విలాప వాక్యములు 5
5
యెహోవాకు ప్రార్థన
1యెహోవా! మాకు జరిగిన దానిని జ్ఞాపకము చేసికొనుము.
మాకు జరిగిన అవమానాన్ని తిలకించుము.
2మా రాజ్యం పరాయివాళ్ల వశమయ్యింది.
మా ఇండ్లు అన్యదేశీయులకు ఇవ్వబడ్డాయి.
3మేము అనాధలమయ్యాము.
మాకు తండ్రిలేడు.
మా తల్లులు విధవరాండ్రవలె అయ్యారు.
4మా తాగే నీరు మేము కొనవలసి వచ్చింది.
మేము వాడే కట్టెలకు మేము డబ్బు చెల్లించవలసి వచ్చింది.
5మా మెడమీద బలవంతంగా కాడి మోయవలసి వచ్చింది.
మేము అలసిపోయాము. మాకు విశ్రాంతి లేదు.
6మేము ఈజిప్టుతో ఒక ఒడంబడిక చేసికొన్నాము.
తగిన ఆహార పదార్థాల సరఫరాకు మేము అష్షూరుతో కూడ ఒక ఒడంబడిక చేసికొన్నాము.
7నీపట్ల మా పూర్వీకులు అపచారం చేశారు. వారిప్పుడు చచ్చిపోయారు.
వారి పాపాలకు ఇప్పుడు మేము కష్టాలనుభవిస్తున్నాము.
8బానిసలు మాకు పాలకులయ్యారు.
వారినుండి మమ్మల్ని రక్షించటానికి ఎవ్వరూ లేరు.
9మేము ఆహారం సంపాదించటానికి మా ప్రాణాలు తెగించవలసి వచ్చింది.
ఎడారిలో కత్తులు ధరించివున్న మనుష్యుల మూలంగా మేము మా ప్రాణాలను తెగించవలసి వచ్చింది.
10నిప్పు కొలిమిలా మా చర్మం వేడెక్కింది.
నకనకలాడే ఆకలి కారణంగా మా చర్మం వేడెక్కింది.
11సీయోను స్త్రీలపై శత్రువులు అత్యాచారాలు జరిపారు.
వారు యూదా నగరాలలో స్త్రీలను చెరిపారు.
12మా రాజకుమారులను శత్రువు ఉరితీశాడు.
వారు మా పెద్దలను గౌరవించలేదు.
13శత్రువు మా యువకులచే తిరుగలి తిప్పించి పిండిపట్టించాడు.
మా యువకులు కట్టెల మోపులు మోయలేక తొట్రిల్లారు.
14నగర ద్వారాల వద్ద పెద్దలు ఏమాత్రం కూర్చోడంలేదు.
యువకులు సంగీతం పాడటం మానివేశారు.
15మా హృదయాల్లో సంతోషం ఏ మాత్రం లేదు.
మా నాట్యం చనిపోయిన వారి కొరకు విలాపంగా మారింది.
16మా తలనుండి కిరీటం కింద పడిపోయింది.
మేము పాపం చేయటం మూలంగా మాకు చెడు పరిణామాలు వచ్చాయి.
17ఇందు మూలంగా మా గుండెలు అలిసిపోయాయి.
ఫలితంగా మా కండ్లు మసకబారాయి.
18సీయోను పర్వతం బీడు భూమి అయ్యింది.
సీయోను పర్వతం మీద నక్కలు సంచరిస్తున్నాయి.
19కాని యెహోవా, నీవు శాశ్వతంగా పరిపాలిస్తావు.
నీ రాచరిక సింహాసనం కలకాలం అలా నిలిచివుంటుంది.
20యెహోవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా మర్చి పోయినట్లున్నావు.
నీవు మమ్మల్ని ఇంత దీర్ఘకాలం వదిలి వెళ్లావు.
21యెహోవా, మమ్మల్ని నీవద్దకు చేర్చుకో. మేము సంతోషంగా నీదరి చేరుతాము.
మా రోజులను మునుపటిలా మార్చివేయుము.
22నీవు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించావు.
నీవు మాపట్ల మిక్కిలి కోపం వహించావు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
విలాప వాక్యములు 5: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International