రోమీయులకు వ్రాసిన లేఖ 5:1-8

రోమీయులకు వ్రాసిన లేఖ 5:1-8 TERV

మనలో విశ్వాసము ఉండటం వలన దేవుడు మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. ఆ కారణంగా, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు దేవునితో స్నేహం కలిగింది. మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవితం దేవుని అనుగ్రహం వల్ల సంభవించింది. ఇది విశ్వాసంగల మనకు యేసు క్రీస్తు ద్వారా లభించింది. దేవుని తేజస్సులో భాగం పంచుకొంటామనే ఆశ మనలో ఉండటం వల్ల మనకు ఎంతో ఆనందం కలుగుతోంది. అంతేకాదు, కష్టాలు సహనాన్ని పెంపొందింపచేస్తాయని మనకు తెలుసు. కనుక మనము కష్టాలు అనుభవించటంలో కూడా ఆనందాన్ని పొందుతున్నాము. సహనం వల్ల దేవుని మెప్పు, మెప్పువల్ల ఆయన తేజస్సులో భాగం పంచుకొంటామనే నిరీక్షణ కలుగతోంది. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మనపై కురిపించాడు. కనుక ఆ ఆశ విషయంలో మనకు నిరాశ కలుగదు. నిజానికి మనలో శక్తి లేని సమయాన భక్తిహీనులమైన మన కోసం క్రీస్తు మరణించాడు. నీతిమంతుల కోసం మరణించటం చాలా అరుదు. మంచి స్నేహితుని కోసం ఒకడు ధైర్యం చేసి, మరణిస్తే మరణించవచ్చు. కాని మనమింకా పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం మరణించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రేమను మనకోసం వ్యక్తం చేసాడు.

రోమీయులకు వ్రాసిన లేఖ 5:1-8 కోసం వీడియో