడా, ప్రభువు క్రమశిక్షణను చులకనగా చూడకు, ఆయన నిన్ను గద్దించినపుడు నీవు నిరాశ చెందకు, ఎందుకంటే, ప్రభువు తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతాడు, తన కుమారునిగా అంగీకరించిన ప్రతివారికి ఆయన శిక్షణనిస్తాడు.” మీరు పొందే బాధలన్నిటిని క్రమశిక్షణగా సహించండి; ఎందుకంటే దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా భావిస్తున్నాడు. తమ తండ్రిచేత క్రమశిక్షణ పొందని కుమారుడెవడు? అందరు క్రమశిక్షణ పొందినట్లు మీరు క్రమశిక్షణ పొందకపోతే చట్టబద్ధమైన సంతానం అవ్వరు మీరు నిజమైన కుమారులు కుమార్తెలు కారు. మనలను క్రమశిక్షణలో పెంచిన మానవ తండ్రులను మనమందరం కలిగివున్నాం, ఈ విషయంలో వారిని గౌరవిస్తాం. అలాగే ఆత్మలకు తండ్రియైన దేవునికి మనం ఇంకా ఎంత అధికంగా లోబడి జీవించాలి! తాము మంచిదని తలంచిన విధంగా మన తండ్రులు కొంత కాలం మనలను క్రమశిక్షణలో పెంచారు కాని దేవుడు తన పరిశుద్ధతలో మనం పాలుపంచుకోవడానికి మన మేలు కొరకే ఆ క్రమశిక్షణలో ఉంచాడు. ఆ సమయంలో ఏ క్రమశిక్షణా ఆనందంగా అనిపించదు కాని బాధగా అనిపిస్తుంది. కాని దాని ద్వారా తర్ఫీదు పొందినవారు నీతి సమాధానం అనే పంట కోస్తారు. కనుక, దుర్బలమైన మీ చేతులను బలహీనమైన మీ మోకాళ్లను బలపరచండి.
Read హెబ్రీయులకు 12
వినండి హెబ్రీయులకు 12
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: హెబ్రీయులకు 12:1-12
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు