కీర్తనల గ్రంథము 22:1-11

కీర్తనల గ్రంథము 22:1-11 TERV

నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నన్ను రక్షించటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు. సహాయం కోసం నేను వేసే కేకలను వినటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు. నా దేవా, పగలు నేను నీకు మొరపెట్టాను. కాని నీవు నాకు జవాబు ఇవ్వలేదు. మరియు నేను రాత్రిపూట నీకు మొరపెడుతూనే ఉన్నాను. దేవా, నీవు పవిత్రుడవు. నీవు రాజుగా కూర్చున్నావు. ఇశ్రాయేలీయుల స్తుతులే నీ సింహాసనం. మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు. అవును దేవా, వారు నిన్ను నమ్ముకొన్నారు. నీవేమో వారిని రక్షించావు. మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువుల నుంచి వారు తప్పించుకొన్నారు. వారు నిన్ను నమ్ముకొన్నారు. కనుక వారు నిరాశ చెందలేదు. కాని, నేను మనిషిని కానా, పురుగునా? మనుష్యులు నన్ను దూషిస్తారు. ప్రజలు నన్ను ద్వేషిస్తారు. నన్ను చూచే ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేస్తారు. నన్ను చూచి, వారు తలలు ఎగురవేస్తూ, నన్ను వెక్కిరిస్తారు. వారు నాతో అంటారు: “నీకు సహాయం చేయుమని నీవు యెహోవాను అడగాలి. ఒకవేళ ఆయన నిన్ను రక్షిస్తాడేమో! నీవంటే ఆయనకు అంత ఇష్టమైతే అప్పుడు ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు.” దేవా, నిజంగా నేను నీ మీద ఆధారపడియున్నాను. నన్ను గర్భమునుండి బయటకు లాగినవాడవు నీవే. నేను యింకా నా తల్లి పాలు త్రాగుతూ ఉన్నప్పుడే నీవు నాకు అభయం ఇచ్చావు, ఆదరించావు. నేను పుట్టిన రోజునుండి నీవు నాకు దేవునిగా ఉన్నావు. నేను నా తల్లి గర్భంలోనుండి వచ్చినప్పటినుండి నేను నీ జాగ్రత్తలోనే ఉంచబడ్డాను. కనుక దేవా, నన్ను విడువకు. కష్టం దగ్గర్లో ఉంది. పైగా నాకు సహాయం చేసేవారు. ఎవ్వరూ లేరు.