2 దినవృత్తాంతములు 8
8
సొలొమోను ఇతర కార్యకలాపాలు
1సొలొమోను యెహోవా మందిరాన్ని, తన సొంత భవనాన్ని కట్టించడానికి తీసుకున్న ఇరవై సంవత్సరాలు ముగిసిన తర్వాత, 2హీరాము#8:2 హెబ్రీలో హీరాము మరో రూపం హూరాము; 18 వచనంలో కూడా అతనికి ఇచ్చిన గ్రామాలను సొలొమోను మరలా కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను స్థిరపరిచాడు. 3తర్వాత సొలొమోను హమాత్-సోబా పట్టణం మీదికి వెళ్లి, దానిని స్వాధీనపరచుకున్నాడు. 4అతడు ఎడారిలో తద్మోరును, హమాతులో తాను కట్టించిన దుకాణ పట్టణాలన్నిటిని కూడా నిర్మించాడు. 5ఎగువ బేత్-హోరోనును, దిగువ బేత్-హోరోనును కోటగోడలతో, ద్వారాలతో, అడ్డగడియలతో కోటగోడలు గల పట్టణాలుగా కట్టించాడు. 6అలాగే బయలతు, తన ధాన్యాగారాలను, తన రథాలకు, గుర్రాలకు పట్టణాలను, యెరూషలేములో, లెబానోనులో, తాను పరిపాలించే ప్రదేశమంతటిలో తాను కట్టించాలనుకున్న వాటన్నిటిని సొలొమోను కట్టించాడు.
7హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు (ఈ ప్రజలు ఇశ్రాయేలీయులు కాదు) ఇంకా అక్కడ మిగిలి ఉన్నారు. 8ఇశ్రాయేలీయులు నాశనం చేయకుండ వదిలిన ఈ ప్రజలందరి వారసులను సొలొమోను ఈనాటికీ బానిసలుగా పని చేయడానికి నిర్బంధించాడు. 9అయితే సొలొమోను ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరిని తన పని కోసం బానిసలుగా చేయలేదు; వారు అతని సైనికులు, అతని సేనాధిపతుల అధిపతులు, రథాలకు, రథసారధులకు అధిపతులుగా ఉన్నారు. 10అంతేకాక, వారిలో రెండువందల యాభైమంది సొలొమోను రాజు ప్రజల మీద నియమించిన ముఖ్య అధికారులు కూడా ఉన్నారు.
11సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి ఆమె కోసం కట్టించిన భవనానికి తీసుకువచ్చాడు. ఎందుకంటే, ఆయన, “ఇశ్రాయేలీయుల రాజైన దావీదు భవనంలో నా భార్య నివసించకూడదు. ఎందుకంటే యెహోవా మందసం ప్రవేశించిన స్థలాలు పరిశుద్ధమైనవి” అనుకున్నాడు.
12తర్వాత సొలొమోను తాను మంటపం ముందు కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పించాడు. 13మోషే ఇచ్చిన ఆజ్ఞ ననుసరించి ప్రతిరోజు పాటించవలసిన విధి ప్రకారం సబ్బాతు దినాల్లో, అమావాస్యలప్పుడు పులియని రొట్టెల పండుగ, వారాల పండుగ,#8:13 లేదా వార పండుగ నిర్గమ 34:22; లేవీ 23:15-22; తదనంతరం పెంతెకొస్తు పండుగ అని పిలువబడింది. అపొ. కా. 2:1 ఈనాడు ఇది షావౌట్ లేదా షాబౌట్ అని పిలువబడుతుంది గుడారాల పండుగ అనే మూడు వార్షిక పండుగలప్పుడు యెహోవాకు దహనబలులు అర్పించేవాడు. 14తన తండ్రి దావీదు శాసనానికి అనుగుణంగా, అతడు వారి సేవలను జరిగించడానికి యాజకుల విభాగాలను, ప్రతిరోజు అవసరాన్ని బట్టి యాజకులకు సహాయం చేయడానికి, స్తుతి చేయడానికి లేవీయులను నియమించాడు. ప్రతి ద్వారానికి వంతు ప్రకారం ద్వారపాలకులుగా ఉండడానికి మనుష్యులను నియమించాడు. అతడు వివిధ ద్వారాలకు విభాగాల ప్రకారం ద్వారపాలకులను నియమించాడు. ఎందుకంటే ఇలా చేయాలని దైవజనుడైన దావీదు ఆదేశించాడు. 15వారు యాజకులకు లేవీయులకు సంబంధించిన విషయాల్లో, ఖజానాల విషయంతో సహా ఏ విషయంలోనూ రాజు ఆజ్ఞలను మీరలేదు.
16యెహోవా మందిరం పునాది వేయబడ్డప్పటి నుండి మందిరం పని మొత్తం ముగిసేవరకు సొలొమోను పనినంతా చేయించాడు. యెహోవా మందిరం పూర్తి అయింది.
17అప్పుడు సొలొమోను ఎదోము యొక్క సముద్రతీరాన ఉన్న ఏలతు దగ్గర ఉన్న ఎసోన్-గెబెరు ప్రాంతానికి వెళ్లాడు. 18హీరాము తన సేవకుల ద్వారా ఓడలను, సముద్రం గురించి తెలిసిన తన నావికులను పంపించాడు. వారు సొలొమోను మనుష్యులతో పాటు బయలుదేరి ఓఫీరుకు చేరి అక్కడినుండి సుమారు 450 తలాంతుల#8:18 అంటే, సుమారు 17 టన్నులు బంగారాన్ని తెచ్చి రాజైన సొలొమోనుకు అందజేశారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 8: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.