1 పేతురు పత్రిక 1

1
1యేసు క్రీస్తు అపొస్తలుడైన పేతురు,
దేవునిచేత ఎన్నుకోబడినవారు ఎవరైతే పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియ ప్రాంతాలకు చెదరిపోయి ప్రవాసులుగా జీవిస్తున్నారో వారికి వ్రాయునది. 2తండ్రియైన దేవుని భవిష్యత్ జ్ఞానాన్నిబట్టి, మీరు యేసు క్రీస్తుకు విధేయులు కావడానికి ఆయన రక్తం ప్రోక్షణకు ఆయన మిమ్మల్ని ఎన్నుకుని తన ఆత్మ చేత పవిత్రులు చేశారు:
మీకు కృపా సమాధానాలు సమృద్ధిగా కలుగును గాక.
సజీవ నిరీక్షణ బట్టి దేవునికి స్తోత్రం
3మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక! మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగేలా, ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరల జన్మింపజేసారు. 4ఎన్నడు నశించనిది, కొల్లగొట్టలేనిది, వాడిపోనిదైన వారసత్వాన్ని పరలోకంలో మన కోసం భద్రపరిచారు. 5చివరి రోజుల్లో ప్రకటించబడే రక్షణ మీకు కలిగేలా విశ్వాసం ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడుతున్నారు, ఆ వారసత్వం పరలోకంలో మీ కోసం భద్రపరచబడి ఉంది. 6మీరు ఎదుర్కోవలసిన అనేక విధాలైన పరీక్షలవల్ల ఇప్పుడు తాత్కాలికంగా మీకు బాధ కలిగినప్పటికి వీటన్నిటిలో మీరు అధికంగా సంతోషించండి. 7అవి మీ విశ్వాసం యథార్థమైనదని నిరూపిస్తాయి. నాశనమయ్యే బంగారం అగ్నిచేత పరీక్షించబడుతుంది; అలాగే బంగారం కంటే ఎంతో విలువైన మీ విశ్వాసం కూడ పరీక్షింపబడాలి. అప్పుడే అది చెడిపోకుండా నిలిచి ఉంటుంది. దానివల్ల యేసు క్రీస్తు ప్రత్యక్షమైన రోజున కీర్తి, మహిమ, ఘనతలు కలుగుతాయి. 8మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకపోయినా నమ్ముతున్నారు. వివరించలేని తేజోమయమైన ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు. 9ఎలాగంటే, మీ విశ్వాసానికి ఫలితంగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుతున్నారు.
10మీకు కలుగబోయే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి తీవ్రంగా చాలా జాగ్రత్తగా విచారించి పరిశోధించారు. 11క్రీస్తు అనుభవించాల్సిన కష్టాలను, దాని వలన వచ్చే మహిమ గురించి వారు ప్రవచించినప్పుడు వారిలో ఉన్న క్రీస్తు ఆత్మ ఏ పరిస్థితులను ఏ సమయాన్ని సూచించాడో వారు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. 12పరలోకం నుండి పంపబడి పరిశుద్ధాత్మచే ప్రభావితులై మీకు సువార్తను ప్రకటించినవారి ద్వారా మీకు ఇప్పుడు చెప్పబడిన సంగతులను వారు చెప్పినప్పుడు, తమ కోసం కాదు కాని మీ కొరకే తాము పరిచర్య చేశారనే సంగతి వారికి వెల్లడి చేయబడింది. వీటిని దేవదూతలు సహితం చూడాలని ఆశించారు.
పరిశుద్ధులుగా ఉండండి
13కాబట్టి, మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధిగల మనస్సులతో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. 14మీరు విధేయత కలిగిన బిడ్డలు కాబట్టి, అజ్ఞానంలో ఉన్నప్పుడు మీకు గల చెడ్డకోరికలకు అనుగుణంగా ప్రవర్తించకండి. 15మిమ్మల్ని పిలచిన దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి మీ ప్రవర్తనలో మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. 16ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను, కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి”#1:16 లేవీ 11:44,45; 19:2 అని వ్రాయబడి ఉంది.
17పక్షపాతం లేకుండా ప్రతివారికి వారి వారి పనిని బట్టి తీర్పు తీర్చే దేవున్ని మీరు తండ్రీ అని పిలుస్తున్నారు కాబట్టి ఈ లోకంలో విదేశీయులుగా మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి. 18ఎలాగంటే, మీ పితరుల నుండి మీకు లభించిన వ్యర్థమైన జీవన విధానం నుండి మీకు విముక్తి ఇవ్వడానికి ఏమి అర్పించబడిందో మీకు తెలుసు. అది నశించిపోయే వెండి బంగారాల వంటిది కాదు. 19అయితే నిష్కళంకమైన లోపం లేని గొర్రెపిల్ల వంటి క్రీస్తు అమూల్యమైన రక్తం చేత మీరు విమోచించబడ్డారు. 20లోకం సృజింపబడక ముందే ఆయన దేవునిచే ఎన్నుకోబడ్డారు కాని మీ కోసం ఈ చివరి కాలాల్లో బయలుపరచబడ్డారు. 21మీరు ఆయన ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తి ఆయనను మహిమ పరచిన దేవున్ని విశ్వసిస్తున్నారు, కాబట్టి మీ విశ్వాసం నిరీక్షణ దేవునిలో ఉంచబడ్డాయి.
22ఇప్పుడు సత్యానికి విధేయులై మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకుంటున్నారు. తద్వారా తోటి విశ్వాసులపై నిజమైన ప్రేమ కలిగి ఉండి, ఒకరినొకరు హృదయపూర్వకంగా#1:22 కొ.ప్రా.ప్ర.లలో స్వచ్ఛమైన హృదయంతో అధికంగా ప్రేమించుకోండి. 23ఎలాగంటే సజీవమైన, శాశ్వతమైన దేవుని వాక్యం ద్వారా మీరు క్షయబీజం నుండి కాక అక్షయబీజం నుండి తిరిగి జన్మించారు. 24ఎందుకనగా,
“ప్రజలందరు గడ్డి వంటివారు,
వారి వైభవం అంతా పొలంలోని పువ్వు వంటిది;
గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి,
25కాని దేవుని వాక్యం నిత్యం నిలిచి ఉంటుంది.”#1:25 యెషయా 40:6-8
ఈ వాక్యమే మీకు ప్రకటించబడింది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 పేతురు పత్రిక 1: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి