ఆదికాండము 41:17-57

ఆదికాండము 41:17-57 TERV

అప్పుడు ఫరో యోసేపుతో చెప్పాడు: “నా కలలో నేను నైలునది ప్రక్కగా నిలబడ్డాను. ఆ నదిలోనుంచి ఏడు ఆవులు బయటకు వచ్చి గడ్డి మేయటం నేను చూశాను. ఈ ఆవులు బలిసి, అందంగా ఉన్నాయి. అప్పుడు మరో ఏడు ఆవులు నదిలో నుంచి రావటం నేను చూశాను. ఈ ఆవులు బక్కచిక్కి రోగిష్ఠివిగా ఉన్నాయి. ఈజిప్టు దేశం మొత్తంలో నేను చూసిన ఆవుల్లో అవి పరమ అసహ్యంగా ఉన్నాయి. అసహ్యమైన ఈ ఏడు ఆవులు ముందు వచ్చిన అందమైన ఏడు ఆవులను తినివేశాయి. అయితే ఆ ఏడు ఆవులను తినివేసిన తర్వాత కూడ అవి ఇంకా బక్కచిక్కి ఉన్నాయి. వాటిని చూస్తే, అవి ఏడు ఆవులను తిన్న వాటిల్లాగ అగుపించవు. ముందు అవి ఎంత బక్కగా అసహ్యంగా ఉన్నాయో యిప్పుడూ అలానే కనబడ్డాయి. అప్పుడు నేను మేల్కొన్నాను. “తర్వాత నాకు వచ్చిన మరో కలలో ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం నేను చూశాను. ఆ వెన్నులు నిండుగా, చక్కగా, అందంగా ఉన్నాయి. తర్వాత వాటికి యింకా ఏడు వెన్నులు పెరిగాయి. కానీ ఆ వెన్నులు పీలగా, అసహ్యంగా ఉండి, వేడి గాడ్పులకు పాడైపోయాయి. అప్పుడు ఏడు మంచి వెన్నులను పీల వెన్నులు తినివేశాయి. “మంత్రాలు తెలిసిన నా మనుష్యులకు, విద్వాంసులకు నేను ఈ కల చెప్పాను. కానీ ఎవ్వరూ ఆ కలను వివరించలేక పోతున్నారు. ఏమిటి దీని భావం?” అప్పుడు ఫరోతో యోసేపు ఇలా చెప్పాడు: “ఈ రెండు కలల భావం ఒక్కటే. ఏమి చేయనున్నాడో అది దేవుడు మీతో చెబుతున్నాడు. ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు. ఏడు మంచి ధాన్యపు వెన్నులు ఏడు సంవత్సరాలు. రెండు కలల్లోని సంగతి ఒక్కటే. బక్కచిక్కి ఉన్న ఆవులు ఏడు, పీలగా ఉన్న ధాన్యపు వెన్నులు కూడ ఏడు. అంటే, అవి ఈ దేశంలో ఏడు ఆకలి సంవత్సరాలు. ఏడు మంచి సంవత్సరాల తర్వాత ఈ ఏడు సంవత్సరాలు వస్తాయి. త్వరలో ఏమి జరుగుతుందో దాన్ని దేవుడు మీకు చూపెట్టాడు. నేను చెప్పినట్టే ఇది జరుగుతుంది. ఈజిప్టు దేశమంతటా ఏడేళ్లపాటు మంచి పంటలు పండి, తినటానికి సమృద్ధిగా ఉంటుంది. అయితే ఆ ఏడు సంవత్సరాల తర్వాత, దేశమంతటా కరవు సంవత్సరాలు ఏడు వస్తాయి. ఈజిప్టులో పండిన పంట ఎంత అయినా, దానిని మరచిపోతారు. ఈ ఆకలి దేశాన్ని నాశనం చేస్తుంది. సమృద్ధిగా భోజనం చేయటం అంటే ఏమిటో ప్రజలు మరచిపోతారు. “ఫరోగారూ, ఒకే విషయాన్ని గూర్చి మీకు రెండు కలలు ఎందుకు వచ్చాయి? దేవుడు తప్పక జరిపిస్తాడని చూపించేందుకు ఇలా జరిగింది. అదీ త్వరలోనే దేవుడు జరిగిస్తాడని సూచిస్తోంది. కనుక ఓ ఫరో, చాలా తెలివి, జ్ఞానం ఉన్న ఒక మనిషిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మనిషిని ఈజిప్టు దేశం అంతటిమీద అధికారిగా మీరు నియమించాలి. ఆ తర్వాత ప్రజల దగ్గర్నుండి ధాన్యం సేకరించేందుకు మరి కొందర్ని మీరు నియమించాలి. ప్రతీ వ్యక్తి ఏడు మంచి సంవత్సరాల్లో పండించే మంచి పంటలో అయిదవ భాగం ఇవ్వాలి. రాబోయే మంచి సంవత్సరాల కాలంలో ఈ ధాన్యం అంతా సేకరించమని ఈ మనుష్యులకు ఆజ్ఞాపించండి. ఈ ధాన్యం పట్టణాల్లో భద్రం చేయటానికి వాళ్లకు అధికారం ఉందని ఈ మనుష్యులకు చెప్పండి. తర్వాత ఆ ధాన్యం అవసరం వచ్చేంతవరకు వారు దాన్ని కాపాడాలి. ఫరో! ఈ విధంగా ఆ ఆహారం మీ అధీనంలో ఉంటుంది. ఈజిప్టు దేశంలో వచ్చే ఏడు ఆకలి సంవత్సరాల్లో ఈ ధాన్యం సహాయపడుతుంది. అప్పుడు ఈజిప్టు ప్రజలు ఆ ఏడు సంవత్సరాల్లో కరువు కారణంగా మరణించరు.” ఇది చాలా చక్కని తలంపులా కనబడింది ఫరోకు. అతని సేవకులంతా ఒప్పుకొన్నారు. “ఈ పని చేసేందుకు యోసేపు కంటే మంచివాడ్ని ఇంకెవరినైనా మీరు కనుగొనగలరా? దేవుని ఆత్మ మూలంగా ఇతడు నిజంగా జ్ఞాని” అని ఫరో తన సేవకులతో చెప్పాడు. కనుక ఫరో, “వీటన్నింటిని దేవుడే నీకు చూపెట్టాడు కనుక నీవు అందరిలో మహా జ్ఞానివై ఉండాలి. అంచేత నిన్నే ఈ దేశం మీద అధిపతిగా నేను చేస్తాను. ప్రజలు నీ ఆజ్ఞలన్నింటికి విధేయులవుతారు. ఈ దేశంలో నేను ఒక్కడ్ని మాత్రమే నీకంటె గొప్ప అధికారిగా ఉంటాను” అని యోసేపుతో చెప్పాడు. (ఫరో యోసేపును రాజ్యపాలకునిగా నియమించినప్పుడు ప్రత్యేక సమావేశం మరియు ఊరేగింపు ఉండినవి.) అప్పుడు ఫరో, “ఇప్పుడు ఈజిప్టు దేశం అంతటి మీద నిన్ను నేను పాలకునిగా నియమిస్తున్నాను” అని యోసేపుతో చెప్పాడు. అప్పుడు ఫరో రాజముద్రగల తన ఉంగరాన్ని యోసేపుకు ఇచ్చాడు. యోసేపు ధరించటానికి నాణ్యతగల ఒక అంగీని అతడు ఇచ్చాడు. యోసేపు మెడలో ఒక బంగారు గొలుసు ఫరో వేశాడు. రెండో రాజరథం మీద తిరగమని ఫరో యోసేపుతో చెప్పాడు. ప్రత్యేక సంరక్షకులు అతని రథానికి ముందర నడిచారు. “ప్రజలారా, యోసేపుకు సాష్టాంగపడండి” అంటూ వాళ్లు ప్రజలను హెచ్చరించారు. కనుక ఈజిప్టు దేశం అంతటి మీద యోసేపు పాలకునిగా నియమించబడ్డాడు. అతనితో ఫరో అన్నాడు: “నేను ఫరోను అంటే రాజును. కనుక నేను ఏమి అయినా చేయాలనుకొంటే అది చేస్తాను. కానీ, ఈజిప్టులో మరి ఏ వ్యక్తి అయినా నీవు చెప్పకుండ ఒక చేయి ఎత్తకూడదు, కాలు కదపగూడదు.” ఫరో యోసేపుకు జప్నత్పనేహు అనే మరో పేరు పెట్టాడు. ఓను యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతును యోసేపుకు భార్యగా ఫరో ఇచ్చాడు. కనుక ఈజిప్టు దేశం అంతటిమీద యోసేపు పాలకుడయ్యాడు. యోసేపు ఈజిప్టు రాజు కొలువులో పని చేయడం మొదలు బెట్టినప్పుడు అతని వయస్సు 30 సంవత్సరాలు. యోసేపు ఈజిప్టు దేశం అంతటా సంచారం చేశాడు. ఏడు మంచి సంవత్సరాల కాలంలోనూ దేశంలో పంటలు బాగుగా పండాయి. ఆ ఏడు సంవత్సరాల్లో యోసేపు చాలా ధాన్యం ఈజిప్టులో పొదుపు చేశాడు. ఆహారాన్ని యోసేపు పట్టణాల్లో భద్రపరచాడు. ప్రతి పట్టణం చుట్టు ప్రక్కల పండిన పంటను ఆ పట్టణంలోనే యోసేపు భద్రపరచాడు. యోసేపు విస్తారంగా ధాన్యం చేర్చి పెట్టాడు. సముద్రపు ఇసుకలా ఉంది అదంతాను. కొలిచేందుకు గూడ వీలు లేనంత విస్తారంగా ఉంది అతడు చేర్చిపెట్టిన ధాన్యం. ఓను యాజకుడైన పోతీఫెర కుమార్తె అయిన ఆసెనతు యోసేపుకు భార్య. మొదటి ఆకలి సంవత్సరం రాకముందే యోసేపు ఆసెనెతులకు ఇద్దరు కుమారులు పుట్టారు. మొదటి కుమారుని పేరు మనష్షే. “నా కష్టాలు అన్నింటినీ, నా ఇంటిని గూర్చిన విషయాలన్నింటినీ నేను మరచిపోయేటట్టు దేవుడు చేశాడు” అని అనుకొన్నాడు గనుక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు. యోసేపు తన రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. “నాకు ఎన్నో గొప్ప కష్టాలు వచ్చాయి, కాని అన్ని విషయాల్లో దేవుడు నాకు సాఫల్యాన్ని కార్యసాధనను కల్గించాడు” అని యోసేపు అనుకొన్నాడు గనుక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు. ఏడు సంవత్సరాల పాటు ప్రజలు తినేందుకు అవసరమైన ఆహారం అంతా వారికి ఉండినది. కానీ ఆ సంవత్సరాలు ముగిశాయి. తరువాత సరిగ్గా యోసేపు చెప్పినట్లే ఏడు సంవత్సరాల ఆకలి కాలం మొదలయింది. ఆ ప్రాంతల్లోని దేశాలలో ఎక్కడేగాని ఏ ఆహారం పండలేదు. తినుటకు ప్రజలకు ఏమీ లేదు. కానీ యోసేపు ధాన్యం భద్రపరచినందువల్ల ఈజిప్టులో ప్రజలు తినుటకు సమృద్ధిగా ఉంది. కరువు కాలం ప్రారంభం కాగానే ఆహారంకోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. ఫరో ఈజిప్టు ప్రజలతో, “యోసేపును అడగండి. అతడు ఏమి చేయమంటే అలా చేయండి” అని చెప్పాడు. కనుక ఆ దేశంలో ఎక్కడ చూసినా కరవు ప్రబలుతున్నప్పుడు, ధాన్యము భద్రపరచిన గదులలో నుండి యోసేపు ప్రజలకు ధాన్యం ఇచ్చాడు. చేర్చిపెట్టిన ధాన్యం ఈజిప్టు ప్రజలకు యోసేపు విక్రయించాడు. ఈజిప్టులో కరవు చాలా భయంకరంగా ఉంది. మరియు ప్రాంతాలలోను కరవు తీవ్రంగానే ఉంది. కనుక ఇతర ఈజిప్టు చుట్టుప్రక్కల దేశాల ప్రజలంతా ధాన్యం కొనేందుకు ఈజిప్టులో ఉన్న యోసేపు దగ్గరకు రావలసి వచ్చింది.

ఆదికాండము 41:17-57 కోసం వీడియో