2 దినవృత్తాంతములు 20:3-12

2 దినవృత్తాంతములు 20:3-12 TSA

యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారణ చేద్దామని నిశ్చయించుకున్నాడు, అంతేగాక యూదా ప్రజలంతా ఉపవాసం ఉండాలని ప్రకటన చేయించాడు. సాయం చేయమని యెహోవాను ప్రాధేయపడడానికి యూదా ప్రజలంతా సమకూడారు; ఆయనను సహాయం అడగడానికి యూదాలోని ప్రతి పట్టణం నుండి ప్రజలు వచ్చారు. అప్పుడు యెహోషాపాతు యూదా, యెరూషలేము సమాజంలో క్రొత్త ప్రాంగణం ముందు ఉన్న యెహోవా మందిరంలో నిలబడి, ఇలా ప్రార్థించాడు: “యెహోవా మా పూర్వికుల దేవా, పరలోకంలో ఉన్న దేవుడు మీరు కాదా? మీరు ప్రజల రాజ్యాలన్నిటినీ పరిపాలిస్తున్నారు. బలప్రభావాలు మీ చేతిలో ఉన్నాయి, మీకు వ్యతిరేకంగా ఎవరు నిలబడలేరు. మా దేవా! మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశంలో కాపురమున్న వారిని మీరు వెళ్లగొట్టి, మీ స్నేహితుడైన అబ్రాహాము వారసులకు శాశ్వతంగా ఈ దేశాన్ని ఇవ్వలేదా? వారు ఇక్కడ నివాసముండి మీ పేరట ఇక్కడ పరిశుద్ధాలయం కట్టారు. వారు, ‘ఒకవేళ మా మీదికి విపత్తుగానీ, తీర్పు అనే ఖడ్గమే గాని తెగులే గాని కరువే గాని వస్తే మీ నామం కలిగిన ఈ మందిరం ముందు మేము మీ సన్నిధిలో నిలబడి మా ఆపదలో మీకు మొరపెడితే మీరు మా మొర విని మమ్మల్ని రక్షిస్తారు’ అన్నారు. “అయితే ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు వారిని అమ్మోను, మోయాబు, శేయీరు పర్వతం నుండి వచ్చిన వారితో యుద్ధం చేయడానికి మీరు అనుమతించలేదు; కాబట్టి ఇశ్రాయేలీయులు వారిని నాశనం చేయకుండా వారి నుండి వెళ్లిపోయారు. మీరు మాకు వారసత్వంగా ఇచ్చిన స్వాస్థ్యం నుండి వారు మమ్మల్ని తోలివేయడానికి వచ్చి వారు మాకు ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడండి. మా దేవా, మీరు వారికి తీర్పు తీర్చరా? ఎందుకంటే మాపై దాడి చేస్తున్న ఈ మహా సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి మాకు లేదు. ఏం చేయాలో మాకు తెలియదు, కానీ మీ సహాయం కోసమే చూస్తున్నాము.”