సంఖ్యాకాండము 19
19
ఎర్ర ఆవు బూడిద
1మోషేతో, అహరోనుతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు: 2“ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చే ఆజ్ఞలు, ప్రబోధాలు ఇవే. వారు బలంగా ఉన్న ఒక ఎర్ర ఆవును నీ దగ్గరకు తీసుకుని రావాలి. ఆ ఆవుకు ఎలాంటి గాయాలు ఉండకూడదు. ఆ ఆవు ఎన్నడూ కాడి మోసి ఉండకూడదు. 3ఆ ఆవును యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వాలి. ఎలియాజరు ఆవును నివాసం యొక్క వెలుపలికి తీసుకునిపోయి, అక్కడ దాన్ని వధించాలి. 4అప్పుడు యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో కొంత తన వేలిమీద వేసుకొవాలి. తర్వాత అతడు ఆ రక్తంలో కొంత పవిత్ర గుడారం వైపు చల్లాలి. అతడు ఇలా ఏడు సార్లు చేయాలి. 5అప్పుడు మొత్తం ఆవు అతని ఎదుట దహించబడాలి. దాని చర్మం, మాంసం, రక్తం, ప్రేగులు అన్నీ దహించాలి. 6అప్పుడు యాజకుడు ఒక దేవదారు కర్రను, హిస్సోపు కొమ్మను, ఎర్ర నూలును తీసుకుని, ఆవు దహించబడుతున్న అగ్నిలో వేయాలి. 7అప్పుడు యాజకుడు స్నానం చేసి, నీళ్లతో తన బట్టలు ఉదుక్కోవాలి. అతడు తిరిగి నివాసానికి రావాలి. యాజకుడు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు. 8ఆ ఆవును దహించే వ్యక్తి స్నానం చేసి, నీళ్లతో తన బట్టలు ఉదుక్కోవాలి. సాయంత్రం వరకు అతడు అపవిత్రంగానే ఉంటాడు.
9“అప్పుడు పవిత్రుడైనవాడు ఒకడు ఆ ఆవు బూడిదను పోగు చేయాలి. అతడు నివాసానికి బయట పరిశుభ్రమైన స్థలంలో ఆ బూడిదను ఉంచుతాడు ప్రజలు పవిత్రులయ్యేందు కోసం ఒక ప్రత్యేక ఆచారాన్ని పాటించేటప్పుడు ఈ బూడిద ఉపయోగించబడుతుంది. ఒక వ్యక్తి పాపాలను తొలగించేందుకు కూడా ఈ బూడిద ఉపయోగించబడుతుంది.
10“ఆవు బూడిదను పోగుచేసే వ్యక్తి తన బట్టలు ఉదుక్కోవాలి. అతను సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు.
“ఈ నియమం శాశ్వతంగా కొనసాగుతుంది. ఇశ్రాయేలు పౌరులకు, మీతో కలసి నివసిస్తున్న విధేశీయులకు ఈ నియమం వర్తిస్తుంది. 11ఎవరైనా ఒకరు ఒక శవాన్ని తాకితే, అప్పుడు అతడు ఏడు రోజులు అపవిత్రంగా ఉంటాడు. 12ప్రత్యేక జలంతో మూడోరోజున, మళ్లీ ఏడో రోజున అతడు తనను తాను కడుక్కోవాలి. అతడు ఇలా చేయకపోతే అపవిత్రంగానే ఉంటాడు. 13ఒకడు ఒక శవాన్ని తాకితే అతడు అపవిత్రుడు. అతడు అపవిత్రుడుగానే ఉండి, పవిత్ర గుడారానికి వెళ్తే, అప్పుడు ఆ పవిత్ర గుడారం అపవిత్రం అవుతుంది. కనుక అతనిని ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి తొలగించి వేయాలి. ఒక అపవిత్రునిమీద ప్రత్యేకజలం చల్లకపోతే అతడు అపవిత్రంగానే ఉండిపోతాడు.
14“తమ గుడారాల్లోనే మరణించే వారిని గూర్చిన నియమం ఇది. ఒకడు తన గుడారంలో మరణిస్తే, ఆ గుడారంలో ఉన్న ప్రతి ఒక్కరూ అపవిత్రులే. ఏడు రోజులపాటు వారు అపవిత్రం అవుతారు. 15మూతలేని ప్రతి పాత్ర అపవిత్రం అవుతుంది. 16ఏ మనిషిగాని శవాన్నిగాని ముట్టుకొంటే, ఆ మనిషి అపవిత్రుడుగా ఏడు రోజులు ఉంటాడు. శవం బయట పొలంలో ఉన్నా, లేక యుద్ధంలో చచ్చిన వానిదైనా సరే ఇదే వర్తిస్తుంది. మరియు చచ్చిన మనిషి ఎముకను ఒక దాన్ని ఎవరైనా ముట్టుకుంటే అప్పుడు అతడు అపవిత్రుడౌతాడు.
17“కనుక అతనిని మరల పవిత్రం చేయటానికి దహించబడ్డ ఆవు బూడిదను నీవు ప్రయోగించాలి. పాత్రలో బూడిద మీద స్వచ్ఛమైన నీళ్లు పోయాలి. 18పవిత్రుడు ఒకడు హిస్సోపు కొమ్మను తీసుకుని, దానిని ఆ నీళ్లలో ముంచాలి. అప్పుడు అతడు గుడారంమీదా, గిన్నెలమీదా, గుడారంలోని మనుష్యులందరి మీదా దానిని చల్లాలి. శవాన్ని ముట్టు కొన్న ఎవరికైనా నీవు ఇలాగే చేయాలి. యుద్ధంలో చంపబడిన ఒకరి శవాన్ని ముట్టుకొనిన ఎవరికైనా సరే, చచ్చిన మనిషి ఎముకను తాకిన ఎవరికైనా సరే నీవు ఇలాగే చేయాలి.
19“అప్పుడు పవిత్రంగా ఉన్న ఒక మనిషి అపవిత్రంగా ఉన్న వానిమీద మూడో రోజున, మరల ఏడో రోజున ఈ నీళ్లు చల్లాలి. ఏడో రోజున అతడు పవిత్రం అవుతాడు. అతడు తన వస్త్రాలను నీళ్లలో ఉతుక్కోవాలి. ఆ సాయంకాలం అతడు పవిత్రుడవుతాడు.
20“ఒక వ్యక్తి అపవిత్రుడై, పవిత్రుడుగా చేయబడకపోతే, అతడు ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి వేరు చేయబడాలి. అతనిమీద ప్రత్యేక జలం చల్లబడలేదు. అతడు పవిత్రుడు కాలేదు. కనుక అతడు పవిత్ర గుడారాన్ని అపవిత్రం చేస్తాడేమో. 21ఇది మీకు శాశ్వత నియమం. ఒక వ్యక్తిమీద ప్రత్యేక జలం చల్లబడితే అతడు తన బట్టలను కూడ ఉదుక్కోవాలి. ఆ ప్రత్యేకజలాన్ని ముట్టినవాడు ఆ సాయంకాలంవరకు మాత్రం అపవిత్రంగానే ఉంటాడు. 22అపవిత్రుడు ఒకడు ఇంకో వ్యక్తిని ముట్టుకుంటే అతడుకూడా అపవిత్రుడవుతాడు. అతడు ఆ సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సంఖ్యాకాండము 19: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International