2 పేతురు 1
1
1యేసు క్రీస్తు సేవకుడు అపొస్తలుడైన సీమోను పేతురు,
మన దేవుడు రక్షకుడైన యేసు క్రీస్తు నీతిని బట్టి మావలె అమూల్యమైన విశ్వాసం పొందినవారికి వ్రాయునది.
2మన ప్రభువైన యేసు యొక్క, దేవుని యొక్క జ్ఞానం ద్వారా మీకు కృపా సమాధానములు విస్తరించును గాక.
ఒకని పిలుపులోని నిశ్చయత మరియు ఎన్నిక
3తన సొంత మహిమ వలన మంచితనం వలన మనల్ని పిలిచినవాని గురించి మనకున్న జ్ఞానం ద్వారా ఆయన యొక్క దైవశక్తి, దైవిక జీవితాన్ని జీవించడానికి మనకు కావలసిన ప్రతిదానిని మనకు ఇస్తుంది. 4వీటి ద్వారా ఆయన మనకు మహత్తరమైన అమూల్యమైన వాగ్దానాలను ఇచ్చారు. అందుకే మీరు వాటి ద్వారా దైవిక స్వభావంలో పాలుపొందవచ్చు, చెడు కోరికల వల్ల ఈ లోకంలో కలిగిన భ్రష్టత్వం నుండి తప్పించుకోవాలి.
5దీనిబట్టే, మీ విశ్వాసానికి మంచితనాన్ని; మంచితనానికి వివేకాన్ని; 6వివేకానికి స్వీయ నియంత్రణ; స్వీయ నియంత్రణకు సహనాన్ని; సహనానికి దైవ భక్తిని; 7దైవ భక్తికి సోదర భావాన్ని; సోదర భావానికి ప్రేమను చేర్చడానికి కృషి చేయండి. 8మీకు అవసరమైన ఈ గుణాలు మీలో పరిపూర్ణంగా ఉంటే మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న జ్ఞానం మిమ్మల్ని పనిలేనివారిగా, ఫలించనివారిగా ఉండకుండా చేస్తుంది. 9అయితే ఇవి లేనివారు తన గత పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, గ్రుడ్డివారు దూరదృష్టిలేనివారిగా అవుతారు.
10కాబట్టి, సహోదరీ సహోదరులారా, మీ పిలుపును ఎన్నికను నిశ్చయం చేసుకోవడానికి కృషి చేయండి. ఒకవేళ మీరు వీటిని చేస్తే, ఎన్నడూ త్రొట్రిల్లరు 11అప్పుడు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శాశ్వత రాజ్యంలోనికి ఘనమైన స్వాగతం మీకు లభిస్తుంది.
లేఖనం యొక్క ప్రవచనము
12కనుక, మీకు తెలిసినవే అయినప్పటికి, మీరు అంగీకరించిన సత్యంలో స్థిరంగా ఉన్నప్పటికి నేను ఈ విషయాలను గురించి మీకు ఎల్లప్పుడు జ్ఞాపకం చేస్తాను. 13నేను ఈ శరీరమనే గుడారంలో జీవించినంత కాలం, ఈ సంగతులను గురించి మీకు జ్ఞాపకం చేయడం మంచిదని తలంచాను. 14ఎందుకంటే, నేను ఈ శరీరమనే గుడారాన్ని త్వరలో విడచిపెట్టబోతున్నాను, ఈ సంగతి మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు స్పష్టంగా చెప్పారు. 15కాబట్టి, నేను చనిపోయిన తరువాత కూడా మీరు నిత్యం ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకోడానికి ఆసక్తి కలిగి ఉండండి.
16మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క గొప్పశక్తి గల రాకడను మీకు చెప్పడంలో మేము తెలివైన కట్టుకథలు అనుసరించలేదు. మా కళ్లారా ఆయన మహా ప్రభావాన్ని చూశాము. 17ఆయన తండ్రియైన దేవుని నుండి ఘనత మహిమను పొందినపుడు, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను అని మహత్తరమైన మహిమ నుండి ఒక శబ్దం పలికింది.”#1:17 మత్తయి 17:5; మార్కు 9:7; లూకా 9:35 18ఈ శబ్దాన్నే మేము ఆయనతో కూడా పరిశుద్ధ పర్వతం మీద ఉన్నప్పుడు పరలోకం నుండి విన్నాము.
19కాబట్టి ప్రవక్తల సందేశాలను మరింత ఎక్కువగా నమ్ముతున్నాము, దానిని శ్రద్ధతో ఆలకించడం మీకు మంచిది, ఎందుకంటే, ఉదయ కాలపు వేకువచుక్క మీ హృదయాలను వెలుగుతో నింపే వరకు అది చీకటిలో వెలుగుతున్న దీపంలా ఉంది. 20అన్నిటికంటే ముఖ్యంగా దీన్ని మీరు తప్పక గుర్తుంచుకోండి. ఎవరూ తనంతట తానే లేఖనంలోని ప్రవచనాన్ని వివరించలేరు. 21ఎందుకంటే, మానవుని ఇష్టాన్ని బట్టి ప్రవచనం పుట్టదు, కాని ప్రవక్తలు పరిశుద్ధాత్మచేత ప్రభావితులై దేవుని నుండి వచ్చిన సందేశాన్నే పలికారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 పేతురు 1: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.