1 కొరింథీ 14
14
ఆరాధనలో స్పష్టత
1ప్రేమను వెదకండి, ఆత్మ వరాలను ఆసక్తితో కోరుకోండి. మరి ముఖ్యంగా ప్రవచన వరాన్ని ఆశించండి. 2భాషలలో మాట్లాడేవారు మానవులతో కాదు కాని దేవునితో మాట్లాడతారు. ఎవరూ వాటిని అర్థం చేసుకోలేరు; ఆత్మ ద్వారా వారు రహస్యాలను పలుకుతున్నారు. 3అయితే ప్రవచించేవారు మానవులను బలపరచడానికి, ప్రోత్సాహం, ఆదరణ కలిగించడానికి వారితో మాట్లాడుతున్నారు. 4భాషలలో మాట్లాడేవారు తనకు తానే జ్ఞానాభివృద్ధి చేసుకుంటారు, కాని ప్రవచించేవారు సంఘానికి అభివృద్ధి కలుగజేస్తారు. 5మీరందరు భాషలలో మాట్లాడాలని నా కోరిక కాని, మీరు ప్రవచించాలని మరి ఎక్కువగా కోరుతున్నాను. భాషలలో మాట్లాడేవారు తెలిపిన దానికి సంఘం అభివృద్ధి చెందేలా మరొకరు అర్థం తెలియచేస్తేనే తప్ప, భాషలలో మాట్లాడేవారి కంటే ప్రవచించేవారే గొప్పవారు.
6కనుక సహోదరీ సహోదరులారా, నేను మీ దగ్గరకు వచ్చి ప్రత్యక్షతను లేదా జ్ఞానం లేదా ప్రవచనం లేదా వాక్య బోధ మీకు చెప్పకపోతే నేను వచ్చి భాషలలో మాట్లాడడం వల్ల నా నుండి మీకు ఏ మంచి జరుగుతుంది? 7శబ్దాలను చేసే వేణువు లేదా వీణ వంటి జీవంలేని వాద్యాలు స్పష్టంగా మ్రోగిస్తేనే తప్ప, వాయించబడుతున్న రాగంలో తేడాను ఎవరైనా ఎలా తెలుసుకోగలరు? 8అంతేకాక, బూర ఊదేవారు స్పష్టమైన ధ్వని చేయకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు? 9అది మీలోనే వుంది. మీ నాలుకతో స్పష్టమైన మాటలు మాట్లాడకపోతే మీరు ఏమి మాట్లాడుతున్నారో ఎవరైన ఎలా తెలుసుకోగలరు? అప్పుడు మీరు కేవలం గాలిలో మాట్లాడినట్లు ఉంటుంది. 10లోకంలో చాలా భాషలు ఉన్నాయి, అవన్ని అర్థాన్ని కలిగివున్నాయని అనడంలో సందేహం లేదు. 11ఎవరైనా మాట్లాడినప్పుడు దాని అర్థాన్ని నేను గ్రహించలేకపోతే, మాట్లాడేవారికి నేను పరాయివాడిని, మాట్లాడేవారు నాకు పరాయి వారు. 12ఆత్మ వరాలు పొందాలన్న ఆసక్తి మీలో ఉంది. కనుక సంఘాన్ని కట్టడానికి వాటిని సమృద్ధిగా పొందే ప్రయత్నం చేయండి.
13ఈ కారణంగా భాషలో మాట్లాడేవారు తాము చెప్పేదాని అర్థాన్ని చెప్పే శక్తి కొరకు ప్రార్థించాలి. 14ఎందుకంటే, నేను భాషలో ప్రార్థిస్తే, నా ఆత్మ కూడా ప్రార్థిస్తుంది కాని నా మనస్సు ఫలవంతంగా ఉండదు. 15కనుక నేను ఏమి చేయాలి? నా ఆత్మతో ప్రార్థిస్తాను, అయితే నా జ్ఞానంతో కూడ ప్రార్థిస్తాను. నా ఆత్మతో పాడతాను, నా జ్ఞానంతో కూడ పాడతాను. 16లేకపోతే మీరు ఆత్మలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే, మీరు చెప్పిన దాన్ని గ్రహించలేనివారు అక్కడ ఉంటే, మీరు ఏం చెప్పారో వారికి తెలియదు కనుక మీ కృతజ్ఞతా స్తుతికి వారు “ఆమేన్” అని ఎలా చెప్తారు? 17నీవు చక్కగానే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు కాని దాని వలన ఎవరికి జ్ఞానవృద్ధి కలుగడంలేదు.
18మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలలో మాట్లాడుతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 19కాని, సంఘంలో అర్థంకాని భాషలో పదివేల మాటలు మాట్లాడడం కంటె, ఇతరులకు బోధించడానికి అర్థమైన ఐదు మాటలు నేను మాట్లాడితే మంచిది.
20సహోదరీ సహోదరులారా, పసిబిడ్డల్లా ఆలోచించడం ఆపండి. చెడు విషయంలో పసివారిలా ఉండండి కాని పెద్దల్లా ఆలోచించండి. 21ధర్మశాస్త్రంలో ఇలా వ్రాయబడి ఉంది:
“ఇతర భాషలతో
పరదేశీయుల పెదవుల ద్వారా
నేను ఈ ప్రజలతో మాట్లాడతాను,
కాని వారు నా మాట వినరు,
అని ప్రభువు పలుకుతున్నాడు.”#14:21 యెషయా 28:11,12
22కనుక భాషలతో మాట్లాడడం అనే సూచక క్రియ అవిశ్వాసులకే గాని, విశ్వాసులకు కాదు. అయితే ప్రవచించడం విశ్వాసులకే సూచన కాని అవిశ్వాసులకు కాదు. 23ఒకవేళ సంఘమంతా సమావేశమై, ప్రతివారు భాషలలో మాట్లాడుతున్నప్పుడు గ్రహించలేనివారు గాని అవిశ్వాసులు గాని లోపలికి వస్తే, మీరందరు పిచ్చివారిలా మాట్లాడుతున్నారని అనుకోరా? 24కాని, అందరు ప్రవచిస్తే అవిశ్వాసి కాని, తెలుసుకోవాలని అనుకునేవారు కాని ఎవరైనా లోపలికి వస్తే తాము విన్న దానిని బట్టి పాపపు ఒప్పుకోలు వారిలో కలుగుతుంది. తాము విన్న దానిని బట్టి వారు తీర్పుపొందుతారు. 25వారి హృదయ రహస్యాలు బయలుపరచబడతాయి. వారు సాగిలపడి దేవుణ్ణి ఆరాధిస్తూ, “దేవుడు నిజంగా మీ మధ్యలో ఉన్నాడు!” అని అంగీకరిస్తారు.
ఆరాధనలో మంచి క్రమం
26సహోదరీ సహోదరులారా, మేము ఇక ఏమి చెప్పాలి? మీరు సమావేశమైనప్పుడు, మీలో ఒకరు కీర్తన పాడాలని, ఒకరు బోధించాలని, ఒకరు దేవుడు బయలుపరచిన దాన్ని ప్రకటించాలని, ఒకరు భాషలతో మాట్లాడాలని, ఒకడు దానికి అర్థం చెప్పాలని తలస్తున్నారు. కాని ఇవన్ని సంఘాన్ని కట్టడానికి చేయము. 27భాషలలో మాట్లాడాలనుకున్నవారు ఇద్దరు లేక ముగ్గురు మాత్రమే ఒకరి తరువాత ఒకరు మాట్లాడాలి మరొకరు దాని అర్థాన్ని వివరించాలి. 28అయితే అర్థాన్ని వివరించగలవారు ఎవరూ లేకపోతే, భాషలు మాట్లాడేవారు సంఘంలో మౌనంగా ఉండి, తనలో తాను దేవునితోను మాత్రమే మాట్లాడుకోవాలి.
29ప్రవక్తలలో ఇద్దరు లేక ముగ్గురు మాత్రమే మాట్లాడాలి, ఇతరులు వారు చెప్పిన దానిని జాగ్రత్తగా వివేచించాలి. 30సమావేశంలో కూర్చున్నవారిలో ఎవరైనా దేవుని నుండి ప్రత్యక్షతను పొందితే, మాట్లాడుతున్నవారు తన మాటలు ఆపివేయాలి. 31ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి ప్రోత్సహించబడేలా మీరందరు ఒకరి తరువాత ఒకరు ప్రవచించాలి. 32ప్రవక్తల యొక్క ఆత్మ ప్రవక్తలకు లోబడి ఉండాలి. 33అలాగే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో, దేవుడు సమాధానానికే దేవుడు గాని, అక్రమానికి కాదు.
34స్త్రీలు సంఘాలలో మౌనంగా ఉండాలి. వారు మాట్లాడడానికి అనుమతి లేదు కాని ధర్మశాస్త్రం చెప్పినట్లుగా వారు వినయం కలిగివుండాలి. 35వారు ఏదైనా తెలుసుకోవాలంటే, ఇంటి దగ్గర తమ భర్తలను అడగాలి; సంఘంలో మాట్లాడడం స్త్రీకి అవమానకరం.
36దేవుని వర్తమానం మీ నుండే మొదలైనదా? లేక అది మొదటిగా చేరుకున్న ప్రజలు మీరు మాత్రమేనా? 37ఎవరైనా తాము దేవుని ప్రవక్తలమని లేక ఆత్మ వరాలు గల వారమని తలిస్తే, నేను మీకు వ్రాసేది ప్రభువు ఆజ్ఞ అని వారు గ్రహించాలి. 38కాని, ఎవరైనా దీన్ని నిర్లక్ష్యం చేస్తే, వారు నిర్లక్ష్యం చేయబడినవారిగానే ఉంటారు.
39కాబట్టి నా సహోదరీ సహోదరులారా, ప్రవచించడాన్ని ఆసక్తితో అపేక్షించండి, భాషలతో మాట్లాడడాన్ని వదిలివేయకండి. 40అయితే సమస్తం మర్యాదగా, క్రమంగా జరుగనివ్వండి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 కొరింథీ 14: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.