యెహెజ్కేలు 14
14
విగ్రహారాధికులకు తీర్పు
1ఇశ్రాయేలు పెద్దలలో కొంతమంది నా దగ్గరకు వచ్చి నాకు ఎదురుగా కూర్చున్నారు. 2అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 3“మనుష్యకుమారుడా, ఈ మనుష్యులు తమ హృదయాల్లో విగ్రహాలను ఉంచుకొని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకున్నారు. నా దగ్గర విచారణ చేయడానికి నేను వారిని అనుమతించాలా? 4కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ ఇశ్రాయేలు సర్వసమాజం తమ హృదయాల్లో విగ్రహాలను పెట్టుకుని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకుని ప్రవక్త దగ్గరకు వెళ్తే వారు చేసే విగ్రహారాధనను బట్టి వారికి యెహోవానైన నేనే స్వయంగా సమాధానం ఇస్తాను. 5తమ విగ్రహాలన్నిటి కోసం నన్ను విడిచిపెట్టిన ఇశ్రాయేలీయుల హృదయాలను తిరిగి నా వైపు త్రిప్పుకోడానికి నేను ఇలా చేస్తాను.’
6“కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీ విగ్రహాలను విడిచిపెట్టి అసహ్యకరమైన ఆచారాలు మానివేసి మనస్సు మార్చుకోండి.
7“ ‘ఇశ్రాయేలీయులు గాని వారి దేశంలో ఉంటున్న విదేశీయులు గాని నన్ను విడిచిపెట్టి తమ హృదయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించుకుని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకుని నా దగ్గర విచారణచేయమని వారు ప్రవక్త దగ్గరకు వెళ్తే వారికి యెహోవానైన నేనే స్వయంగా సమాధానం ఇస్తాను. 8వారికి నేను విరోధిగా ఉండి వారిని ఒక సూచనగా సామెతగా చేస్తాను. నేను వారిని నా ప్రజల నుండి తొలగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
9“ ‘ఎవరైనా ప్రవక్త మోసపోయి ఏదైన ప్రవచనం చెబితే యెహోవానైన నేను ఆ ప్రవక్తను మోసం చేస్తాను. అతనికి వ్యతిరేకంగా నా చేయి చాపి నా ప్రజలైన ఇశ్రాయేలులో నుండి అతన్ని నాశనం చేస్తాను. 10వారు తమ శిక్షను భరిస్తారు; ప్రవచనం కోసం వచ్చిన వాని దోషమెంతో ప్రవచించిన ప్రవక్త దోషం కూడా అంతే. 11అప్పుడిక ఇశ్రాయేలు ప్రజలు నన్ను విడిచిపెట్టరు, వారు తమ పాపాలన్నిటితో తమను తాము అపవిత్రం చేసుకోరు. వారు నా ప్రజలై ఉంటారు. నేను వారి దేవుడినై ఉంటానని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
యెరూషలేము తీర్పును తప్పించుకోలేదు
12యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 13“మనుష్యకుమారుడా, ఒక దేశం నమ్మకద్రోహంతో నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే దానికి వ్యతిరేకంగా నా చేతిని చాపి ఆహారం లేకుండా చేసి కరువు పంపించి దాని మనుష్యులను పశువులను చంపుతాను. 14ఆ దేశంలో నోవహు దానియేలు#14:14 లేదా దానేలు ప్రాచీన సాహిత్యంలో ప్రఖ్యాతి చెందిన వ్యక్తి; 20 వచనంలో కూడా యోబు ఈ ముగ్గురు ఉన్నప్పటికీ వారు తమ నీతితో తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
15“ఆ దేశం పిల్లలు లేనిదై నిర్మానుష్యంగా మారేలా దాని మీదికి అడవి మృగాలను పంపుతాను. వాటి కారణంగా దానిగుండా ఎవరూ ప్రయాణించరు. 16నా జీవం తోడు ఆ ముగ్గురు నీతిమంతులు అక్కడ ఉన్నప్పటికీ వారు తమ కుమారులను కుమార్తెలను రక్షించుకోలేరు. వారు తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు కాని దేశం పాడైపోతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
17“నేను ఆ దేశం మీదికి ఖడ్గాన్ని రప్పించి, ఆ దేశమంతా తిరిగి దానిలోని మనుష్యులను పశువులను చంపమని చెప్పినప్పుడు, 18నా జీవం తోడు ఆ ముగ్గురు నీతిమంతులు అక్కడ ఉన్నప్పటికీ వారు తమ కుమారులను కుమార్తెలను రక్షించుకోలేరు. వారు తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
19“నేను ఆ దేశంలోకి తెగులు పంపి రక్తపాతం జరిగేంతగా నా ఉగ్రత కుమ్మరించి మనుష్యులను పశువులను చంపినప్పుడు, 20నా జీవం తోడు నోవహు దానియేలు యోబు అక్కడ ఉన్నప్పటికీ వారు తమ కుమారులను కుమార్తెలను రక్షించుకోలేరు. తమ నీతితో తమను మాత్రమే రక్షించుకోగలరని యెహోవా ప్రకటిస్తున్నారు.
21“ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: దాని మనుష్యులను వారి జంతువులను చంపడానికి యెరూషలేము మీదికి ఖడ్గం కరువు అడవి మృగాలు తెగులు అనే నాలుగు భయంకరమైన తీర్పులను పంపినప్పుడు అది ఎంతో ఘోరంగా ఉంటుంది! 22అయినప్పటికీ దానిలో నుండి బయటకు రప్పించబడిన కుమారులు కుమార్తెలలో కొంతమంది ప్రాణాలతో మిగిలి ఉంటారు. వారు మీ దగ్గరకు వస్తారు, మీరు వారి ప్రవర్తనలో పనులలో తేడాను చూసినప్పుడు నేను యెరూషలేము మీదికి రప్పించిన కీడు గురించి నేను దానికి చేసిన వాటన్నిటి గురించి మీరు ఓదార్పు పొందుతారు. 23వారి ప్రవర్తన వారి పనులు చూసినప్పుడు నేను కారణం లేకుండా ఏదీ చేయలేదని మీరు తెలుసుకుని ఓదార్పు పొందుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 14: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.