కీర్తనల గ్రంథము 119:1-48

కీర్తనల గ్రంథము 119:1-48 TERV

పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు. ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు. యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు. వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు. ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు. వారు యెహోవాకు విధేయులవుతారు. యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు. ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు. యెహోవా, నేను నీ ఆజ్ఞలకు ఎల్లప్పుడూ విధేయుడనౌతాను, అప్పుడు నేను నీ ఆజ్ఞలను ఎప్పుడు చదివినా సిగ్గుపడను. అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదివి నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను. యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను. కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము! యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు? నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే. నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను. దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము. నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను. ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను యెహోవా, నీకే స్తుతి. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను. ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను. నీ నియమాలను నేను చర్చిస్తాను. నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను. నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను. నీ మాటలు నేను మరచిపోను. నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము. తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను. యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను. ఈ దేశంలో నేను పరాయివాణ్ణి. యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము. నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి చదవాలని కోరుతున్నాను. యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు. ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి. నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు. నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు. నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను. నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు. అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను. నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు. అది నాకు మంచి సలహా ఇస్తుంది. నేను త్వరలోనే చనిపోతాను. యెహోవా, నీ మాటలతో నన్ను ఉజ్జీవింప జేయుము. నా జీవితం గూర్చి నేను నీతో చెప్పాను. నీవు నాకు జవాబు ఇచ్చావు. ఇప్పుడు నాకు నీ న్యాయ చట్టాలు నేర్పించు. యెహోవా, నీ న్యాయ చట్టాలు గ్రహించుటకు నాకు సహాయం చేయుము. నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను నన్ను ధ్యానం చేయనిమ్ము. నేను అలసిపోయి విచారంగా ఉన్నాను. ఆజ్ఞయిచ్చి నన్ను మరల బలపర్చుము. యెహోవా, నన్ను కపటంగా జీవించనియ్యకుము, నీ ఉపదేశాలతో నన్ను నడిపించుము. యెహోవా, నేను నీకు నమ్మకంగా ఉండాలని కోరుకొన్నాను. జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను జాగ్రత్తగా చదువుతాను. యెహోవా, నేను నీ ఒడంబడికకు కట్టుబడతాను. నన్ను నిరాశ పరచవద్దు. నేను నీ ఆజ్ఞలవైపు పరుగెత్తి విధేయుడనవుతాను. యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను ఎంతో సంతోష పెడతాయి. యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్పించుము. నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడనౌతాను. గ్రహించుటకు నాకు సహాయం చేయుము. నేను నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను. నేను వాటికి పూర్తిగా విధేయుడనవుతాను. యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు. నేను నీ ఆజ్ఞలను నిజంగా ప్రేమిస్తున్నాను. నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, అయోగ్యమైన విషయాలనుండి నా కళ్లను మరలించుము. నీ మార్గంలో జీవించుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, నేను నీ సేవకుడను కనుక నీవు వాగ్దానం చేసిన వాటిని జరిగించుము. నిన్ను ఆరాధించే ప్రజలకు నీవు వాటిని వాగ్దానం చేశావు. యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు. జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి. చూడుము, నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను. నా యెడల మంచితనం చూపించి నన్ను బ్రతుకనిమ్ము. యెహోవా, నీ నిజమైన ప్రేమ నాకు చూపించుము. నీవు వాగ్దానం చేసినట్టే నన్ను రక్షించుము. అప్పుడు నన్ను అవమానించే ప్రజలకు నా దగ్గర జవాబు ఉంటుంది. యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నిజంగా నమ్ముతాను. నీ సత్యమైన ఉపదేశాలను నన్ను ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాల మీద నేను ఆధారపడుతున్నాను. యెహోవా, నేను శాశ్వతంగా ఎప్పటికీ నీ ఉపదేశాలను అనుసరిస్తాను. అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను. ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక. యెహోవా ఒడంబడికను గూర్చి నేను రాజులతో చర్చిస్తాను. వారి ఎదుట భయపడకుండా నేను మాట్లాడుతాను. యెహోవా, నీ ఆజ్ఞలను చదవటము నాకు ఆనందం. ఆ ఆజ్ఞలంటే నాకు ప్రేమ. యెహోవా, నేను నీ ఆజ్ఞలను గౌరవిస్తున్నాను. వాటిని నేను ప్రేమిస్తున్నాను. మరియు నేను వాటిని ధ్యానం చేస్తూ వాటిని గూర్చి మాట్లాడుతాను.