సంఖ్యాకాండము 15
15
బలుల నియమాలు
1మోషేతో యెహోవా ఇలా అన్నాడు: 2“ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారికి చెప్పు: మీకు నివాసంగా నేను ఇస్తున్న ఒక దేశంలో మీరు ప్రవేశిస్తారు. మీరు ఆ దేశంలో ప్రవేశించగానే మీరు యెహోవాకు బలులు అర్పించాలి. 3ఈ అర్పణల్లో కొన్నింటిని మీరు అగ్నితో దహించాలి. మీ పశువుల మందల్లోనుండి, గొర్రెలమందల్లోనుండి మీరు అర్పణలు ఇవ్వాలి. ఇది యెహోవాకు ప్రీతిని కలిగిస్తుంది. దహనబలులు, బలి అర్పణలు, ప్రత్యేక ప్రమాణాలు, ప్రత్యేక కానుకలు, సమాధాన బలులు, ప్రత్యేక సెలవు దినాలు ఇవన్నీ యెహోవాకు చాల ఇష్టం.
4“ఆ సమయంలో తన అర్పణను తెచ్చేవాడు యెహోవాకు ధాన్యార్పణ కూడ పెట్టాలి. ఆ ధాన్యార్పణ ముప్పావు ఒలీవ నూనెతో కలపబడ్డ రెండు పడుల పిండి. 5ఒక గొర్రెపిల్లను దహనబలిగా నీవు అర్పించిన ప్రతిసారీ ముప్పావు ద్రాక్షారసం పానార్పణంగా నీవు సిద్ధం చేయాలి.
6“మీరు ఒక పొట్టేలును అర్పిస్తుంటే కూడ ధాన్యార్పణ సిద్ధం చేయాలి. ఆ ధాన్యార్పణ ఒక పడి ఒలీవ నూనెతో కలుపబడ్డ నాలుగు పడుల పిండి. 7ఒక పడి ద్రాక్షారసాన్ని పానార్పణంగా నీవు సిద్ధం చేయాలి. దాన్ని యెహోవాకు అర్పించు. అది ఆయన్ని సంతోషపెడుతుంది.
8“అర్పణగా, బలిగా, సమాధాన బలిగా, లేక యెహోవాకు ఒక ప్రత్యేక వాగ్దానంగా నీవు ఒక కోడెదూడను సిద్ధం చేయవచ్చు. 9కనుక ఆ కోడెదూడతోబాటు ధాన్యార్పణ కూడ నీవు తీసుకొనిరావాలి. ఆ ధాన్యార్పణ పడిన్నర ఒలీవ నూనెతో కలుపబడిన ఆరు పడుల గోధుమ పిండి. 10మరియు పడిన్నర ద్రాక్షారసం పానార్పణంగా తేవాలి. ఈ అర్పణ హోమంలో దహించబడటం యెహోవాకు ఎంతో సంతోషం. 11నీవు యెహోవాకు అర్పించే ప్రతి కోడెదూడ, పోట్టేలు, గొర్రెపిల్ల, మేక పిల్ల ఈ విధంగా సిద్ధం చేయబడాలి. 12నీవు అర్పించే ప్రతి జంతువుకూ నీవు ఇలా చేయాలి.
13“ప్రజలు ఇలా దహన బలులు అర్పించినప్పుడు వారు యెహోవాను సంతోషపెడతారు. అయితే ఇశ్రాయేలీయుల్లో ప్రతి పౌరుడూ వీటన్నింటినీ నేను నీతో చెప్పినట్టే చేయాలి. 14మరియు రాబోయే కాలమంతటిలో ఇశ్రాయేలు కుటుంబంలో జన్మించనివాడు మీ మధ్య నివసిస్తుంటే, అతడు కూడా వీటన్నింటికీ విధేయుడు కావాలి. నేను నీకు చెప్పిన విధంగానే అతడు ఇవన్నీ చేయాలి. 15ఇశ్రాయేలు వంశంలో పుట్టిన మీకు, మీ మధ్య నివసించే ఇతరులకు ఒకే రకమైన నియమాలు ఉండాలి. ఈ ఆజ్ఞ ఇప్పటినుండి భవిష్యత్తు వరకు కొనసాగుతుంది. మీరు, మీ మధ్య ఉండే ఇతరులు అంతా ఒకటే యెహోవా ఎదుట. 16అంటే మీరు ఒకే ఆజ్ఞలు, నియమాలు పాటించాలని దీని భావం. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన మీకు, మీ మధ్య నివసించే ఇతర ప్రజలందరికి ఇవే ఆజ్ఞలు, నియమాలు.”
17మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 18“ఇశ్రాయేలు ప్రజలతో ఈ విషయాలు చెప్పు: నేను మిమ్మల్ని మరో దేశానికి తీసుకొని వెళ్తున్నాను. 19ఆ దేశంలో పండే ఆహారం మీరు తినేటప్పుడు దానిలో భాగం యెహోవాకు అర్పణగా మీరు ఇవ్వాలి. 20మీరు ధాన్యం విసిరి, ముద్దగా చేయాలి. దాన్ని రొట్టెలుగా చేయాలి. ఆ రొట్టెల్లో మొదటిది యెహోవాకు ఇవ్వాలి. అది కళ్లం నుండి వచ్చే ధాన్యార్పణ. 21ఇప్పుడు, రాబోయే కాలమంతా ఈ అర్పణను మీరు యెహోవాకు ఇవ్వాలి. అనగా మీరు ఆహారంగా విసరుకొనే ధాన్యంలో మొదటిది యెహోవాకు ఇవ్వాలని అర్థం.
22“మోషేకు యెహోవా ఇచ్చిన ఈ ఆజ్ఞలలో దేనికైనా విధేయులవటం మీరు మరచిపోతే మీరేమిచేయాలి? 23ఇవి మోషే ద్వారా మీకివ్వబడిన ఆజ్ఞలు. వీటిని యెహోవా మీకు ఇచ్చిన రోజే ఈ ఆజ్ఞలు ప్రారంభం అయ్యాయి. ఈ ఆజ్ఞలు రాబోయే కాలమంతా కొనసాగుతాయి. 24అయితే వీటిలో ఏదైనా ఒక ఆజ్ఞకు మీరు విధేయులు కాకపోవటం జరుగవచ్చు. మీరు ఒక ఆజ్ఞకు విధేయులవటం మరచిపోయినా, ప్రజలంతా ఆ ఆజ్ఞ మరచిపోయి దోషులైనా, ప్రజలంతా ఒక కోడెదూడను యెహోవాకు అర్పణగా ఇవ్వాలి. ఇది దహనబలి, ఇది యెహోవాను సంతోషపెడుతుంది. కోడె దూడతో బాటు ధాన్యార్పణ, పానార్పణం కూడ ఇవ్వాలని జ్ఞాపకం ఉంచుకోండి. మరియు పాప పరిహర బలిగా ఒక మగ మేకనుకూడ మీరు ఇవ్వాలి.
25“కనుక ఆ పాపం నిమిత్తం ఆ చెల్లింపును యాజకుడు అర్పిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరి కోసం అతడు ఇలా చేస్తాడు. వారు పాపం చేస్తున్నట్టు ప్రజలకు తెలియదు. అయితే దాన్నిగూర్చి వారు తెలుసుకొన్నప్పుడు, వారి తప్పిదం నిమిత్తం యెహోవాకు అర్పించేందుకు వారు ఒక అర్పణం తెచ్చారు. అది హోమంలో దహించబడిన పాప పరిహారార్థ అర్పణ. 26ఇశ్రాయేలు ప్రజలందరు, వారి మధ్య నివసిస్తున్న ఇతర ప్రజలంతా క్షమించబడతారు. వారు చేస్తోంది తప్పు అని వారికి తెలియదు గనుక వారు క్షమించబడతారు.
27“అయితే ఒక వ్యక్తి మాత్రమే ఒక ఆజ్ఞను పాటించటం మరచిపోతే, అతడు ఒక సంవత్సరపు ఆడ మేకను పాపపరిహారార్థ బలిగా తీసుకుని రావాలి. 28ఆ పాపం నిమిత్తం యెహోవా ఎదుట యాజకుడు ఆ చెల్లింపును అర్పిస్తాడు. అతని నిమిత్తం యాజకుడు చెల్లింపును అర్పించాడు గనుక అతడు క్షమించ బడతాడు. 29పాపం చేసినప్పటికి తాను తప్పు చేస్తున్నానని ఎరుగని ప్రతి వ్యక్తికి ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన వారికి, మీ మధ్యలో నివసిస్తున్న ఇతర ప్రజలకు కూడా ఇదే ఆజ్ఞ.
30“కానీ ఎవరైనా సరే తాను చేస్తోంది తప్పు అని తెలిసికూడ పాపం చేస్తే, అలాంటివాడు యెహోవాకు విరోధంగా జీవిస్తున్నాడు. అతడిని తన ప్రజలనుండి పంపించి వేయాలి. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన వానికి, మీ మధ్య నివసించే వానికి ఇది సమానం. 31అతడు యెహోవా మాటకు అడ్డం తిరిగాడు. అతడు యెహోవా ఆజ్ఞలకు విధేయుడు కాలేదు. అతడు తప్పకుండ మీ మధ్యనుండి వెళ్లగొట్టబడాలి. అతడు దోషిగానే ఉంటాడు.”
విశ్రాంతి రోజున ఒకడు పని చేయటం
32ఇప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఇంకా అరణ్యంలోనే ఉన్నారు. ఒకడు వంట కట్టెలు చూడటం తటస్థించింది. కనుక అతడు ఆ కట్టెలు ప్రోగుచేస్తున్నాడు కాని అది సబ్బాతు. అతడు ఇలా చేయటం మరికొందరు చూసారు. 33అతడు కట్టెలు ఏరటం చూచిన వాళ్లు అతన్ని, మోషే, అహరోను దగ్గరకు తీసుకుని వచ్చారు. ప్రజలంతా వాడ్ని చుట్టేసారు. 34ఆ మనిషిని ఎలా శిక్షించాలో వారికి తెలియదు గనుక వారు అతణ్ణి అక్కడే ఉంచారు.
35అప్పుడు యెహోవా, “ఆ మనిషిచావాలి. నివాస స్థలపు వెలుపల, ప్రజలంతా వానిమీద రాళ్లు విసరాలి” అని మోషేతో చెప్పాడు. 36కనుక ప్రజలు అతణ్ణి నివాస స్థలమునుండి వెలుపలకు తీసు కుని వెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన విధంగానే వారు ఇలా చేసారు.
దేవుని ఆజ్ఞలు జ్ఞాపకముంచుకొను పద్ధతి
37మోషేతో యెహోవా అన్నాడు: 38“ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు: మీరు నా ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకొనేందుకు నేను మీకు ఒకటి ఇస్తాను. దారం ముక్కలు కొన్ని తీసుకొని వాటిని పేని, మీ బట్టల అంచులకు వాటిని కట్టాలి. ఆ కుచ్చుల్లో ఒక్కొక్క దాని మధ్య ఒక నీలం దారం ఉంచాలి. ఇప్పుడూ, ఇక ముందుకూ ఎప్పటికీ మీరు వాటిని ధరించాలి. 39మీరు ఈ కుచ్చులను చూచి, యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నింటిని జ్ఞాపకం ఉంచుకో గలుగుతారు. అప్పుడు మీరు ఆ ఆజ్ఞలకు విధేయులవుతారు. ఆజ్ఞలను మరచిపోయి, మీ శరీరాలు, కండ్లు కోరిన ప్రకారం చేయరు. 40మీరు నా ఆజ్ఞలు అన్నింటికి విధేయులు కావాలని జ్ఞాపకం ఉంచుకొంటారు. అప్పుడు మీరు దేవుని ప్రత్యక ప్రజలుగా ఉంటారు. 41నేను యెహోవాను, మీ దేవుడ్ని. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చింది నేనే. నేను మీ దేవునిగా ఉండటానికి ఇలా చేసాను. నేను యెహోవాను, మీ దేవుడ్ని.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సంఖ్యాకాండము 15: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International