కనుక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవించండి. అప్పుడు మీ మానవ స్వభావం వల్ల కలిగే వాంఛల్ని తీర్చుకోకుండా ఉండగలరు. ఎందుకంటే మానవ స్వభావము పరిశుద్ధాత్మ కోరుకొంటున్నదానికి విరుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ కోరేది మన స్వభావం కోరేదానికి విరుద్ధంగా ఉంటుంది. ఇవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. తద్వారా మీరు చెయ్యాలనుకుంటున్నదాన్ని చెయ్యలేకపోతున్నారు. కాని పరిశుద్ధాత్మ చూపిన మార్గాన్ని అనుసరిస్తే ధర్మశాస్త్రం మిమ్మల్ని బంధించదు.
మానవ స్వభావం యొక్క పనులు మనకు బాగా తెలుసు. అవేవనగా వ్యభిచారము, అపవిత్రత, కామము, విగ్రహారాధన, మంత్రతంత్రాలు, ద్వేషము, కలహము, ఈర్ష్య, కోపము, స్వార్థము, విరోధము, చీలికలు, అసూయ, త్రాగుబోతుతనము, కామకేళీలు మొదలగునవి. వీటిని గురించి నేనిదివరకే వారించాను. మళ్ళీ వారిస్తున్నాను. ఈ విధంగా జీవించేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. కాని పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఫలాలు ప్రేమ, ఆనందం, శాంతం, సహనం, దయ, మంచితనం, విశ్వాసం, వినయం, ఆత్మ నిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ చట్టమూ లేదు. యేసుక్రీస్తుకు చెందినవాళ్ళు తమ శరీరాన్ని, దానికి చెందిన మోహాలను, కోరికలను సిలువకు వేసి చంపారు. మనము పరిశుద్ధాత్మ వలన జీవిస్తున్నాము. కనుక ఆయన ప్రకారము నడుచుకొందాము. ఒకరికొకర్ని రేపకుండా, ద్వేషించకుండా, గర్వించకుండా ఉందాం.