కీర్తనల గ్రంథము 119:105-176

కీర్తనల గ్రంథము 119:105-176 TERV

యెహోవా, నీ వాక్యాలు నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి. నీ న్యాయ చట్టాలు మంచివి. నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను. దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము! యెహోవా, నా స్తుతి అంగీకరించు. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది. కాని యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు. దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు కాని నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు. యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను. అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది. నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను. స్థిరమైన మనస్సు లేనివాళ్లంటే నాకు అసహ్యం. నేను నీ ఉపదేశాలను ప్రేమిస్తున్నాను. నన్ను దాచిపెట్టి, కాపాడుము. యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను. యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకుము. నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను. యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము. నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు. యెహోవా, నాకు సహాయం చేయుము. నేను రక్షించబడతాను. నీ ఆజ్ఞలను నేను నిరంతరం అధ్యయనం చేస్తాను. యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి మనిషినీ నీవు తిప్పికొడతావు. ఎందుకంటే ఆ మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు. యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా చూస్తావు. కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను. యెహోవా, నీవంటే నాకు భయం, నీ చట్టాలకు నేను భయపడి వాటిని గౌరవిస్తాను. యెహోవా, సరియైనవి, మంచివి నేను చేశాను. నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించవద్దు. నీవు నాకు సహాయం చేస్తావని ప్రమాణం చేయుము. యెహోవా, నేను నీ సేవకుడను, ఆ గర్విష్ఠులను నాకు హాని చేయనియ్యకుము. యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి ప్రమాణం చేశావు. కాని నన్ను రక్షిస్తావని నీ కోసం ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి. నిజమైన నీ ప్రేమ నా మీద చూపించుము. నేను నీ సేవకుడను. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. నేను నీ సేవకుడను నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, యిది నీవు ఏమైనా చేయాల్సిన సమయం. ప్రజలు నీ న్యాయ చట్టం ఉల్లంఘించారు. యెహోవా, నీ ఆజ్ఞలు మేలిమి బంగారంకంటె నాకు ఎక్కువ ఇష్టం. నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను. తప్పుడు బోధలు నాకు అసహ్యం. యెహోవా, నీ ఒడంబడిక అద్భుతం, అందుకే నేను దానిని అనుసరిస్తాను. ప్రజలు నీ మాట గ్రహించడం మొదలు పెట్టినప్పుడు అది వారికి సరైన జీవన విధానాన్ని చూపెట్టి దీపంలా ఉంటుంది. నీ మాట తెలివితక్కువ జనులను కూడా తెలివిగల వారినిగా చేస్తుంది. యెహోవా, నేను నిజంగా నీ ఆజ్ఞలు ధ్యానించాలని కోరుతున్నాను. నేను కష్టంగా ఊపిరి పీలుస్తూ, అసహనంగా కనిపెడ్తున్న మనిషిలా ఉన్నాను. దేవా, నావైపుకు తిరిగి, నా మీద దయ చూపించుము. నీ నామమును ప్రేమించే వారికి సరియైనవి ఏవో వాటిని చేయుము. యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నన్ను నడిపించుము. నాపై ఏ దుష్టత్వమూ అధికారం చేయనీయవద్దు. యెహోవా, నన్ను బాధించు ప్రజల నుండి నన్ను రక్షించుము. నేనేమో, నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను. యెహోవా, నీ సేవకుని అంగీకరించి నీ న్యాయచట్టాలు నేర్పించుము. ప్రజలు నీ ఉపదేశాలకు లోబడనందువల్ల నదిలా నా కన్నీళ్లు ప్రవహించేట్టు నేను ఏడ్చాను. యెహోవా, నీవు మంచివాడవు. నీ చట్టాలు న్యాయమైనవి. ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి. యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము. నా ఉత్సాహం నాలో కృంగిపోయినది. ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు. యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది. అదంటే నాకు ప్రేమ. నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు. కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను. యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది. నీ ఉపదేశాలు నమ్మదగినవి. నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి. కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము. నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది. నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, నా హృదయపూర్తిగా నేను నీకు మొరపెడ్తున్నాను. నాకు జవాబు ఇమ్ము. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను. యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను. నన్ను రక్షించుము. నేను నీ ఒడంబడికకు విధేయుడనవుతాను. యెహోవా, నిన్ను ప్రార్థించుటకు నేను వేకువనే మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుంటాను. నీవు చెప్పేవాటియందు నేను నమ్మకముంచుతాను. నీ వాక్యాన్ని ధ్యానించుటకు నేను చాలా రాత్రివరకు మెళకువగా ఉన్నాను. నీవు దయతో నా మాట విను. యెహోవా, నీ న్యాయ శాస్త్రానుసారముగా నన్ను జీవింపనిమ్ము. మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు వేస్తున్నారు. యెహోవా, ఆ మనుష్యులు నీ ఉపదేశాలను అనుసరించరు. యెహోవా, నీవు నాకు సన్నిహితంగా ఉన్నావు. నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి. నీ ఉపదేశాలు శాశ్వతంగా కొనసాగుతాయని చాలా కాలం క్రిందట నీ ఒడంబడిక నుండి నేను నేర్చుకొన్నాను. యెహోవా, నా శ్రమను చూచి, నన్ను తప్పించుము. నీ ఉపదేశాలను నేను మరువలేదు. యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, నన్ను రక్షించుము. నీ వాగ్దానం ప్రకారం నన్ను జీవించనిమ్ము. దుష్టులు జయించరు. ఎందుకంటే, వారు నీ న్యాయ చట్టాలను అనుసరించరు. యెహోవా, నీవు చాలా దయగలవాడవు. నీవు చెప్పే సరియైన వాటిని చేసి, నన్ను జీవించనిమ్ము నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్న శత్రువులు నాకు చాలామంది ఉన్నారు. కాని నేను మాత్రం నీ ఒడంబడికను అనుసరించటం ఆపివేయలేదు. ఆ ద్రోహులను నేను చూస్తున్నాను. ఎందుకంటే యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు. చూడుము, నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను. యెహోవా, నీ ప్రేమ అంతటితో నన్ను జీవించనిమ్ము. యెహోవా, ఆది నుండి నీ మాటలు అన్నీ నమ్మదగినవి. నీ మంచి ధర్మశాస్త్రం శాశ్వతంగా నిలుస్తుంది. ఏ కారణం లేకుండానే బలమైన నాయకులు నా మీద దాడి చేశారు. కాని నేను మాత్రం నీ ధర్మశాస్త్రానికే భయపడి, దాన్ని గౌరవిస్తాను. యెహోవా, అప్పుడే ఐశ్వర్యపు నిధి దొరకిన వానికి ఎంత సంతోషమో, నీ వాక్యం నన్ను అంత సంతోష పరుస్తుంది. అబద్ధాలంటే నాకు అసహ్యం! నేను వాటిని తృణీకరిస్తాను. యెహోవా, నీ ఉపదేశాలు నాకు ఇష్టం. నీ మంచి న్యాయ చట్టాలను బట్టి నేను రోజుకు ఏడుసార్లు నిన్ను స్తుతిస్తాను. నీ ఉపదేశాలను ప్రేమించే మనుష్యులకు నిజమైన శాంతి లభిస్తుంది. ఆ మనుష్యులను ఏదీ పడగొట్టలేదు. యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కనిపెడ్తున్నాను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడనయ్యాను. నేను నీ ఒడంబడికను అనుసరించాను. యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు ఎంతో ప్రేమ. నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను. యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు తెలుసు. యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము. నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము. యెహోవా, నా ప్రార్థన వినుము. నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము. నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించావు కనుక నేను స్తుతి గీతాలతో ఉప్పొంగిపోతాను. నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము. నా పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయచట్టాలన్నీ మంచివి. నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించుకొన్నాను గనుక నన్ను ఆదుకొని, నాకు సహాయం చేయుము. యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కోరుతున్నాను. కాని నీ ఉపదేశాలు నన్ను సంతోష పరుస్తాయి. యెహోవా, నన్ను జీవించనిమ్ము. నిన్ను స్తుతించనిమ్ము. నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము. నేను తప్పిపోయిన గొర్రెలా తిరిగాను. యెహోవా, నా కోసం వెదకుతూ రమ్ము. నేను నీ సేవకుడను. మరియు నేను నీ ఆజ్ఞలను మరువలేదు.