కీర్తనల గ్రంథము 18:37-50

కీర్తనల గ్రంథము 18:37-50 TERV

నేను నా శత్రువులను తరిమి, వారిని పట్టుకొన్నాను. వారు నాశనం అయ్యేవరకు నేను తిరిగిరాలేదు. నా శత్రువులను నేను ఓడిస్తాను. వారిలో ఒక్కరుకూడా తిరిగి లేవరు. నా శత్రువులు అందరూ నా పాదాల దగ్గర పడ్డారు. దేవా, యుద్ధంలో నాకు బలం ప్రసాదించుము. నా శత్రువులంతా నా యెదుట పడిపోయేటట్టు చేయుము. యెహోవా, నా శత్రువులను వెనుదిరిగేటట్లు చేశావు. నీ సహాయంవల్లనే నన్ను ద్వేషించే వారిని నేను నాశనం చేస్తాను. నా శత్రువులు సహాయం కోసం అడిగారు, కాని ఎవ్వరూ వారికి సహాయం చేసేందుకు రాలేదు. వారు యెహోవాకు కూడా మొరపెట్టారు. కాని ఆయన వారికి జవాబు ఇవ్వలేదు. నా శత్రువులను నేను ధూళిగా నలగగొట్టాను. వారు గాలికి చెదరిపోయే దుమ్ములా ఉన్నారు. నేను వాళ్లను వీధుల బురదగా పారవేసాను. నాకు వ్యతిరేకంగా పోరాడే మనుష్యుల నుండి నన్ను కాపాడావు. ఆ రాజ్యాలకు నన్ను నాయకునిగా చేయుము. నేను ఎరుగని ప్రజలు నాకు సేవ చేస్తారు. ఆ మనుష్యులు నా గురించి విన్నప్పుడు విధేయులయ్యారు. ఇతర రాజ్యాల ప్రజలు నేనంటే భయపడ్డారు. ఆ విదేశీ ప్రజలు నేనంటే భయపడ్డారు, కనుక వారు భయంతో వణుకుతూ సాష్టాంగపడ్డారు. వారు దాక్కొనే తమ స్థలాలనుండి బయటకు వచ్చారు. యెహోవా సజీవంగా ఉన్నాడు. నా ఆశ్రయ దుర్గమైన వానిని నేను స్తుతిస్తాను. నా దేవుడు నన్ను రక్షిస్తాడు. అందుచేత ఆయనను స్తుతులతో పైకెత్తండి. నాకోసం నా శత్రువులను శిక్షించాడు. ఆ ప్రజలను ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేసాడు. యెహోవా, నీవే నా శత్రువుల నుండి నన్ను తప్పించావు. కృ-రులైన వారి నుండి నీవు నన్ను రక్షించావు. నాకు విరుద్ధంగా నిలిచినవారిని ఓడించుటకు నీవు నాకు సహాయం చేశావు. కనుక మనుష్యులందరి యెదుట యెహోవాను నేను స్తుతిస్తాను. నీ నామ కీర్తన గానము చేస్తాను. యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు, ఆయన గొప్ప విజయాలిచ్చాడు. ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు అనగా దావీదుకు, తన సంతానానికీ నిరంతరం ఆయన ఎంతో దయ చూపాడు.