లేవీయకాండము 9
9
దేవుడు యాజకులను అంగీకరించుట
1ఎనిమిదో రోజున అహరోనును, అతని కుమారులను మోషే పిలిచాడు. ఇశ్రాయేలు పెద్దలను కూడా అతడు పిలిచాడు. 2అహరోనుతో మోషే ఇలా చెప్పాడు, “ఒక కోడెదూడను, పొట్టేలును తీసుకొని రండి. వాటిలో ఏ దోషం ఉండకూడదు. కోడెదూడను పాపపరిహారార్థబలిగాను, పొట్టేలును దహనబలిగాను యెహోవాకు అర్పించండి. 3ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పండి, ‘పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను తీసుకోండి. దహన బలికోసం ఒక కోడెదూడను, ఒక గొర్రెపిల్లను తీసుకోండి. కోడెదూడ, గొర్రెపిల్ల ఒక్క సంవత్సరం వయస్సుగలవి కావాలి. ఆ జంతువుల్లో ఏ దోషమూ ఉండకూడదు. 4సమాధాన బలుల కోసం ఒక కోడెదూడను, ఒక పొట్టేలును తీసుకోండి. ఆ జంతువులను, నూనెతో కలుపబడ్డ నైవేద్యాన్ని తీసుకొని, వాటిని యెహోవాకు అర్పించండి. ఎందుకంటే ఈవేళ యెహోవా మీకు ప్రత్యక్ష మవుతాడు.’”
5కనుక ప్రజలంతా సన్నిధి గుడారం దగ్గరకు వచ్చారు. మోషే ఆజ్ఞాపించిన వాటన్నింటినీ వారంతా తీసుకొచ్చారు. ప్రజలంతా యెహోవా ఎదుట నిలబడ్డారు. 6“యెహోవా ఆజ్ఞప్రకారం మీరు చేసారు కనుక యెహోవా మహిమను మీరు చూస్తారు” అన్నాడు మోషే.
7అప్పుడు అహరోనుతో మోషే ఈ సంగతులు చెప్పాడు: “వెళ్లి, యెహోవా ఆజ్ఞాపించిన వాటిని జరిగించు. బలిపీఠం దగ్గరకు వెళ్లి, పాపపరిహారార్థ బలులు, దహనబలి అర్పణలు అర్పించు. మీ పాపాలు, ప్రజల పాపాలు తుడిచివేయబడేందుకు వాటిని జరిగించు. ప్రజల బలులను నీవు తీసుకొని, వారి పాపాలను పరిహరించే వాటిని జరిగించు.”
8కనుక అహరోను బలిపీఠం దగ్గరకు వెళ్లాడు. పాపపరిహారార్థ బలికోసం కోడె దూడను అతడు వధించాడు. ఈ పాపపరిహారార్థ బలి అతని కోసమే. 9అప్పుడు అహరోను కుమారులు ఆ రక్తాన్ని అహరోను దగ్గరకు తెచ్చారు. అహరోను తన వేలు ఆ రక్తంలో ముంచి, బలిపీఠం కొమ్ములమీద దాన్ని చల్లాడు. తర్వాత అహరోను ఆ రక్తాన్ని బలిపీఠం అడుగున పోసాడు. 10పాపపరిహారార్థ బలిలోనుంచి కొవ్వును, మూత్రగ్రంథులను, కాలేయం యొక్క కొవ్విన భాగాన్ని అహరోను తీసుకొని, బలిపీఠం మీద అతడు వాటిని దహించాడు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్లే అతడు అలా చేసాడు. 11తర్వాత మాంసాన్ని, చర్మాన్ని పాళెము వెలుపల అగ్నితో అహరోను కాల్చివేసాడు.
12తర్వాత, దహనబలి పశువును అహరోను వధించాడు. అది ముక్కలుగా కోయబడింది. దాని రక్తాన్ని అహరోను కుమారులు అహరోను దగ్గరకు తీసుకొని వచ్చారు. అహరోను ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాడు. 13దహనబలి పశువు యొక్క ముక్కలను, దాని తలను అహరోను కుమారులు అహరోనుకు అందించారు. అప్పుడు అహరోను వాటిని బలిపీఠం మీద దహించాడు. 14దహన బలి పశువు లోపలి భాగాలను, కాళ్లను కూడా అహరోను కడిగాడు. వాటిని బలిపీఠం మీద అతడు కాల్చివేసాడు.
15తర్వాత ప్రజల అర్పణను అహరోను తీసుకొచ్చాడు. ప్రజల పాప పరిహారార్థ బలిగా మేకను వధించాడు. మొదటిదాని వలెనే అతడు పాప పరిహారార్థంగా ఆ మేకను అర్పించాడు. 16అహరోను దహనబలి తీసుకొనివచ్చి అర్పించాడు. యెహోవా ఆజ్ఞప్రకారం అహరోను చేసాడు. 17అహరోను బలిపీఠం దగ్గరకు ధాన్యార్పణను తీసుకువచ్చాడు. అతడు గుప్పెడు ధాన్యార్పణ తీసుకొని, బలిపీఠం మీద ఆనాటి అనుదిన బలిని పక్కగా పెట్టాడు.
18ప్రజల సమాధాన బలి అర్పణలుగా కోడెదూడను, పొట్టేలును కూడ అహరోను వధించాడు. అహరోను కుమారులు రక్తాన్ని అహరోను దగ్గరకు తెచ్చారు. ఈ రక్తాన్ని అహరోను బలిపీఠం చుట్టూ చిలకరించాడు. 19కోడెదూడ, పొట్టేలు కొవ్వునుకూడ అహరోను కుమారులు అహరోను దగ్గరకు తెచ్చారు. కొవ్విన తోకను లోపలి భాగాలమీది కొవ్వును మూతగ్రంథులను, కాలేయము యొక్క కొవ్విన భాగాన్ని వారు తీసుకొచ్చారు. 20కొవ్విన ఈ భాగాలను కోడెదూడ, పొట్టేలు బోరలమీద అహరోను కుమారులు ఉంచారు. కొవ్విన ఈ భాగాలను బలిపీఠం మీద అహరోను కాల్చివేసాడు. 21మోషే ఆజ్ఞాపించిన ప్రకారం నైవేద్యంగా బోరలను, కుడితొడను యెహోవా ఎదుట అహరోను అల్లాడించాడు.
22అప్పుడు అహరోను ప్రజల వైపుగా తన చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించాడు. అహరోను పాపపరిహారార్థ బలి అర్పణను, దహనబలి అర్పణను, సమాధాన బలి అర్పణ, అర్పించటం ముగించిన తర్వాత అతడు బలిపీఠం నుండి దిగి వచ్చాడు.
23మోషే, అహరోనులు సన్నిధి గుడారం లోపలకు వెళ్లారు. వారు బయటకు వచ్చి ప్రజలను ఆశీర్వదించారు. యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. 24యెహోవా నుండి అగ్ని వచ్చి బలిపీఠం మీది దహన బలిని, కొవ్వును దహించి వేసింది. ప్రజలంతా ఇది చూచినప్పుడు ఉత్సాహధ్వనిచేసి సాష్టాంగపడ్డారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లేవీయకాండము 9: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International