న్యాయాధిపతులు 18
18
దాను లాయిషు నగరాన్ని పట్టుకొనుట
1ఆ సమయంలో, ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. పైగా ఆ సమయంలో దాను వంశీయులు ఉండడానికిగాను ఒక చోటుకోసం అన్వేషిస్తున్నారు. తమకు సొంతమనదగిన ప్రదేశం వారికి లేదు. ఇశ్రాయేలుకి చెందిన ఇతర వంశాలవారికి స్వస్థలం ఉంది. కాని దాను వంశీయులకు సొంత ప్రదేశం లేదు.
2అందువల్ల దాను వంశంవారు ఐదుగురు సైనికులను ఏదైనా ఒక ప్రదేశం అన్వేషించమని చెప్పి పంపించారు. వారు ఒక మంచి ప్రదేశం వెదికేందుకు గాను వెళ్లారు. ఆ ఐదుగురు జోర్యా, ఎష్తాయేలు నగరాల నుండి వచ్చారు. దాను వంశమునకు చెందిన అన్ని కుటుంబాల నుండి వచ్చినవారు. అందువల్లనే వారిని ఎంపిక చేయడం జరిగింది. “వెళ్లి ఏదైనా ఒక చోటు చూడండి” అని వారికి చెప్పబడింది.
ఆ ఐదుగురూ కొండ దేశమైన ఎఫ్రాయిముకు వచ్చారు. వారు మీకా ఇంటికి వచ్చారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. 3వారు మీకా ఇంటికి అతి సమీపంగా వచ్చేసరికి, ఆ లేవీ యువకుడి కంఠస్వరం విన్నారు. ఆ గొంతుని వారు గుర్తుపట్టారు. అందువల్ల వారు మీకా ఇంటి దగ్గర ఆగిపోయారు. ఆ యువకుణ్ణి “ఎవరు నిన్నీ స్థలానికి తీసుకువచ్చారు? ఇక్కడ నీవేమి చేస్తున్నావు? ఇక్కడ నీ పనేమిటి?” అని వారు అడిగిరి.
4ఆ యువకుడు మీకా తనకోసం చేసిన పనులను తెలియజేశాడు. “మీకా నన్ను జీతానికి ఉంచుకున్నాడు. నేనతని యాజకుడిని” అని అతను చెప్పాడు.
5అప్పుడు వారతనితో ఇలా అన్నారు; “దయచేసి మాకోసంకూడా దేవుణ్ణి ఏదో ఒకటి అడుగు. ఏదైనా మేము తెలుసుకోదలచాము. ఉండడానికి చోటుకోసం వెతుకుతున్న మా అన్వేషణ విజయవంతమవుతుందా?”
6యాజకుడు ఆ ఐదుగురితో ఇలా అన్నాడు, “అవుతుంది. నిశ్చింతంగా వెళ్లండి. మీ త్రోవలో, యెహోవా మిమ్మల్ని నడుపుతాడు.”
7అందువల్ల ఐదుగురు వెళ్లిపోయారు. లాయిషు నగరానికి వారు వచ్చారు. ఆ నగరంలోని ప్రజలు భద్రత కలిగి ఉండడం వారు చూశారు. వారిని సీదోను ప్రజలు పరిపాలించారు. ప్రతిదీ ప్రశాంతంగా శాంతియుతంగా ఉండి, ప్రజలకు అంతా సమృద్ధిగా ఉండినది. తమకు హాని కలిగించే విరోధులు దగ్గరలో వారికి లేరు. పైగా సీదోను నగరానికి దూరంగా వారు నివసిస్తున్నారు. ప్రజలతో ఎలాంటి ఒడంబడికలూ చేసుకోలేదు.
8ఆ ఐదుగురూ జోర్యా, ఎష్తాయేలు నగరాలకు తిరిగి వెళ్లారు. “సంప్రదింపులు చేశారా?” అని వారి బంధువులు అడిగారు.
9ఆ ఐదుగురూ ఇలా బదులు చెప్పారు, “మేము ఒక ప్రదేశం చూశాము. అది చాలా బాగున్నది. వారిని మనం ప్రతిఘటించాలి. వేచి ఉండవద్దు! మనం వెళదాము, ఆ ప్రదేశాన్ని తీసుకుందాము. 10మీరు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు, అక్కడ చాలా ప్రదేశం ఉన్నదని మీరే తెలుసుకుంటారు. అక్కడ అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ప్రజలు ఏ ప్రతిఘటనను ఎదుర్కొంటారని అనుకోవడంలేదని మీరు తెలుసుకుంటారు. దేవుడే మనకు ఆ ప్రదేశం ఇచ్చాడు.”
11అందువల్ల దాను వంశానికి చెందిన ఆరువందల మంది మనుష్యులు జోర్యా, ఎష్తాయేలు నగరాలకు బయలుదేరారు. యుద్ధానికి వారు సిద్ధంగా ఉన్నారు. 12లాయిషు నగరానికి వెళ్లే దారిలో, యూదాలోని కిర్యత్యారీము అనే నగరం వద్ద వారు ఆగారు. అక్కడ ఒక గుడారం వేసుకున్నారు. అందువల్లనే కిర్యత్యారీముకి పడమరగా వున్న ప్రదేశానికి మహనెదాను అని పేరు వచ్చింది. నేటికీ అదే పేరు. 13ఆ ప్రదేశంనుండి, ఆ ఆరువందల మంది మనుష్యులూ కొండ దేశమైన ఎఫ్రాయిముకి ప్రయాణమయ్యారు. ఆ తర్వాత వారు మీకా ఇంటికి వచ్చారు.
14లాయిషు చుట్టు ప్రక్కల ప్రాంతంలో సంచరించటానికి వెళ్లిన ఆ ఐదుగురూ వాళ్ల బంధువులతో అన్నారు: “ఒక ఇంట్లో ఏఫోదు ఉన్నది. పైగా గృహదేవతలు, చెక్కిన విగ్రహం మరియు వెండి విగ్రహం ఉన్నాయి. మీకేమి చేయాలో తెలుసు వాటిని తీసుకురావాలి.” 15అందువల్ల వారు మీకా ఇంటి వద్ద నిలిచారు. అక్కడే యువకుడైన లేవీ మనిషి ఉన్నాడు. నీవెలా వున్నావని ఆ యువకున్ని వారడిగారు. 16దాను వంశీయులైన ఆ ఆరువందల మంది మనుష్యులు వెలుపల ద్వారం వద్ద నిలిచారు. వారి వద్ద ఆయుధాలు ఉన్నాయి. యుద్ధానికి వారు సిద్ధంగా ఉన్నారు. 17-18ఐదుగురు గూఢచారులు ఇంట్లోకి వెళ్లారు. వెలుపల ద్వారం పక్కగా యుద్ధ సన్నద్ధులైన ఆ ఆరువందల మంది మనుష్యులతో యాజకుడు నిలబడివున్నాడు. ఆ మనుష్యులు మలిచిన విగ్రహం, ఏఫోదు, గృహదేవతలు మరియు వెండి విగ్రహం తీసుకున్నారు. యువకుడైన లేవీ యాజకుడు, “మీరేమి చేస్తున్నారు?” అని అడిగాడు.
19ఆ ఐదుగురు ఇలా బదులు చెప్పారు: “ఊరక వుండు! ఒక్కమాట కూడా మాట్లాడ వద్దు. మాతో పాటు రా. మా తండ్రిగా, యాజకుడుగా ఉండు. నీవు ఎన్నుకుని తీరాలి. కేవలం ఒక్క వ్యక్తికి తండ్రిగా, యాజకుడుగా ఉండటం మంచిదా? లేక ఇశ్రాయేలు ప్రజలలో ఒక వంశం వారికి యాజకుడుగా ఉండడం మంచిదా?”
20లేవీ వ్యక్తికిది సంతోషదాయకమయింది. అందువల్ల అతను ఏఫోదు, గృహదేవతలు మరియు విగ్రహం తీసుకొని, దాను వంశం వారివద్ద నుంచి వచ్చిన మనుష్యులతో వెళ్లిపోయాడు.
21తర్వాత దాను వంశానికి చెందిన ఆ ఆరువందల మంది మనుష్యులు లేవీ యాజకునితో కలిసి వెనుదిరిగి మీకా ఇల్లు విడిచి వెళ్లారు. వారు తమ చిన్న పిల్లలను, తమ జంతువులను తమ అన్ని వస్తువులను వారి ముందు విడిచిపెట్టి వెళ్లారు.
22దాను వంశమునకు చెందిన ఆ మనుష్యులు ఆ చోటునుండి చాలా దూరం వెళ్లారు. మీకాదగ్గర నివసించే వారు ఒకటిగా కలుసుకున్నారు. తర్వాత దాను మనుష్యుల్ని వెంబడించారు. వారిని పట్టుకున్నారు. 23దాను మనుష్యుల్ని మీకా మనుష్యులు కేకలు వేయసాగారు. దాను మనుష్యులు నిలబడ్డారు. “సమస్య ఏమిటి? ఎందుకు కేకలు వేస్తున్నారు?” అని మీకాని అడిగారు.
24మీకా బదులు చెప్పెను: “దాను మనుష్యులైన మీరు నా విగ్రహాలు తీసుకుపోతున్నారు. వాటిని నా కోసం తయారు చేసుకున్నాను. మీరు నా యాజకుని కూడా తీసుకువెళ్తున్నారు. ఇక నాకు ఏమి మిగిలింది? ‘సమస్య ఏమిటి?’ అని మీరెలా అడుగుతారు?”
25దాను వంశీయులు అందుకు ఇలా అన్నారు: “మాతో నీవు వివాదానికి పాల్పడడం మంచిది కాదు. మాలో కొందరు కోపిష్ఠులు. మమ్మల్ని నీవు కేకలు వేస్తే, వారు నిన్ను ప్రతిఘటించవచ్చు. నీవు, మీ కుటుంబాలవారూ చంపబడవచ్చు.”
26తర్వాత దాను వంశానికి చెందిన మనుష్యులు వెనుదిరిగి తమ తోవను వెళ్లారు. ఆ మనుష్యులు తనకంటె బలాఢ్యులని మీకా గ్రహించాడు. అందువల్ల అతను ఇంటికి వెళ్లిపోయాడు.
27కాగా మీకా చేసిన విగ్రహాలను దాను వంశీయులు తీసుకొనిపోయారు. మీకాతో ఉండిన యాజకుని కూడా తమతో పాటు తీసుకొనిపోయారు. తర్వాత వారు లాయిషుకి వచ్చారు. లాయిషులో నివసిస్తున్న వారి మీద దాడిచేశారు. ఆ మనుష్యులు శాంతముగా ఉన్నారు. వారు దాడిని ఎదురుచూడలేదు. దానుకు చెందిన మనుష్యులు వారిని తమ కత్తులతో చంపివేశారు. తర్వాత నగరాన్ని కాల్చివేశారు. 28లాయిషులో నివసించేవారికి తమను కాపాడేవారు లేరు. వారు సీదోను నగరానికి చాలా దూరాన నివసించుటచే, ఆ నగర ప్రజలు సహాయం చేయలేకపోయారు. మరియు లాయిషు ప్రజలు అరాము ప్రజలతో ఒడంబడికయేమీ చేసుకొని ఉండలేదు. అందువల్ల వారు సహాయం చెయ్యలేదు. లాయిషు నగరం ఒక లోయలో ఉంది. అది బెత్రెహోబు పట్టణానికి చెందింది. దాను ప్రజలు ఆ ప్రదేశంలో ఒక కొత్త నగరం నిర్మించుకున్నారు. ఆ నగరం వారి నివాసమయింది. 29దాను ప్రజలు ఆ నగరానికి కొత్త పేరు పెట్టారు. దానిని లాయిషు అన్నారు. కాని దానిని దాను అని మార్చివేశారు. ఆ నగరానికి ఇశ్రాయేలు కుమారులలో ఒకడైన దాను అను పూర్వీకుని పేరు పెట్టారు.
30దాను వంశానికి చెందిన ప్రజలు దాను నగరంలో విగ్రహాలు ప్రతిష్ఠించారు. వారు గెర్షోము కుమారుడైన యోనాతానును తమ యాజకునిగా నియమించుకున్నారు. గెర్షోము మోషే#18:30 మోషే లేక మనష్షే. కుమారుడు. యోనాతాను మరియు అతని కుమారులు ఇశ్రాయేలు ప్రజల్ని బందీలుగా చేసి బబులోనుకు తీసుకు వెళ్లేంతవరకు దాను వంశం వారికి యాజకులుగా ఉన్నారు. 31దాను ప్రజలు మీకా చేసిన విగ్రహాలను పూజిస్తూండేవారు. దేవాలయము షిలోహులో ఉన్నంత కాలము వారు ఆ విగ్రహాలను పూజించుచుండిరి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
న్యాయాధిపతులు 18: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International