యెహెజ్కేలు 10
10
మందిరంలో నుండి వెళ్లిపోయిన దేవుని మహిమ
1నేను చూడగా, కెరూబుల తలల పైన ఉన్న విశాలంపైన నీలమణి వంటి ప్రశస్తమైన రాళ్లతో చేసిన ఒక సింహాసనం వంటిది కనిపించింది. 2నారబట్టలు వేసుకున్న వానితో యెహోవా, “కెరూబు క్రింద ఉన్న చక్రాల మధ్యకు వెళ్లు. కెరూబుల మధ్య ఉన్న నిప్పులు నీ చేతి నిండా గుప్పిలిలో తీసుకుని పట్టణమంతా చల్లు” అని చెప్పారు. నేను చూస్తుండగానే ఆయన లోపలికి వెళ్లిపోయారు.
3ఆయన లోపలికి వెళ్లినప్పుడు కెరూబులు ఆలయానికి దక్షిణం వైపున నిలబడి ఉన్నాయి; ఒక మేఘం లోపలి ఆవరణాన్ని కమ్మివేసింది. 4అప్పుడు యెహోవా మహిమ కెరూబు మీద నుండి పైకి వెళ్లి ఆలయ గుమ్మం వరకు వెళ్లింది. మేఘం మందిరాన్ని నింపివేసింది, ఆవరణం యెహోవా మహిమతో నిండిపోయింది. 5కెరూబుల రెక్కల ధ్వని బయటి ఆవరణం వరకు, సర్వశక్తిమంతుడైన దేవుడు#10:5 హెబ్రీలో ఎల్-షద్దాయ్ మాట్లాడుతున్నప్పుడు వినిపించే స్వరంలా వినబడింది.
6నారబట్టలు వేసుకున్న వానితో యెహోవా, “కెరూబుల మధ్య ఉన్న చక్రాల మధ్య నుండి అగ్నిని తీసివేయి” అని ఆజ్ఞాపించినప్పుడు, అతడు లోపలికి వెళ్లి ఒక చక్రం ప్రక్కన నిలబడ్డాడు. 7అప్పుడు కెరూబులలో ఒకడు తన చేతిని వారి మధ్య ఉన్న అగ్ని వైపుకు చాచి కొన్ని నిప్పులు తీసుకుని నారబట్టలు వేసుకున్న వాని చేతికి ఇవ్వగా అతడు వాటిని తీసుకుని బయటకు వెళ్లాడు. 8(కెరూబుల రెక్కల క్రింద మానవ చేతుల్లాంటివి కనిపించాయి.)
9ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రం చొప్పున మొత్తం నాలుగు చక్రాలున్నాయి. అవి పుష్యరాగం వంటి ప్రశస్తమైన రాళ్లతో చేసినట్లుగా ఉన్నాయి. 10ఆ నాలుగు చక్రాలు ఒకేలా ఉన్నాయి. ఆ చక్రాలు ఒకదానిలో ఒకటి అమర్చినట్లుగా ఉన్నాయి. 11అవి కదిలినప్పుడు కెరూబులు తిరిగి ఉన్న నాలుగు వైపులకు అవి వెళ్తాయి అయితే కెరూబులు వెళ్తూ ఉన్నప్పుడు అవి వెనుకకు తిరగలేదు. కెరూబులు ఎటూ తిరగకుండా వాటి తలలు తిరగి ఉన్న వైపు వెళ్లాయి. 12వాటి వీపు, చేతులు రెక్కలతో సహా వాటి శరీరమంతా కళ్లు ఉన్నాయి; వాటికున్న నాలుగు చక్రాలు కూడా పూర్తిగా కళ్లతో నిండి ఉన్నాయి. 13తిరగండని చక్రాలతో చెప్పడం నేను విన్నాను. 14ప్రతి కెరూబుకు నాలుగు ముఖాలు ఉన్నాయి: మొదటిది కెరూబు ముఖం, రెండవది మానవ ముఖం, మూడవది సింహ ముఖం, నాల్గవది గ్రద్ద ముఖము.
15అప్పుడు కెరూబులు పైకి లేచాయి. కెబారు నది దగ్గర నేను చూసిన జీవులు ఇవే. 16కెరూబులు కదిలినప్పుడు వాటి ప్రక్కనున్న చక్రాలు కూడా కదిలాయి; కెరూబులు నేల నుండి పైకి లేవడానికి రెక్కలు విప్పినప్పుడు కూడా చక్రాలు వాటి దగ్గర నుండి తొలగిపోలేదు. 17జీవుల ఆత్మ చక్రాలలో ఉంది కాబట్టి కెరూబులు నిలబడినప్పుడు అవి కూడ నిలబడ్డాయి; లేచినప్పుడు అవి కూడా లేచాయి.
18అప్పుడు యెహోవా మహిమ ఆలయ గుమ్మం మీద నుండి వెళ్లిపోయి కెరూబుల పైన ఆగింది. 19నేను చూస్తుండగానే కెరూబులు రెక్కలు విప్పి నేల నుండి పైకి లేచాయి, అవి వెళ్తుండగా చక్రాలు వాటితో పాటు వెళ్లాయి. అవి యెహోవా ఆలయ తూర్పు ద్వారం దగ్గరకు వచ్చి ఆగాయి; ఇశ్రాయేలు దేవుని మహిమ వాటిపైన ఉంది.
20ఇవి కెబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నేను చూసిన జీవులు ఇవే. అవి కెరూబులను నేను గ్రహించాను. 21ప్రతి దానికి నాలుగు ముఖాలు నాలుగు రెక్కలు ఉన్నాయి. వాటి రెక్కల క్రింద మానవ చేతుల్లాంటివి ఉన్నాయి. 22వాటి ముఖాలు నేను కెబారు నది దగ్గర నేను చూసిన ముఖాల్లాగానే ఉన్నాయి. అవన్నీ తిన్నగా ముందుకు వెళ్తున్నాయి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 10: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.