మత్తయిత 6:5-14

మత్తయిత 6:5-14 TERV

“మీరు ప్రార్థించేటప్పుడు కపటుల్లా ప్రార్థించకండి. వాళ్ళు సమాజమందిరాల్లో, వీధుల ప్రక్కన నిలుచొని నలుగురూ చూడాలని ప్రార్థిస్తారు. అది వాళ్ళకు ఆనందాన్నిస్తుంది. కాని ఇది సత్యం — వాళ్ళకు లభించవలసిన ఫలితం వాళ్ళకప్పుడే పూర్తిగా లభించింది. మీరు ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసికొని కనిపించని మీ తండ్రికి ప్రార్థించండి. అప్పుడు రహస్యంలో ఉండే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు. “అంతేకాక, మీరు ప్రార్థించేటప్పుడు యూదులు కాని వాళ్ళవలె మాట్లాడవద్దు. ఆలా చేయడంవల్ల దేవుడు వింటాడని వాళ్ళు అనుకొంటారు. వాళ్ళవలె చేయకండి. మీకేం కావాలో మీరడగక ముందే మీ తండ్రికి తెలుసు. కాబట్టి మీరి విధంగా ప్రార్థించాలి: ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు సదా పవిత్ర పర్చబడాలని మేము ప్రార్థిస్తున్నాము. నీ రాజ్యం రావాలనీ, పరలోకంలో నీ చిత్తం నెరవేరునట్లే ఈ లోకంలో కూడా నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రతి రోజు మాకు కావలసిన ఆహారం మాకు దయ చేయుము. ఇతరులు మా పట్ల చేసిన పాపాలను మేము క్షమించినరీతి, మేము చేసిన పాపాలను కూడా క్షమించుము. మేము శోధనకు గురిఅయ్యేలా చేయవద్దు. పైగా మమ్ములను దుష్టుని నుండి కాపాడుము.’ ఇతర్ల తప్పుల్ని మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు.