2 రాజులు 23
23
యోషీయా నిబంధనను పునరుద్ధరించుట
1అప్పుడు రాజు యూదాలో, యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు. 2అతడు యూదా ప్రజలతో, యెరూషలేము వాసులతో, యాజకులతో, ప్రవక్తలతో, అల్పుల నుండి ఘనులైన ప్రజలందరితో కలిసి యెహోవా ఆలయానికి వెళ్లాడు. అక్కడ రాజు, వారంతా వినేటట్టు యెహోవా మందిరంలో దొరికిన నిబంధన గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివి వినిపించాడు. 3రాజు ఒక స్తంభం దగ్గర నిలబడి, తన పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో యెహోవాను అనుసరిస్తానని, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు పాటిస్తానని, యెహోవా సన్నిధిలో నిబంధనను పునరుద్ధరించాడు, తద్వారా ఈ గ్రంథంలో వ్రాయబడిన నిబంధన మాటలన్నీ నిర్ధారించాడు. అప్పుడు ప్రజలందరు ఆ నిబంధనకు సమ్మతించారు.
4రాజు ప్రధాన యాజకుడైన హిల్కీయాను, తర్వాత స్థాయి యాజకులను, ద్వారపాలకులను పిలిపించి బయలుకు, అషేరాకు, నక్షత్ర సమూహాలన్నిటి కోసం చేయబడిన వస్తువులన్నిటిని, యెహోవా మందిరం నుండి తీసివేయాలని ఆదేశించాడు. అతడు వాటిని యెరూషలేము బయట కిద్రోను లోయలో కాల్చివేసి, ఆ బూడిద బేతేలుకు తీసుకెళ్లాడు. 5అంతకుముందు యూదా పట్టణాల్లో, యెరూషలేము చుట్టూ క్షేత్రాల్లో ధూపం వేయడానికి యూదా రాజులు నియమించిన విగ్రహాల పూజారుల బృందాన్ని అతడు తొలగించాడు. వారు బయలుకు, సూర్యునికి, చంద్రునికి, నక్షత్ర సమూహాలన్నిటికి వేసేవారు. 6అతడు యెహోవా మందిరం నుండి యెరూషలేము బయట ఉన్న కిద్రోను లోయ దగ్గరకు అషేరా స్తంభాన్ని తెప్పించి, అక్కడ దానిని కాల్చివేశాడు. అతడు దానిని పొడిగా నలుగగొట్టి ఆ పొడిని సాధారణ ప్రజల సమాధుల మీద చల్లాడు. 7అతడు యెహోవా మందిరంలో ఉన్న పురుష వ్యభిచారుల గదులను పడగొట్టించాడు, అక్కడ స్త్రీలు అషేరాకు వస్త్రాలను అల్లేవారు.
8యోషీయా యూదా పట్టణాల్లో ఉన్న యాజకులందరిని యెరూషలేముకు తెప్పించి ఆ యాజకులు ధూపం వేసే క్షేత్రాలను గెబా నుండి బెయేర్షేబ వరకు అపవిత్రపరచాడు. అతడు యెరూషలేము నగర అధికారియైన యెహోషువ ఇంటి ద్వారం ఎడమవైపు ఉన్న క్షేత్రాలను పడగొట్టించాడు. 9క్షేత్రాల దగ్గర సేవ చేసిన ఆ యాజకులు యెరూషలేములో ఉన్న యెహోవా బలిపీఠం దగ్గర సేవ చేయలేదు, కాని వారు తమ తోటి యాజకుల దగ్గర పులియని రొట్టెలు తినేవారు.
10తర్వాత ఎవరు కూడా తన కుమారుని గాని, కుమార్తెను గాని మోలెకు విగ్రహం ముందు అగ్నిగుండం దాటించకుండా ఉండేలా అతడు బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతు అనే స్థలాన్ని అపవిత్రపరచాడు. 11యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలను అతడు యెహోవా ఆలయ ద్వారం నుండి తొలగించాడు. అవి నాతాన్-మెలెకు అనే అధికారి గదికి సమీపంలో ఉన్న ఆవరణంలో ఉన్నాయి. యోషీయా సూర్యునికి అంకితం చేయబడిన రథాలను కాల్చివేశాడు.
12అతడు ఆహాజు మేడమీది పైకప్పు మీద యూదా రాజులు కట్టించిన బలిపీఠాన్ని, యెహోవా మందిరం యొక్క రెండు ఆవరణాల్లో మనష్షే కట్టించిన బలిపీఠాన్ని పడగొట్టాడు. వాటిని అక్కడినుండి తీసివేసి, ముక్కలు ముక్కలుగా చేసి, ఆ ముక్కలను కిద్రోను లోయలో పారవేశాడు. 13గతంలో ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెరూషలేముకు ఎదురుగా ఉన్న అవినీతి పర్వతానికి దక్షిణం వైపు సీదోనీయుల హేయ దేవత అష్తారోతుకు, మోయాబీయుల హేయ దేవుడైన కెమోషుకు, అమ్మోనీయుల హేయ దేవుడైన మిల్కోముకు#23:13 కొ.ప్ర.లలో మోలెకు కట్టించిన క్షేత్రాలను అపవిత్రం చేశాడు. 14యోషీయా పవిత్ర రాళ్లను పగులగొట్టి, అషేరా స్తంభాలను పడగొట్టాడు, ఆ స్థలాలను మనుష్యుల ఎముకలతో నింపాడు.
15బేతేలులో ఉన్న బలిపీఠాన్ని, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము కట్టిన పూజా స్థలాన్ని కూడా అతడు పడగొట్టాడు. ఆ క్షేత్రాన్ని కాల్చివేసి పొడి చేశాడు, అషేరా స్తంభాన్ని కూడా కాల్చివేశాడు. 16అప్పుడు యోషీయా చూడగా ఆ కొండమీద, అతనికి ఆ కొండమీద సమాధులు కనిపించినప్పుడు, అతనికి ఆ సమాధుల్లో నుండి ఎముకలను తీయించి, బలిపీఠాన్ని అపవిత్ర పరచడానికి వాటిని దాని మీద కాల్చివేశాడు. గతంలో దైవజనుడు చాటించిన యెహోవా వాక్కు ప్రకారం ఇది జరిగింది.
17రాజు, “నాకు కనిపిస్తున్న ఆ సమాధి రాయి ఏంటి?” అని అడిగాడు.
అందుకు ఆ పట్టణస్థులు చెప్పారు, “అది యూదా నుండి వచ్చిన దైవజనుని సమాధి. మీరు బేతేలులో ఉన్న బలిపీఠానికి చేసిన దాని గురించి ప్రకటించింది అతడే” అని చెప్పారు.
18యోషీయా, “అది అలాగే ఉంచండి. ఆయన ఎముకలను తీయనీయకండి” అని చెప్పగా వారు అతని ఎముకలను సమరయ నుండి వచ్చిన ప్రవక్త ఎముకలతో పాటు అలానే ఉండనిచ్చారు.
19అతడు బేతేలులో ఎలా చేశాడో అలాగే, ఇశ్రాయేలు రాజులు సమరయ పట్టణాల్లో కట్టి యెహోవాకు కోపం రేపిన ఎత్తైన స్థలాల్లో ఉన్న క్షేత్రాలన్నిటినీ యోషీయా తీసివేశాడు. 20యోషీయా ఆ క్షేత్రాల పూజారులందరినీ బలిపీఠాల మీద వధించాడు, మనుష్యుల ఎముకలను వాటి మీద కాల్చివేశాడు. తర్వాత అతడు యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
21రాజు ప్రజలందరికి, “నిబంధన గ్రంథంలో వ్రాయబడినట్టు, మీరు మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. 22అలాంటి పస్కా పండుగ ఇశ్రాయేలు ప్రజలను న్యాయం తీర్చిన న్యాయాధిపతుల కాలం నుండి ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు పరిపాలించిన కాలం వరకు ఎన్నడూ ఆచరించలేదు. 23అయితే యోషీయా రాజు పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో యెరూషలేములో ఈ పస్కా పండుగ యెహోవాకు జరిగింది.
24అంతేకాక యోషీయా కర్ణపిశాచులను, ఆత్మలతో మాట్లాడేవారిని, గృహదేవతలు, విగ్రహాలు, యూదాలో యెరూషలేములో కనిపించే ఇతర అసహ్యకరమైన వస్తువులన్నిటిని తీసివేసి యాజకుడైన హిల్కీయాకు యెహోవా మందిరంలో దొరికిన గ్రంథంలో వ్రాయబడిన ధర్మశాస్త్ర విధులను నెరవేర్చడానికి అతడు ఇలా చేశాడు. 25అతడు పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణబలంతో యెహోవా వైపు తిరిగి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తించాడు. అతనికంటే ముందు కాని అతని తర్వాత కాని, అతనిలాంటి రాజు ఎవరూ లేరు.
26అయినా యెహోవాకు యూదా మీద ఉన్న మహా కోపం తగ్గలేదు, ఎందుకంటే మనష్షే చేసినదంతటిని బట్టి ఆయన కోపం రగులుకుంది. 27కాబట్టి యెహోవా అన్నారు, “నేను ఇశ్రాయేలు ప్రజలను చేసినట్టు యూదా ప్రజలను కూడా నా సముఖంలో లేకుండా చేస్తాను. నేను ఎన్నుకున్న యెరూషలేము పట్టణాన్ని, ‘నా పేరు అక్కడ ఉంటుంది’#23:27 1 రాజులు 8:29 అని చెప్పిన మందిరాన్ని విసర్జిస్తాను” అన్నారు.
28యోషీయా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
29యోషీయా రాజుగా ఉన్నప్పుడు, ఈజిప్టు రాజైన ఫరో నెకో యూఫ్రటీసు నది దగ్గర అష్షూరు రాజుకు యుద్ధంలో సహాయపడడానికి వెళ్లాడు. రాజైన యోషీయా అతన్ని ఎదుర్కోబోయాడు, అయితే నెకో అతన్ని మెగిద్దో దగ్గర చంపాడు. 30యెషీయా సేవకులు అతని మృతదేహాన్ని మెగిద్దో నుండి యెరూషలేముకు రథంలో తీసుకువచ్చి అతని సమాధిలో పాతిపెట్టారు. దేశ ప్రజలు యోషీయా కుమారుడైన యెహోయాహాజును అభిషేకించి, అతని తండ్రి స్థానంలో అతన్ని రాజుగా చేశారు.
యూదా రాజైన యెహోయాహాజు
31యెహోయాహాజు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు, అతడు యెరూషలేములో మూడు నెలలు పరిపాలించాడు. అతని తల్లి యిర్మీయా కుమార్తెయైన హమూటలు, ఆమె లిబ్నా పట్టణస్థురాలు. 32అతడు తన పూర్వికులు చేసినట్టే యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. 33అతడు యెరూషలేములో పరిపాలించకుండా ఫరో నెకో అతన్ని హమాతు ప్రదేశంలో ఉన్న రిబ్లాలో ఖైదీగా చేశాడు, యూదా మీద వంద తలాంతుల#23:33 అంటే, సుమారు 3.75 టన్నులు వెండిని, ఒక తలాంతు#23:33 అంటే, సుమారు 34 కి. గ్రా. లు బంగారాన్ని పన్నుగా విధించాడు. 34ఫరో నెకో యోషీయా కుమారుడైన ఎల్యాకీమును యోషీయా స్థానంలో రాజుగా చేసి, అతని పేరును యెహోయాకీముగా మార్చాడు. అయితే యెహోయాహాజును ఈజిప్టుకు తీసుకెళ్లాడు, అతడు అక్కడ చనిపోయాడు. 35ఫరో నెకో నిర్ణయించిన ఆ వెండి బంగారాలు యెహోయాకీము అతనికి ఇచ్చాడు. అలా చేయడానికి దేశం మీద పన్ను నిర్ణయించి దేశ ప్రజల నుండి వెండి బంగారాలు వసూలు చేయించాడు.
యూదా రాజై యెహోయాకీము
36యెహోయాకీము రాజైనప్పుడు, అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి, పెదాయా కుమార్తెయైన జెబూదా, ఆమె రూమా పట్టణస్థురాలు. 37అతడు తన పూర్వికులు చేసినట్టే యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 23: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.