రూతు 4
4
బోయజు మరియు మరో బంధువు
1పట్టణ ద్వారము దగ్గర ప్రజలు సమావేశమయ్యే చోటికి బోయజు వెళ్లాడు. బోయజు చెప్పిన దగ్గర బంధువు అటుపైపు వచ్చేంతవరకు బోయజు అక్కడే కూర్చున్నాడు. “మిత్రమా, ఇలా రా! ఇక్కడ కూర్చో” అని బోయజు అతడిని పిల్చాడు.
2తర్వాత బోయజు కొందరు సాక్షులను పదిమంది పెద్దలను సమావేశ పర్చాడు. వాళ్లను, “అక్కడ కూర్చో” మని చెప్పినప్పుడు వాళ్లు కూర్చున్నారు.
3అప్పుడు నయోమి దగ్గరి బంధువుతో బోయజు మాట్లాడాడు. “నయోమి మోయాబు దేశమునుండి తిరిగి వచ్చేసింది. మన బంధువు ఎలీమెలెకు భూమిని ఆమె అమ్మేస్తుంది. 4ఈ ఊరి ప్రజలయెదుట, నా వాళ్ల పెద్దలయెదుట ఈ విషయం నీతో చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈ భూమిని నీవు విడిపించాలనుకుంటే నీవు కొనుక్కో. ఆ భూమిని విడిపించడం నీకు ఇష్టము లేకపోతే నాకు చెప్పు, ఆ భూమిని విడిపించాల్సిన బాధ్యత నీ తర్వాత నాదే అని నాకు తెలుసు. ఆ భూమిని నీవు తిరిగి కొనకపోతే, నేను కోంటాను” అంటూ బోయజు ఆ దగ్గరి బంధువుతో చెప్పాడు.
5“నయోమి దగ్గరనుండి నీవు ఆ భూమిని కొంటే, చనిపోయినవాని భార్య మోయాబు స్త్రీ నీదే అవుతుంది (రూతుకు సంతానం కలిగినప్పుడు ఆ సంతానానికి ఆ భూమి చెందుతుంది) ఆ విధంగా ఆ భూమి చనిపోయినవాని కుటుంబానికే చెంది ఉంటుంది” అన్నాడు.
6ఆ దగ్గరి బంధువు జవాబుగా అన్నాడు: “నేను ఆ భూమిని కొనలేను. ఆ భూమి నాకు చెందాల్సిందే, కాని నేను దాన్ని కొనలేను. ఒకవేళ నేను దాన్ని కొనాల్సివస్తే, నా సొంత భూమిని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో. అందుచేత నీవు ఆ భూమిని కొనవచ్చు.” 7(పూర్వము ఇశ్రాయేలులో ప్రజలు ఆస్తి కొన్నా, విడిపించినా ఒకడు తన చెప్పు తీసి అవతల వ్యక్తికి ఇచ్చేవాడు. క్రయ విక్రయాలకు అది వారి రుజువు). 8“కనుక ఆ భూమిని నీవే కొనుక్కో” అన్నాడు ఆ దగ్గరి బంధువు. తర్వాత ఆ దగ్గరి బంధువు తన చెప్పుతీసి దానిని బోయజుకు ఇచ్చాడు.
9అప్పుడు బోయజు పెద్దలతోను, ప్రజలందరితోను చెప్పాడు. “ఎలీమెలెకు, కిలియోను, మహ్లూనులకు చెందిన దానినంతటినీ నయోమి దగ్గరనుండి నేను కొంటున్నాను. దానికి నేడు మీరే సాక్షులు. 10నా భార్యగా ఉండేందుకు రూతును కూడా నేను తీసుకొంటున్నాను. చనిపోయినవాని ఆస్తి అతని కుటుంబానికే ఉండాలని నేను ఇలా చేస్తున్నాను. ఈ విధంగా చేయటంవల్ల చనిపోయిన వాని పేరు అతని దేశానికి, కుటుంబానికి దూరముకాకుండా ఉంటుంది. ఈ వేళ మీరంతా దీనికి సాక్షులు.”
11పట్టణద్వారము దగ్గర ఉన్న పెద్దలు, ప్రజలు దీనికి సాక్షులు.
“ఈ స్త్రీ నీ ఇంటికి వచ్చేస్తుంది యెహోవా
ఈమెను రాహేలు,
లేయా వలె చేయునుగాక!
రాహేలు, లేయాలు ఇశ్రాయేలు వంశ పుత్రదాతలు. ఎఫ్రాతాలో
నీవు శక్తిమంతుడవు అవుదువు గాక.
బెత్లెహేములో నీవు ప్రఖ్యాత పురుషుడవవుదువు గాక!
12తామారు యూదా కుమారుడు పెరెసును కన్నది
అతని కుటుంబం చాలా గొప్పది
అలాగే రూతు ద్వారా అనేక మంది పిల్లలను యెహోవా నీకు ప్రసాదించును గాక!
నీ కుటుంబము కూడ అతని కుటుంబంలాగే గౌరవప్రదమవును గాక!”
13బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు. యెహోవా ఆమెను గర్భవతిని కానిచ్చినప్పుడు ఆమె ఒక కుమారుని కన్నది. 14ఆ ఊరిలో స్త్రీలు నయోమితో,
“నిన్ను ఆదుకొనేందుకు ఇతడిని (బోయజును) ఇచ్చిన యెహోవాని స్తుతించు.
అతడు ఇశ్రాయేలులో ప్రఖ్యాతి నొందును గాక! అనిరి. మరియు వారు,
15అతడే నీకు బలాన్ని యిచ్చి,
నీ వృద్ధాప్యంలో నిన్ను కాపాడును గాక!
నీ కోడలు వల్ల ఇదంతా జరిగింది.
ఆమె నీ కోసం ఈ పిల్లవానిని కన్నది.
ఆమెకు నీవంటే చాలా ప్రేమ.
ఈమె ఏడుగురు కుమారులను కంటే నీకు మేలు.”
అని అనిరి.
16నయోమి పిల్లవాడ్ని తీసుకొని, చేతుల్లో ఎత్తుకొని ఆడించింది. 17ఆ స్త్రీలు, “ఈ పిల్లవాడు నయోమి కోసమే పుట్టాడు” అన్నారు. ఇరుగు పొరుగువారు ఆతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఓబేదు యెష్షయికి తండ్రి. యెష్షయి రాజైన దావీదుకు తండ్రి.
రూతు, బోయజు కుటుంబము
18పెరెసు కుటుంబ చరిత్ర ఇది.
పెరెసు హెస్రోనుకు తండ్రి.
19హెస్రోను రాముకు తండ్రి.
రాము అమ్మి నాదాబుకు తండ్రి.
20అమ్మినాదాబు నయసోనుకు తండ్రి.
నయసోను శల్మానుకు తండ్రి.
21శల్మాను బోయజుకు తండ్రి.
బోయజు ఓబేదుకు తండ్రి.
22ఓబేదు యెష్షయికి తండ్రి.
యెష్షయి దావీదుకు తండ్రి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
రూతు 4: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International