నిర్గమ 20
20
పది ఆజ్ఞలు
1తర్వాత దేవుడు ఈ మాటలన్నీ మాట్లాడారు:
2“బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే.
3“నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు.
4పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని భూమి క్రింద నీళ్లలో గాని ఉన్న దేని రూపంలో మీరు మీకోసం ప్రతిమను చేసుకోకూడదు. 5మీరు వాటికి నమస్కరించకూడదు పూజింపకూడదు; ఎందుకంటే నేను, మీ దేవుడనైన యెహోవాను, రోషం గల దేవుడను, నన్ను ద్వేషించినవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల పాపం యొక్క శిక్షను వారి పిల్లల మీదికి రప్పిస్తాను. 6అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించే వారికి వెయ్యి తరాల వరకు కరుణను చూపిస్తాను.
7మీ దేవుడైన యెహోవా నామాన్ని అనవసరంగా ఉపయోగించకూడదు, ఎందుకంటే తన నామాన్ని అనవసరంగా ఉపయోగించే వారిని యెహోవా నిర్దోషులుగా వదిలేయరు.
8సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా పాటించడం జ్ఞాపకముంచుకోండి. 9ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని అంతటిని చేసుకోవాలి, 10కాని ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు సబ్బాతు దినము. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, మీరు గాని, మీ కుమారుడు లేదా కుమార్తె గాని, మీ దాసదాసీలు గాని, మీ పశువులు గాని, మీ పట్టణాల్లో ఉంటున్న విదేశీయులు గాని ఏ పని చేయకూడదు. 11ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించి, ఏడవ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. కాబట్టి యెహోవా సబ్బాతు దినాన్ని ఆశీర్వదించి దానిని పరిశుద్ధం చేశారు.
12మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే దేశంలో మీరు ఎక్కువకాలం జీవించేలా మీ తండ్రిని తల్లిని గౌరవించాలి.
13మీరు హత్య చేయకూడదు.
14మీరు వ్యభిచారం చేయకూడదు.
15మీరు దొంగతనం చేయకూడదు.
16మీ పొరుగువారికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు.
17మీ పొరుగువాని ఇంటిని మీరు ఆశించకూడదు. మీ పొరుగువాని భార్యను గాని, అతని దాసుని గాని దాసిని గాని, అతని ఎద్దును గాని గాడిదను గాని, మీ పొరుగువానికి చెందిన దేన్ని మీరు ఆశించకూడదు.”
18ప్రజలు ఆ ఉరుములు మెరుపులు చూసి బూరధ్వని విని పర్వతం నుండి వస్తున్న పొగను చూసి, వారు భయంతో వణికారు. వారు దూరంగా నిలబడి 19మోషేతో, “నీవు మాతో మాట్లాడు మేము వింటాము. మాతో దేవుడు నేరుగా మాట్లాడవద్దు లేదా మేము చనిపోతాం” అన్నారు.
20అందుకు మోషే ప్రజలతో, “భయపడకండి. మిమ్మల్ని పరీక్షించడానికి దేవుడు వచ్చారు, తద్వార మీరు పాపం చేయకుండా దేవుని భయం మీలో ఉంటుంది” అని చెప్పాడు.
21దేవుడున్న ఆ కటికచీకటిని మోషే సమీపిస్తూ ఉండగా ప్రజలు దూరంగా ఉన్నారు.
విగ్రహాలు, బలిపీఠాలు
22తర్వాత యెహోవా మోషేతో, “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను పరలోకం నుండి మీతో మాట్లాడడం మీరే చూశారు. 23మీరు నాతో పాటు దేన్ని దేవుళ్ళుగా చేసుకోకూడదు; మీ కోసం వెండి దేవుళ్ళను గాని బంగారు దేవుళ్ళను గాని మీరు చేసుకోకూడదు.
24“ ‘నా కోసం మట్టితో బలిపీఠం తయారుచేసి దానిపై మీ దహనబలులను, సమాధానబలులను, మీ గొర్రెలను పశువులను అర్పించాలి. నేను ఎక్కడ నా పేరును ఘనపరచబడేలా చేసిన, నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. 25ఒకవేళ మీరు నా కోసం రాళ్లతో బలిపీఠం కడితే, దానిని చెక్కిన రాళ్లతో కట్టవద్దు, ఎందుకంటే వాటిపైన మీరు పనిముట్టు ఉపయోగిస్తే అది అపవిత్రం అవుతుంది. 26నా బలిపీఠం దగ్గరకు మెట్లు ఎక్కి వెళ్లవద్దు, ఎందుకంటే మీ లోపలి అవయవాలు కనబడతాయి.’
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నిర్గమ 20: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.