కీర్తనల గ్రంథము 45
45
సంగీత నాయకునికి: “శోషనీము” రాగం. కోరహు కుటుంబం రచించిన దైవ ధ్యానం మరియు ఒక ప్రేమగీతం.
1రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా
అందమైన పదాలు నా మనస్సును నింపేస్తున్నాయి.
నైపుణ్యంగల రచయిత కలంనుండి వెలువడే మాటల్లా
నా నాలుక మీద మాటలు దొర్లిపోతున్నాయి.
2నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు!
నీ పెదవులనుండి దయ వెలువడుతుంది
కనుక దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు.
3నీవు ఖడ్గం ధరించు, యుద్ధ వీరునివలె, మహిమను, ఘనతను ధరించుము.
4నీవు అద్భుతంగా కనబడుతున్నావు! వెళ్లి, నీతి న్యాయం కోసం పోరాటంలో గెలువుము.
అద్భుతకార్యాలు చేసేందుకు శక్తిగల నీ కుడి చేతిని ప్రయోగించుము.
5నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రువుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి
అనేక మంది ప్రజలను నీవు ఓడిస్తావు.
6దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది!
నీ నీతి రాజదండము.
7నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును ద్వేషిస్తావు.
కనుక, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా
నీ దేవుడు కోరుకొన్నాడు.
8నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగ, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి.
నిన్ను సంతోషపరచుటకు దంతం పొదగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది.
9నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమార్తెలున్నారు.
నీ పెండ్లి కుమార్తె ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది.
10కుమారీ, నా మాట వినుము.
నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని మరచిపొమ్ము.
11రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు.
ఆయనే నీకు క్రొత్త భర్తగా ఉంటాడు.
నీవు ఆయన్ని ఘనపరుస్తావు.
12తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు.
వారి ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.
13రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది.
ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది.
14ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
15సంతోషంతో నిండిపోయి వారు వస్తారు.
సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు.
16రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు.
దేశవ్యాప్తంగా నీవు వారిని రాజులుగా చేస్తావు.
17నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను.
శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనల గ్రంథము 45: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International