దానియేలు 10
10
దానియేలుకు వచ్చిన మనిషి యొక్క దర్శనం
1పర్షియా రాజైన కోరెషు పరిపాలన యొక్క మూడవ సంవత్సరంలో, దానియేలుకు (బెల్తెషాజరు అని పిలువబడేవాడు) ఒక ప్రత్యక్షత ఇవ్వబడింది. ఆ ప్రత్యక్షత యొక్క సందేశం నిజం, అది మహా యుద్ధం#10:1 లేదా నిజం, భారమైనది గురించిన విషయము. అతనికి ఆ వార్త యొక్క గ్రహింపు దర్శనంలో వచ్చింది.
2ఆ సమయంలో దానియేలు అనే నేను మూడు వారాలు విలపిస్తూ ఉన్నాను. 3నేను శ్రేష్ఠమైన ఆహారం తినలేదు; మాంసం కాని, ద్రాక్షరసం కాని నా పెదవులను తాకలేదు; మూడు వారాలు గడిచేవరకు సువాసనగల నూనె రాసుకోలేదు.
4మొదటి నెల ఇరవై నాలుగవ రోజున నేను మహా నది టైగ్రీసు ఒడ్డున నిలబడి ఉన్నాను, 5నేను తేరిచూడగా, నా ఎదుట సన్నని నారబట్టలు ధరించి నడుముకు ఊఫజు నుండి తెప్పించబడిన మేలిమి బంగారు నడికట్టు నడుముకు కట్టుకున్న మనిషి కనిపించాడు. 6అతని శరీరం గోమేధికంలా, అతని ముఖం మెరుపులా, అతని కళ్లు మండే దివిటీలలా, అతని కాళ్లు చేతులు మెరుగుపెట్టిన ఇత్తడిలా తళతళలాడుతూ ఉన్నాయి. అతని కంఠస్వరం గుంపు చేసే ధ్వనిలా ఉంది.
7దానియేలు అనే మాత్రమే ఆ దర్శనాన్ని చూసింది; నాతో ఉన్నవారు దానిని చూడలేదు, కాని వారు ఎంతో భయాబ్రాంతులై పారిపోయి దాక్కున్నారు. 8కాబట్టి నేనొక్కడినే ఈ గొప్ప దర్శనాన్ని చూస్తూ ఉండిపోయాను, ఈ గొప్ప దర్శనం చూశాను; నాలో బలం ఏమి లేదు, నా ముఖం ఎంతో పాలిపోయింది, నేను పూర్తిగా నీరసించిపోయాను. 9అప్పుడు అతడు మాట్లాడడం నేను విన్నాను, నేను వింటూ ఉండగా, సాష్టాంగపడి గాఢ నిద్రలోకి వెళ్లాను.
10ఒక చేయి నన్ను తాకి వణుకుతున్న నా మోకాళ్లు, అరచేతుల మీద నిలబెట్టింది. 11అతడు, “దానియేలూ! నీవు ఎంతో విలువైనవాడవు, నేను నీతో మాట్లాడే మాటలు శ్రద్ధగా ఆలోచించి, లేచి నిలబడు, ఎందుకంటే నేను నీ దగ్గరకు పంపబడ్డాను” అన్నాడు. అతడు ఇది చెప్పిన తర్వాత, నేను వణకుతూ లేచి నిలబడ్డాను.
12అప్పుడతడు అన్నాడు, “దానియేలూ, భయపడకు. నీవు గ్రహింపు కోసం నీ మనస్సును సిద్ధపరచుకుని, నిన్ను నీవు దేవుని ఎదుట తగ్గించుకున్న మొదటి రోజు నుండే నీ ప్రార్థనలు ఆలకించబడ్డాయి, వాటికి జవాబుగా నేను వచ్చాను. 13అయితే, పర్షియా రాజ్యాధిపతి ఇరవై ఒక రోజులు నన్ను ఎదిరించాడు. నేను పర్షియా రాజు ఎదుట ఉండిపోవలసి వచ్చింది కాబట్టి ప్రముఖ దేవదూతల్లో ఒకడైన మిఖాయేలు నాకు సహాయం చేయడానికి వచ్చాడు. 14ఇప్పుడు నీ ప్రజలకు భవిష్యత్తులో జరుగబోయే వాటిని నీకు వివరించడానికి వచ్చాను, ఎందుకంటే దర్శనం రాబోయే కాలం గురించి వచ్చింది.”
15అతడు ఇది నాకు చెప్తుండగా, నేను నా ముఖాన్ని నేల వైపుకు వంచుకొని ఏమి మాట్లాడలేకపోయాను. 16అప్పుడు మనిషిని పోలిన ఒక వ్యక్తి నా పెదవులు ముట్టాడు, నేను నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించాను. నా ఎదుట నిలుచున్న వ్యక్తితో అన్నాను, “నా ప్రభువా! ఈ దర్శనాన్ని బట్టి నేను వేదన చెందాను, నేను ఎంతో బలహీనంగా అయ్యాను. 17నా ప్రభువా, మీ దాసుడనైన నేను మీతో ఎలా మాట్లాడగలను? నా బలం పోయింది, కష్టంగా ఊపిరి తీసుకుంటున్నాను.”
18మనిషిని పోలిన ఆ వ్యక్తి మరలా నన్ను తాకి, నన్ను బలపరిచాడు. 19“నీవు ఎంతో విలువైనవాడవు, భయపడకు, సమాధానం! ఇప్పుడు ధైర్యం తెచ్చుకో! ధైర్యం తెచ్చుకో!” అని అతడు అన్నాడు.
అతడు నాతో మాట్లాడినప్పుడు నేను బలపరచబడ్డాను, “నా ప్రభువా, మీరు నాకు బలం కలిగించారు, కాబట్టి మాట్లాడండి” అని అన్నాను.
20కాబట్టి అతడు అన్నాడు, “నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? త్వరలో నేను పర్షియా రాజ్యాధిపతితో పోరాడడానికి తిరిగి వస్తాను, నేను వెళ్లిన తర్వాత, గ్రీసు అధిపతి వస్తాడు; 21అయితే ముందు సత్య గ్రంథంలో వ్రాయబడింది ఏంటో నీకు చెప్తాను. (వాళ్ళను ఎదిరించడానికి మీ అధిపతియైన మిఖాయేలు తప్ప ఎవరూ నా పక్షంగా నిలువరు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
దానియేలు 10: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.