యోబు 39
39
1“యోబూ, కొండ మేకలు ఎప్పడు పుట్టాయో నీకు తెలుసా?
తల్లి జింక పిల్లను పెట్టెటప్పుడు నీవు గమనిస్తావా?
2యోబూ, తల్లి కొండ మేక, తల్లి జింక వాటి పిల్లలను ఎన్నాళ్లు మోస్తాయో నీకు తెలుసా?
అవి పుట్టడానికి సరైన సమయం ఎప్పుడో నీకు తెలుసా?
3అవి పండుకొంటాయి, వాటి పిల్లలు పుడతాయి.
అప్పుడు వాటి పురిటినొప్పులు పోతాయి.
4తల్లి కొండ మేక పిల్లలు, తల్లి జింక పిల్లలు పొలాల్లో బలంగా పెరుగుతాయి.
అప్పుడు అవి వాటి నివాసాలు వదలి పోతాయి, తిరిగి రావు.
5“యోబూ, అడవి గాడిదలను స్వేచ్ఛగా తిరుగనిచ్చినది ఎవరు?
వాటి తాళ్లు ఊడదీసి, వాటిని స్వేచ్ఛగా పోనిచ్చినది ఎవరు?
6అడవి గాడిదకు నివాసంగా అరణ్యాన్ని ఇచ్చింది నేనే (యెహోవాను).
అవి నివాసం ఉండుటకు ఉప్పు భూములను నేను వాటికి ఇచ్చాను.
7అడవి గాడిద అల్లరి పట్టణాలకు దగ్గరగా వెళ్లదు.
ఏ మనిషీ వాటిని సాధువు చేసి, బండి లాగుటకు బలవంతం చేయలేడు.
8అడవి గాడిదలు కొండల్లో నివసిస్తాయి.
అక్కడే అవి గడ్డి తింటాయి.
తినుటకు పచ్చగా ఏమైనా ఉంటుందేమో అని అక్కడే అవి చూస్తాయి.
9“యోబూ, అడవి ఆబోతు నీకు పని చేయటానికి లోబడుతుందా?
రాత్రిపూట అది నీ కొట్టంలో ఉంటుంది?
10యోబూ, కేవలం తాడుతోనే అడవి ఆబోతు నీ పొలం దున్నేటట్టు చేయగలవా?
నీ కోసం అది లోయలను దున్నుతుందా?
11యోబూ, అడవి ఆబోతు బలాన్ని నీ పని కోసం ఉపయోగించుకొనేందుకు
నీవు దానిమీద ఆధార పడగలవా?
మహా కష్టతరమైన నీ పని అది చేస్తుంది అనుకొంటావా?
12నీ ధాన్యాన్ని పోగుచేసి నీ కళ్లం చోటుకు
అది తీసుకొని వస్తుందని దాన్ని నీవు నమ్మగలవా?
13“నిప్పుకోడి సంతోషంగా ఉంది, గనుక అది దాని రెక్కలు రెప రెప లాడిస్తుంది.
(కానీ అది ఎగుర లేదు) కానీ నిప్పుకోడి రెక్కలు కొంగ రెక్కల్లాంటివి కావు.
14నిప్పుకోడి నేలమీద గుడ్లు పెడుతుంది.
ఇసుకలో అవి వెచ్చగా అవుతాయి.
15ఎవరైనా ఆ గుడ్లు మీద నడచి వాటిని పగులగొట్టవచ్చని
లేక ఏదైనా అడవి జంతువు వాటిని పగుల గొట్టవచ్చని నిప్పుకోడి మరచిపోతుంది.
16నిప్పుకోడి తన పిల్లలను చూడదు.
ఆ పిల్లలు తనవి కానట్టే చూస్తూంది.
దాని పిల్లలు చస్తే దాని ప్రయాసం అంతా వ్యర్థం అయిందనే విషయం దానికి లక్ష్యం లేదు.
17ఎందుకంటే, నేను (దేవుణ్ణి) నిప్పుకోడికి జ్ఞానం ఇవ్వలేదు.
నిప్పుకోడి తెలివి తక్కువది. నేను దాన్ని అలాగే చేశాను.
18కానీ నిప్పుకోడి పరుగెత్తటానికి లేచినప్పుడు గుర్రాన్ని, దాని రౌతును చూచి అది నవ్వుతుంది.
ఎందుకంటే, అది గుర్రం కంటే వేగంగా పరుగెత్తుతుంది గనుక.
19“యోబూ, గుర్రానికి బలం నీవు ఇచ్చావా?
లేక దాని మెడ మీద జూలు వెంట్రుకలను నీవు పెట్టావా?
20యోబూ, మిడత ఎగిరినట్టుగా నీవు గుర్రాన్ని దూకించగలవా?
గుర్రం గట్టిగా సకిలిస్తుంది, మనుష్యుల్ని భయపెడ్తుంది.
21గుర్రం, తనకు చాలా బలం ఉందని సంతోషిస్తుంది.
అది నేలమీద కాలితో గీకుతుంది. యుద్ధానికి వెళ్లేటప్పుడు గుర్రం వేగంగా పరుగెత్తుతుంది
22భయాన్ని చూచి గుర్రం నవ్వుతుంది.
అది భయపడదు. యుద్ధం నుండి అది పారిపోదు.
23గుర్రం మీద అంబులపొది వణకుతుంది.
దాని రౌతు వద్ద ఉన్న బల్లెం, ఆయుధాలు సూర్యకాంతిలో తళతళలాడుతాయి.
24గుర్రం చాలా ఉల్లాసంగా ఉంటుంది. నేలమీద అది చాలా వేగంగా పరుగెత్తుతుంది.
బూరధ్వని వింటే గుర్రం ఇంక నిలబడలేదు.
25బూర మ్రోగినప్పుడు గుర్రం ‘ఓహో’ అంటుంది.
దూరం నుంచే అది యుద్ధాన్ని పసికడుతుంది.
సేనాని కేకలు వేసే ఆజ్ఞలను, ఇతర యుద్ధ ధ్వనులను అది వింటుంది.
26“యోబూ, డేగ దాని రెక్కలు విప్పి దక్షిణంగా ఎగిరేటప్పుడు ఎలా ఎగరాలో డేగకు నీవు నేర్పించావా?
27యోబూ, పక్షిరాజు ఎగరాలని,
పర్వతాల్లో ఎత్తుగా దాని గూడు కట్టుకోవాలని నీవు దానికి ఆజ్ఞాపించావా?
28పక్షిరాజు కొండ మీద బండపైన నివసిస్తుంది.
ఆ బండ పక్షిరాజు యొక్క కోట.
29పక్షిరాజు తన దుర్గంలోనుండి తన ఆహారం కోసం వెదకుతుంది.
దూరంలో ఉన్న ఆహారాన్ని అది చూడగలదు.
30పక్షిరాజు పిల్లలు రక్తం తాగుతాయి.
అవి చచ్చిన శవాల చుట్టూరా చేరుతాయి.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 39: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International