2 రాజులు 21

21
యూదా రాజైన మనష్షే
1మనష్షే రాజైనప్పుడు అతని వయస్సు పన్నెండేళ్ళు, అతడు యెరూషలేములో యాభై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హెఫ్సిబా. 2అతడు యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్లగొట్టిన జనాలు చేసే హేయక్రియలు చేశాడు. 3తన తండ్రి హిజ్కియా పడగొట్టిన క్షేత్రాలను అతడు తిరిగి కట్టించాడు; ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్టు అతడు బయలు బలిపీఠాలను కట్టి, అషేరా స్తంభాన్ని చేశాడు. అతడు నక్షత్ర సమూహమంతటికి మ్రొక్కి వాటిని పూజించాడు. 4యెహోవా తన మందిరాన్ని ఉద్దేశించి, “యెరూషలేములో నా పేరు ఉంచుతాను” అని చెప్పిన ఆ యెహోవా మందిరంలో అతడు బలిపీఠాలను కట్టించాడు. 5యెహోవా మందిరంలో ఉన్న రెండు ఆవరణాల్లో నక్షత్ర సమూహమంతటికి అతడు బలిపీఠాలు కట్టించాడు. 6అతడు తన సొంత కుమారుడిని అగ్నిలో బలి ఇచ్చాడు, భవిష్యవాణిని ఆచరించాడు, శకునాలను కోరాడు, మృతులతో మాట్లాడేవారిని ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం రేపాడు.
7అతడు చెక్కించిన అషేరా స్తంభాన్ని తీసి ఆలయంలో నిలిపాడు. ఆ ఆలయం గురించి యెహోవా దావీదుకు, అతని కుమారుడైన సొలొమోనుకు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో, ఈ దేవాలయంలో నా పేరు నిత్యం ఉంచుతాను. 8నేను వారికి నా సేవకుడైన మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రమంతటిని ఆచరిస్తూ నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా వారు పాటిస్తే, వారి పూర్వికులకు ఇచ్చిన దేశంలో నుండి నేను ఇశ్రాయేలీయుల పాదాలను తిరిగి వెళ్లనివ్వను” అని చెప్పారు. 9అయితే ప్రజలు మాట వినలేదు. మనష్షే వారిని తప్పుదారి పట్టించాడు, కాబట్టి ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండ యెహోవా నాశనం చేసిన దేశాల కంటే ఎక్కువ చెడు చేశారు.
10యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలా మాట్లాడారు: 11“యూదా రాజైన మనష్షే ఈ అసహ్యకరమైన పాపాలు చేశాడు. అతనికంటే ముందు ఉన్న అమోరీయుల కంటే మించి చెడు చేశాడు, అతడు విగ్రహాలతో యూదాను తప్పుదారి పట్టించాడు. 12కాబట్టి ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను యెరూషలేము మీదికి, యూదా మీదికి విపత్తు రప్పిస్తాను. ఆ విపత్తును గురించి విన్న వారందరి చెవులు గింగురుమంటాయి. 13నేను సమరయకు వ్యతిరేకంగా ఉపయోగించిన కొలమానాన్ని, అహాబు ఇంటిపై ఉపయోగించిన మట్టపు గుండును యెరూషలేము మీద వ్రేలాడదీస్తాను. ఒకడు గిన్నె తుడిచి బోర్లించినట్టు నేను యెరూషలేమును తుడిచివేస్తాను. 14వారసత్వంగా ఉన్న నా ప్రజల్లో మిగిలిన వారి చేయి విడిచి, వారిని శత్రువుల చేతికి అప్పగిస్తాను. వారు తమ శత్రువులందరిచేత దోచుకోబడతారు; 15వారి పూర్వికులు ఈజిప్టు నుండి వచ్చిన రోజు నుండి ఈ ఒక రోజు వరకు నా దృష్టిలో చెడుగా ప్రవర్తిస్తూ నాకు కోపం రేపారు.”
16యూదా వారు యెహోవా దృష్టిలో తప్పుగా ప్రవర్తించేటట్టు మనష్షే వారిని తప్పుదారి పట్టించడమే గాక, చాలామంది నిరపరాధుల రక్తాన్ని, యెరూషలేము ఆ చివర నుండి ఈ చివర వరకు చిందించాడు.
17మనష్షే పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిన పాపం గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? 18మనష్షే చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. ఉజ్జా తోటలో అతని రాజభవన తోటలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన ఆమోను రాజయ్యాడు.
యూదా రాజైన ఆమోను
19ఆమోను రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో రెండేళ్ళు పరిపాలించాడు. అతని తల్లి హారూసు కుమార్తెయైన మెషుల్లెమెతు; ఆమె యోత్బా పట్టణానికి చెందినది. 20అతడు తన తండ్రి మనష్షేలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. 21అతడు తన తండ్రి జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరిస్తూ, తన తండ్రి కొలిచిన విగ్రహాలను కొలిచి పూజించేవాడు. 22అతడు తన పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టాడు, ఆయన మార్గాలను అనుసరించలేదు.
23ఆమోను సేవకులు అతని మీద కుట్రపన్ని, అతని సొంత భవనంలోనే రాజును చంపారు. 24అప్పుడు యూదా దేశ ప్రజలు ఆమోను రాజు మీద కుట్రపన్నిన వారినందరిని చంపేశారు. అతని స్థానంలో అతని కుమారుడైన యోషీయాను రాజుగా చేశారు.
25ఆమోనును పరిపాలన గురించిన ఇతర విషయాలు అతడు చేసినవి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. 26వారు అతన్ని ఉజ్జా తోటలో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన యోషీయా రాజయ్యాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 21: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి