అపొస్తలుల కార్యములు 27

27
రోమా దేశానికి ప్రయాణమైన పౌలు
1మేము ఓడ ఎక్కి ఇటలీ దేశానికి వెళ్లాలని నిర్ణయించినప్పుడు, పౌలు మరికొందరు ఖైదీలను చక్రవర్తి ఔగుస్తు సైనిక దళానికి చెందిన యూలి అనే శతాధిపతికి అప్పగించారు. 2మేము అద్రముత్తియ పట్టణం నుండి ఆసియా తీరప్రాంత పట్టణాల గుండా ప్రయాణించే ఓడ ఎక్కి, ప్రయాణించేటప్పుడు మాసిదోనియలోని థెస్సలొనీక పట్టణానికి చెందిన అరిస్తర్కు అనేవాడు మాతో ఉన్నాడు.
3మరుసటిరోజు మేము సీదోను పట్టణ ప్రాంతంలో దిగాం; యూలి శతాధిపతి పౌలు పట్ల దయ చూపించి, అతడు తన స్నేహితుల దగ్గరకు వెళ్లి తనకు అవసరమైన వాటిని సమకూర్చుకోవడానికి అతన్ని అనుమతించాడు. 4అక్కడినుండి మేము మళ్ళీ బయలుదేరి ప్రయాణిస్తున్నప్పుడు, గాలి మాకు వ్యతిరేక దిశలో వీస్తున్నందుకు కుప్ర దీవి చాటుగా ఓడను నడిపించాము. 5మేము కిలికియ పంఫులియా సముద్రతీరాలను దాటి, లుకియాలోని మూర అనే పట్టణానికి చేరుకొన్నాము. 6అక్కడ ఆ శతాధిపతి ఇటలీ దేశానికి వెళ్తున్న అలెక్సంద్రియ పట్టణానికి చెందిన ఓడను చూసి దానిలోనికి మమ్మల్ని ఎక్కించాడు. 7చాలా రోజులు మెల్లగా ప్రయాణించిన తర్వాత ఎంతో కష్టపడి క్నీదు పట్టణం చేరుకున్నాము. గాలి బలంగా వీస్తూ మమ్మల్ని ముందుకు పోనివ్వక పోవడంతో, సల్మోనేకు ఎదురుగా ఉన్న క్రేతు ద్వీపం చాటున మేము ప్రయాణించాము. 8మేము తీరం వెంబడి చాలా కష్టపడి ప్రయాణం చేసి, లసైయ పట్టణానికి ప్రక్కనే ఉన్న, మంచి ఓడల రేవు అని పిలువబడే స్థలానికి వచ్చాము.
9చాలా కాలం గడిచిపోయింది, ప్రయాణం చేయడం ఇప్పటికే ప్రమాదకరంగా మారింది, అప్పటికి ప్రాయశ్చిత్త దినం కూడా గతించింది. కాబట్టి పౌలు వారిని, 10“సహోదరులారా, మన ప్రయాణం ప్రమాదకరంగా ఉండబోతుంది ఓడకు దానిలోని సరుకులకును గొప్ప నష్టంరాబోతుంది మన ప్రాణాలకు కూడా ఆపద కలుగుతుందని నాకు అనిపిస్తుంది” అని హెచ్చరించాడు. 11కానీ శతాధిపతి, పౌలు చెప్పిన మాటలను వినకుండా, ఆ ఓడ యజమాని, ఓడ నడిపే వారి సలహాలను పాటించాడు. 12శీతాకాలంలో ఆ ఓడరేవు అనుకూలమైనది కాదు, మనం ఫీనిక్సు ఓడరేవును చేరుకొని అక్కడ శీతాకాలం గడపవచ్చు కాబట్టి మనం ముందుకే వెళ్దాం అని ఎక్కువ మంది నిర్ణయించారు. అది క్రేతులోని నైరుతి వాయువ్య దిశలకు ఎదురుగా ఉన్న ఓడల రేవు.
తుఫాను
13దక్షిణపు గాలి మెల్లగా వీయడం మొదలు పెట్టేటప్పటికి, వారికి అవకాశం ఉన్నట్లు అనిపించింది; కాబట్టి లంగరు పైకెత్తి క్రేతు తీరం వైపు ఓడను నడిపించారు. 14ఎక్కువసేపు అవ్వక ముందే, ఈశాన్యగాలి అని పిలువబడే, పెనుగాలి బలంగా వీయడంతో, ద్వీపం నుండి దూరంగా కొట్టుకొని పోయాము. 15ఓడ తుఫానులో చిక్కుకొని గాలికి ఎదురు నడిపించలేక మేము గాలికి కొట్టుకుపోయాము. 16కౌద అనే చిన్న ద్వీపం వైపు మేము వెళ్లినప్పుడు, చాలా కష్టంగా ఓడకు కట్టిన రక్షక పడవను కాపాడగలిగాము. 17వాటిని పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళను ఓడ అడుగు నుండి తీసి, రెండింటిని కలిపి గట్టిగా బిగించారు. తాము సూర్తి అనే ఇసుకదిబ్బలను గుద్దుకొంటామేమో అని భయపడి, ఓడ లంగరును క్రిందికి దించి, గాలితో ఓడ కొట్టుకొని పోయేలా చేశారు. 18తుఫాను గాలి భయంకరంగా కొడుతుంది కాబట్టి మరుసటిరోజు ఓడలోని సరుకులను సముద్రంలో పడవేయడం మొదలుపెట్టారు. 19మూడవ రోజు, వారు తమ చేతులతో ఓడను నడిపే సామాగ్రిని కూడా పడవేశారు. 20అనేక రోజులగా సూర్యుడు కాని నక్షత్రాలు కాని కనిపించలేదు. తుఫాను మరింత తీవ్రంగా మారింది. చివరికి మేము ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ పూర్తిగా పోయింది.
21వారు ఆ విధంగా ఆహారం లేకుండా చాలా రోజులు గడిపిన తర్వాత, పౌలు వారి ముందు నిలబడి వారితో, “సహోదరులారా, నేను ఇచ్చిన సలహాను మీరు విని క్రేతు నుండి బయలుదేరకుండా ఉండవలసింది; అప్పుడు మీకు ఈ ప్రమాదం గాని నష్టం కాని జరుగకపోయేది. 22ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే మీలో ఎవరికి ప్రాణహాని కలుగదు; కేవలం ఓడ మాత్రమే పాడైపోతుంది. 23నేను ఎవరికి చెందిన వాడినో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి, 24‘పౌలు భయపడకు. నీవు కైసరు ముందు విచారణకు నిలబడవలసి ఉంది. నీతో కూడ ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరి జీవితాలను దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు. 25అతడు నాకు చెప్పినట్లే జరుగుతుందని నాకు దేవునిలో విశ్వాసం ఉంది, కాబట్టి సహోదరులారా, మీరు ధైర్యం తెచ్చుకోండి. 26అయినప్పటికీ, మన ఓడ ఏదైనా ఒక ద్వీపం తగులుకోవాలి” అని చెప్పాడు.
ఓడ మునిగిపోవుట
27పద్నాలుగవ రోజు రాత్రి మేము ఇంకా అద్రియా సముద్రంలో కొట్టుకొనిపోతుండగా, ఇంచుమించు అర్థరాత్రి సమయంలో ఓడను నడిపేవారు ఒడ్డును సమీపిస్తున్నాం అని గ్రహించారు. 28వారు ఇనుప గుండు కట్టిన తాడు సముద్రంలో వేసి చూసి దానితో అక్కడ సుమారు నూట ఇరవై అడుగుల#27:28 లేదా సుమారు 37 మీటర్లు లోతుందని తెలుసుకున్నారు. మరికొద్ది సేపటికి సముద్రపు లోతును కనుగొనే దానిని మరలా వేసి తొంభై అడుగుల#27:28 లేదా సుమారు 27 మీటర్లు లోతుందని తెలుసుకొన్నారు. 29మేము రాతి దిబ్బలకు గుద్దుకొంటామేమో అనే భయంతో వారు నాలుగు లంగరులను ఓడ మూలలో నుండి క్రిందకు వేసి, పగటి వెలుగు కోసం ప్రార్థించాము. 30ఓడ నడిపేవారు ఓడలో నుండి పారిపోవాలని, తాము ఓడ ముందు భాగం నుండి కొన్ని లంగరులను పడవేయడానికి వెళ్తున్నట్లు నటిస్తూ రక్షక పడవను సముద్రంలోకి దింపారు. 31అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ మనుష్యులు ఓడలో ఉంటేనే తప్ప తమ ప్రాణాలను రక్షించుకోలేరు” అని చెప్పాడు. 32వెంటనే సైనికులు రక్షకపడవ దూరంగా కొట్టుకొని పోవడానికి దాని త్రాళ్లను కోసివేశారు.
33తెల్లవారుతునప్పుడు పౌలు వారందరిని ఆహారం తినమని వేడుకున్నాడు. “గత పద్నాలుగు రోజులనుండి ఏమి జరుగుతుందో అని మీరు ఏమి తినలేదు. 34మీరు బలహీనం కాకుండా దయచేసి భోజనం చేయండి, మీలో ఎవరి తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు” అని వారిని బ్రతిమాలాడు. 35అతడు ఈ మాటలను చెప్పిన తర్వాత, రొట్టెను తీసుకుని వారందరి ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి తినడం ప్రారంభించాడు. 36అప్పుడు వారందరు ధైర్యం తెచ్చుకుని కొంత ఆహారం తిన్నారు. 37ఓడలో మొత్తం 276 మంది వ్యక్తులం ఉన్నాము. 38వారు తమకు కావలసినంత ఆహారం తిన్న తర్వాత, ఓడను తేలిక చేయడానికి ధాన్యాన్ని సముద్రంలో పడవేశారు.
39పగటి వెలుగు వచ్చినప్పుడు, వారు ఆ ప్రాంతాన్ని గుర్తించలేదు, కాని ఇసుకతీరం ఉన్న సముద్రపు పాయను చూసి, సాధ్యమైతే దానిలోనికి ఓడను నడిపించాలి అనుకున్నారు. 40త్రాళ్లను కోసి లంగరులను సముద్రంలో విడిచిపెట్టారు అదే సమయంలో చుక్కానులకు కట్టిన త్రాళ్లను విప్పేసారు. తర్వాత తెరచాపలను గాలికి ఎత్తి తీరం వైపునకు నడిపించారు. 41కాని రెండు ప్రవాహాలు కలిసిన చోట ఇసుకలో ఓడ ముందు భాగం కూరుకొనిపోయి కదల్లేదు. అలల తాకిడికి ఓడ వెనుక భాగం ముక్కలుగా విరిగి పోసాగింది.
42ఖైదీలు ఈదుకుని పారిపోకుండా వారిని చంపేయాలని సైనికులు అనుకున్నారు. 43కానీ శతాధిపతి పౌలు ప్రాణాన్ని కాపాడాలనుకొని సైనికులను తాము అనుకున్న దానిని చేయకుండా ఆపివేసి, ఈత వచ్చినవారు మొదట సముద్రంలోకి దూకి ఒడ్డుకు చేరుకోవాలని, 44మిగిలిన వారు చెక్కపలకల మీద లేదా ఓడ చెక్కల మీద ఒడ్డుకు చేరుకోవాలని ఆదేశించాడు. ఆ విధంగా వారందరు క్షేమంగా ఒడ్డుకు చేరుకొన్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

అపొస్తలుల కార్యములు 27: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

అపొస్తలుల కార్యములు 27 కోసం వీడియో