సామెతలు 27:1-14

సామెతలు 27:1-14 TERV

భవిష్యత్తులో జరిగే దానిని గూర్చి అతిశయించవద్దు. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. నిన్ను నీవే ఎన్నడూ పొగడుకోవద్దు. ఆ పని ఇతరులను చేయనివ్వు. మోయుటకు ఒక బండ బరువుగాను యిసుక గట్టిగాను ఉంటాయి. కాని ఒక బుద్ధిహీనుని కోపము మూలంగా కలిగిన కష్టాన్ని మోయటం ఆ రెండింటి కంటే సహించడం కష్టం. కోపం క్రూరమైంది. నీచమైంది. అది నాశనం కలిగిస్తుంది. కాని అసూయ మరీ దౌర్భాగ్యం. దాచబడిన ప్రేమకంటె బహిరంగ విమర్శ మేలు. ఒక స్నేహితుడు అప్పుడప్పుడు నిన్ను బాధించవచ్చు. కాని ఎల్లప్పుడూ ఇలాగే చేయాలని అతడు కోరుకోడు. ఒక శత్రువు విషయం వేరుగా ఉంటుంది. ఒక శత్రువు నీ మీద దయగా ఉన్నప్పటికీ అతడు నిన్ను బాధించగోరుతాడు. నీకు ఆకలి లేకపోతే అప్పుడు నీవు తేనె కూడా తినలేవు. కాని ఆకలిగా ఉంటే ఏదైనా తినేస్తావు దాని రుచి బాగులేకున్నా సరే. తన ఇంటికి దూరంగా ఉన్న మనిషి తన గూటికి దూరంగా ఉన్న పక్షిలాంటివాడు. పరిమళాలు, సువాసన వస్తువులు నిన్ను సంతోష పెడ్తాయి. కాని ఆపత్తు నీ మనశ్శాంతిని భంగం చేస్తుంది. అదే రీతిగా స్నేహితుని హృదయం నుండి వచ్చే మధురమైన హితవు వుంటుంది. నీ స్నేహితులను, నీ తండ్రి స్నేహితులను మరువకు. మరియు నీకు కష్టం వస్తే సహాయం కోసం చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్లవద్దు. చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్లడం కంటే నీ దగ్గరలో ఉన్న నీ పొరుగువారిని అడగటం మంచిది. నా కుమారుడా జ్ఞానము కలిగివుండు. ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. అప్పుడు నన్ను విమర్శించే వారికి ఎవరికైనా సరే నేను జవాబు చెప్పగలను. జ్ఞానముగల వారు కష్టం రావడం గమనించి, దాని దారిలో నుండి తప్పుకుంటారు. కాని బుద్ధిహీనుడు సూటిగా చిక్కులోకి వెళ్లి దాని మూలంగా శ్రమపడతాడు. మరో మనిషి అప్పుల కోసం నీవు బాధ్యత వహిస్తే, నీవు నీ చొక్కా పోగొట్టుకుంటావు. “శుభోదయం” అని గట్టిగా అరుస్తూ తెల్లవారకట్లనే నీ పొరుగు వారిని మేలుకొలుపవద్దు. అది అతనికి ఒక శాపం అనుకుంటాడే కాని దీవెన అనుకోడు.