కొలొస్సీ పత్రిక 4
4
1యజమానులారా, పరలోకంలో మీకు కూడా యజమాని ఉన్నాడని మీకు తెలుసు కాబట్టి, మీ దాసులకు సరియైనది న్యాయమైనది ఇవ్వండి.
మరిన్ని సూచనలు
2కృతజ్ఞత కలిగి మెలకువగా ఉండి, నిరంతరం ప్రార్థన చేయండి. 3నేను సంకెళ్ళతో ఉండడానికి కారణమైన క్రీస్తు మర్మాన్ని మేము ప్రకటించడానికి, మా సువార్త పరిచర్యకు దేవుడు ద్వారాలను తెరవాలని మాకోసం కూడా ప్రార్థన చేయండి. 4నేను ప్రకటించవలసినంత స్పష్టంగా ప్రకటించడానికి నా కోసం ప్రార్థన చేయండి. 5ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సంఘానికి బయటివారితో జ్ఞానంతో ప్రవర్తించండి. 6మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచిగా కృపతో నిండిన మాటలతో, అందరికి ఎలా జవాబు చెప్పాలో తెలిసిన వారిగా ఉండాలి.
చివరి శుభవచనాలు
7తుకికు నా సమాచారాన్ని మీకు తెలియజేస్తాడు. అతడు ప్రియ సహోదరుడు, ప్రభువులో నమ్మకమైన పరిచారకుడు నా తోటి సేవకుడు. 8మీరు మా స్ధితి తెలుసుకోవాలని, అతడు మీ హృదయాలను ప్రోత్సాహపరచాలనే ఉద్దేశంతో అతన్ని మీ దగ్గరకు పంపుతున్నాను. 9అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిము వస్తున్నాడు, అతడు మీలో ఒకడు. ఇక్కడి సంగతులన్ని వారు మీకు తెలియజేస్తారు.
10నా తోటి ఖైదీలైన అరిస్తర్కుకు బర్నబాకు దగ్గరి బంధువైన మార్కు మీకు వందనాలు చెప్తున్నారు. మార్కును గురించి మీరు ఇంతకుముందే సూచనలు అందుకున్నారు, కాబట్టి అతడు మీ దగ్గరకు వస్తే, అతన్ని చేర్చుకోండి.
11యూస్తు అనబడే యేసు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. దేవుని రాజ్యం కోసం నాతో ఉన్న జతపనివారి మధ్యలో, యూదులు వీరు మాత్రమే ఉన్నారు. వీరు నాకు ఆదరణ కలిగిస్తున్నారు.
12క్రీస్తు యేసు సేవకుడును మీలో ఒకడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు పరిపూర్ణులుగా ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించి పూర్తి నిశ్చయతగలవారై స్థిరంగా ఉండాలని, ఇతడు ఎప్పుడు మీ కోసం తన ప్రార్థనలో పోరాడుతూ ఉంటాడు. 13ఇతడు మీ కోసం, లవొదికయలో హియెరాపొలిలో ఉన్న వారి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడని ఇతన్ని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను.
14మన ప్రియ స్నేహితుడు వైద్యుడైన లూకా, సహోదరుడైన దేమా మీకు వందనాలు చెప్తున్నారు.
15లవొదికయలో ఉన్న సహోదరి సహోదరులకు, నుంఫాకు ఆమె గృహంలోని సంఘానికి నా వందనాలు తెలియజేయండి.
16ఈ ఉత్తరాన్ని మీరు చదివిన తర్వాత, లవొదికయలోని సంఘంలో కూడా చదివి వినిపించండి. అలాగే లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరు కూడా చదివించండి.
17అర్ఖిప్పుకు చెప్పండి: “ప్రభువు నుండి మీరు పొందిన పరిచర్యను మీరు పూర్తి చేసేటట్లు చూడండి.”
18పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను. నా సంకెళ్ళను జ్ఞాపకముంచుకోండి. కృప మీతో ఉండును గాక.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కొలొస్సీ పత్రిక 4: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.