యెహెజ్కేలు 46

46
పాలకుడు-పండుగలు
1నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “లోపలి ఆవరణ తూర్పు ద్వారం ఆరు పని రోజులలోను మూసి ఉంచబడుతుంది. కాని అది సబ్బాతు రోజున, అమావాస్య రోజున తెరువబడుతుంది. 2పాలకుడు ద్వారం మండపం గుండా లోనికి ప్రవేశించి, ద్వారం ప్రక్కన నిలబడతాడు. తరువాత యాజకులు పాలకుని తరుపున దహనబలి, సమాధాన బలులు సమర్పిస్తారు. ద్వారం గడపవద్దనే పాలకుడు ఆరాధించాలి, మరియు నమస్కరించాలి. అతడు బయటికి వెళతాడు. కాని సాయంత్రం వరకు ద్వారం మూయబడదు. 3సబ్బాతు రోజులలోను, అమావాస్యలందు సాధారణ ప్రజలు కూడ యెహోవా ముందు ద్వారం తెరవబడిన దగ్గర పూజలు చేస్తారు.
4“సబ్బాతు దినాన పాలకుడు యెహోవాకు దహన బలులు అర్పిస్తాడు. ఏ దోషమూలేని ఆరు గొర్రెపిల్లలను, ఏ దొషమూలేని ఒక పొట్టేలును అతడు సమకూర్చాలి. 5పొట్టేలుతో పాటు ఒక ఏఫా (తొమ్మిది మానికెలు) ధాన్యాన్ని కూడ అతడు తప్పక ఇవ్వా్లి. పాలకుడు ధాన్యార్పణకు గొర్రె పిల్లలతో పాటు తను ఇవ్వగలిగినంత ఇస్తాడు. ప్రతి తొమ్మిది మానికెల (ఏఫా) ధాన్యానికి మూడు పడుల (ఒక గాలను) ఒలీవ నూనెను అతడు తప్పక ఇవ్వాలి.
6“అమావాస్యనాడు ఏ దోషమూలేని ఒక కోడెదూడను అతడు తప్పక అర్పించాలి. ఏ దోషమూలేని ఆరు గొర్రె పిల్లలను, ఒక పొట్టేలును అతడు అర్పిస్తాడు. 7కోడెదూడతో పాటు ఒక తూమెడు ధాన్యార్పణను, పొట్టేలుతో పాటు పాలకుడు తప్పక అందించాలి. గొర్రె పిల్లతోపాటు పాలకుడు తన శక్తికొలది సమర్పణలు ఇవ్వవచ్చు. ప్రతి తూమెడు ధాన్యానికి మూడు పడుల (ఒక గాలను) నూనె చొప్పున సమర్పించాలి.
8“పాలకుడు వచ్చి తూర్పు ద్వారంలో గల మండపం ద్వారా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాలి. బయటకు కూడా వెళ్లిపోవాలి.
9“ప్రత్యేక పండుగల సందర్భంలో దేశ ప్రజలు యెహోవా దర్శనార్థం వచ్చినప్పుడు, వారు ఉత్తర ద్వారం గుండా ఆరాధనకు వచ్చి దక్షిణ ద్వారం గుండా నేరుగా బయటకు వెళ్లాలి. దక్షిణ ద్వారం గుండా ప్రవేశించిన వ్యక్తి ఉత్తర ద్వారం గుండా బయటకు వెళ్లాలి. ఏ వ్యక్తీ ప్రవేశించిన ద్వారం గుండా బయటకు వెళ్లరాదు. ప్రతి ఒక్కడూ తిన్నగా బయటకు సాగి పోవాలి. 10ప్రజలు లోపల ప్రవేశించినప్పుడు, వారితో పాటు పాలకుడు లోనికి వెళతాడు. వారితో పాటు పాలకుడు బయటకు వెళ్లాలి.
11“విందులప్పుడు, ప్రత్యేక సమావేశాల సమయాలలోను ప్రతి కోడెదూడతోను తొమ్మిది మానికెల (ఒక ఏఫా) ధాన్యార్పణ తప్పక చేయాలి. ప్రతి పొట్టేలుతోను, తొమ్మిది మానికెల ధాన్యార్పణ చేయాలి. ప్రతి గొర్రె పిల్లతోను అతడు తన శక్తి కొలదీ ధాన్యాన్ని అర్పించాలి. ప్రతి తొమ్మిది మానికెల ధాన్యంతో పాటు మూడు పడుల (ఒక గాలను) నూనెను సమర్పించాలి.
12“పాలకుడు తను స్వంతంగా దహనబలులు గాని, సమాధాన బలులుగాని తన ఇష్టపూర్వక అర్పణ (స్వేచ్చార్పణ) గాని యెహోవాకు ఇవ్వదలచినప్పుడు అతనికోసం తూర్పు ద్వారం తెరువబడుతుంది. అప్పుడు తను విశ్రాంతి రోజున అర్పించినట్లు తన దహనబలిని, సమాధానబలిని అర్పిస్తాడు. అతడు వెళ్లినాక తిరిగి ద్వారం మూయబడుతుంది.
అనుదిన అర్పణ
13“మరియు మీరు ఏ దోషమూలేని ఒక ఏడాది వయస్సుగల గొర్రె పిల్లను ఇవ్వాలి. అది యెహోవాకు ప్రతి రోజూ దహనబలిగా ఇవ్వబడుతుంది. దానిని అనుదినం ఉదయం సమర్పించాలి. 14ప్రతిరోజూ ఉదయం గొర్రె పిల్లతో పాటు ధాన్యార్పణ కూడ ఇవ్వాలి. ఇందు నిమిత్తం తూమెడు గోధుమ పిండిలో (ఏఫా) ఆరవ వంతు, ఆ సన్నపు పిండిని కలపటానికి ఒక పడి (గాలనులో మూడివ వంతు) నూనెను ఇవ్వాలి. ఇది యెహోవాకు అనుదిన ధాన్యార్పణ. ఇది శాశ్వతంగా పాటింపబడుతుంది. 15ఆ విధంగా వారు గొర్రె పిల్లను, ధాన్యార్పణను, నూనెను ప్రతి ఉదయం ఎప్పటికీ దహన బలిగా ఇవ్వాలి.”
పాలకుడు భూమిని స్వతంత్రించుకొను నియమాలు
16నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “రాజ్యాధిపతి తన కుమారులలో ఎవరికైనా తన భూమిలో కొంత భాగం కానుకగా ఇస్తే అది అతని కుమారులకు చెందుతుంది. అది వారి ఆస్తి. 17ఒకవేళ పాలకుడు తన భూమిలో కొంత భాగాన్ని ఒక బానిసకు బహుమానం ఇస్తే, అది వాడు స్వేచ్చపొందే సంవత్సరం#46:17 స్వేచ్చపొందే సంవత్సరం దీనినే స్వర్ణోత్సవం అని కూడా అంటారు. ప్రతి ఏభై సంవత్సరాలకు ఇశ్రాయేలీయులు, తమ బానిసలు ఇశ్రాయేలీయులయితే వాళ్లను విడుదల చేస్తారు. వాళ్లు అనుభవించిన భూమి రాజుకు తిరిగి వస్తుంది. వరకే వానికి చెందుతుంది. పిమ్మట ఆ బహుమానం రాజుకు తిరిగి వస్తుంది. కేవలం రాజు కుమారులు మాత్రమే అతను బహుమానం చేసిన భూమిని ఉంచుకుంటారు. 18మరియు పాలకుడు ప్రజల భూమిని తన వశం చేసుకోడు. వారు భూమిని వదిలిపొమ్మని ఒత్తడి కూడ చేయడు. అతడు తన స్వంత భూమిలో కొంత భాగాన్ని మాత్రమే తన కుమారులకు ఇవ్వాలి. ఆ విధంగా నా ప్రజలు తమ భూమిని పోగొట్టుకునేలాగ రాజుచేత బలవంత పెట్టబడరు.”
ప్రత్యేక వంటగదులు
19ఆ మనుష్యుడు నన్ను ద్వారం ప్రక్కనున్న మార్గం గుండా నడిపించాడు. ఉత్తర దిశన ఉన్న యాజకుల పవిత్ర గదుల వద్దకు నన్ను నడిపించాడు. అక్కడ బాగా పడమటికి ఉన్న ఒక స్థలాన్ని చూశాను. 20ఆ మనుష్యుడు నాతో ఇలా అన్నాడు: “ఇక్కడే యాజకులు దోష బలి సమర్పణను, పాపపరిహారార్థ బలి సమర్పణను పెడతారు. ఇక్కడే యాజకులు ధాన్యార్పణలను (రొట్టె) కాల్చుతారు. ఈ విధంగా చేయటం వలన వారీ అర్పణ పదార్థాలను బయటి ఆవరణలోనికి తెచ్చే అవసరముండదు. కావున వారీ పవిత్ర పదార్థాలను సామాన్య ప్రజలు ఉండే చోటుకి తీసుకొనిరారు.”
21తరువాత ఆ మనుష్యుడు నన్ను బయటి ఆవరణలోనికి తీసుకొని వచ్చాడు. అతడు నన్ను ఆవరణ నాలుగు మూలలకు నడిపించాడు. ఆవరణలో ప్రతి మూలా మరో చిన్న ఆవరణ ఉంది. 22ఆవరణ యొక్క నాలుగు మూలలలోనూ చిన్న ఆవరణలు ఉన్నాయి. ప్రతి చిన్న ఆవరణ నలభై మూరలు పొడుగు ముప్పై మూరలు వెడల్పు కలిగి వుండెను. నాలుగు మూలలూ ఒకే కొలతలో ఉన్నాయి. 23లోపల నాలుగు చిన్న ఆవరణాల్లోనూ ప్రతి ఒక్కదాని చుట్టూ ఒక ఇటుక గోడ ఉంది. నాలుగు చిన్న ఆవరణల్లోను గోడలకు అటకలు నిర్మింపబడ్డాయి. ఇటుక గోడల్లో వంటకు పొయ్యిలు కట్టబడ్డాయి. 24“ఆలయంలో సేవ చేసే వారు ఈ పాకశాలల్లోనే ప్రజల కొరకు బలి మాంసాన్ని ఉడక బెడతారు” అని ఆ మనుష్యుడు నాకు చెప్పాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహెజ్కేలు 46: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెహెజ్కేలు 46 కోసం వీడియో