కొందరు అలవాటుగా మానివేసినట్లుగా, మనం కలవడం మానివేయకుండా, ఆ దినం సమీపించడం మీరు చూసినప్పుడు ఇంకా ఎక్కువగా కలుసుకొంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుందాము. సత్యం మనకు తెలియజేయబడిన తర్వాత కూడా ఒకవేళ మనం పాపాలు చేస్తూనే ఉంటే, ఆ పాపాలను తొలగించగల బలి ఏది లేదు, అయితే తీర్పు కోసం, దేవుని శత్రువులను దహించబోయే ప్రచండమైన అగ్ని కోసం మాత్రమే భయంతో ఎదురుచూడడం మిగిలి ఉంటుంది. మోషే ధర్మశాస్త్రాన్ని తిరస్కరించినవారు ఎవరైనా సరే ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల సాక్ష్యాన్ని బట్టి దయ లేకుండా చంపివేయబడ్డారు. అలాంటప్పుడు దేవుని కుమారుని తమ పాదాల క్రింద త్రొక్కినవారు, తమను పరిశుద్ధపరచే నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదానిగా భావించినవారు, కృప గల ఆత్మను అవమానించినవారు ఎంత గొప్ప తీవ్రమైన శిక్షను పొందుతారో మీరు ఊహించగలరా? “పగ తీర్చుకోవడం నా పని, నేను ప్రతిఫలాన్ని ఇస్తాను” అని, మరలా, “ప్రభువు, తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అని చెప్పిన వాడు మనకు తెలుసు. సజీవుడైన దేవుని చేతుల్లో పడడం మహా భయంకరమైన విషయము. మీరు వెలుగును పొందిన తర్వాత, అనేక శ్రమలతో నిండిన గొప్ప పోరాటాన్ని మీరు ఓర్చుకున్న ప్రారంభపు రోజులను జ్ఞాపకం చేసుకోండి. కొన్నిసార్లు మీరు బహిరంగంగా అవమానపరచబడ్డారు, హింసించబడ్డారు; మరికొన్నిసార్లు మీరు అలాంటివి అనుభవించిన వారితో పాలివారయ్యారు. చెరసాలలో వేయబడిన వారితో పాటు మీరు శ్రమ అనుభవించారు, మీ ఆస్తులను దోచుకున్నా సంతోషంగా స్వీకరించారు, వాటికంటే శాశ్వతంగా నిలిచే మరింత మేలైన ఆస్తులను కలిగి ఉన్నారని మీకు తెలుసు కాబట్టి మీరు వాటిని భరించారు. కాబట్టి మీ ధైర్యాన్ని కోల్పోవద్దు; దానికి మీరు గొప్ప ఫలాన్ని పొందుతారు. దేవుని చిత్తాన్ని చేసేప్పుడు మీరు పట్టుదలగా ఉండడం అవసరం, ఆయన వాగ్దానం చేసిన దాన్ని మీరు పొందుకుంటారు. “ఎందుకంటే ఇంకాసేపట్లో, రాబోయేవాడు వస్తాడు ఆలస్యం చేయడు.” ఇంకా, “నా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. అయితే వెనుతిరిగే వానిని బట్టి నా హృదయం ఏమాత్రం ఆనందించదు.” అయితే మనం వెనుతిరిగి నశించేవారితో లేము, కానీ విశ్వాసం కలిగి, తమ ఆత్మలను కాపాడుకునేవారితో ఉన్నాము.
చదువండి హెబ్రీ పత్రిక 10
వినండి హెబ్రీ పత్రిక 10
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: హెబ్రీ పత్రిక 10:25-39
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు