యెహెజ్కేలు 3
3
1దేవుడు నాతో ఇలా చెప్పాడు: “ఓ నరపుత్రుడా, నీవు చూస్తున్న దానిని తిను. ఈ గ్రంథపు చుట్టను తిని, ఇశ్రాయేలు వంశం వారికి దీనిలోనున్న విషయాలన్నిటినీ తెలియజెప్పు.”
2ఆ తరువాత నేను నా నోరు తెరువగా, అతడు గ్రంథపు చుట్టను నాకు తినిపించెను. 3పిమ్మట దేవుడు ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ కాగితం చుట్టను నీకిస్తున్నాను. దానిని మ్రింగివేయి! ఆ గ్రంథపు చుట్ట నీ శరీరాన్ని నింపివేయనీ.”
నేను దానిని తినేశాను. అది తేనెలా మధురంగా ఉంది.
4అప్పుడు దేవుడు నాతో ఇలా అన్నాడు, “నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశంవారి వద్దకు వెళ్లు. వారికి నా మాటలన్నీ తెలియజేయుము. 5భాష తెలియని పరదేశీయుల వద్దకు నిన్ను నేను పంపటంలేదు. ఏ ఇతర భాషను నీవు నేర్చుకునే పనిలేదు. నేను నిన్ను ఇశ్రాయేలు వంశం వారివద్దకు పంపుతున్నాను! 6నీవు అర్థం చేసుకోలేని పలుభాషలు మాట్లాడే అనేక ఇతర దేశాల ప్రజల వద్దకు నేను నిన్ను పంపటం లేదు. నీవు గనుక వారి వద్దకు వెళ్లి మాట్లాడితే వారు వింటారు. కాని నీవాకఠిన భాషలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 7లేదు! నేను నిన్ను ఇశ్రాయేలు వంశం వద్దకు పంపుతున్నారు. వారున్నారే వారు తల బిరుసు కలిగి ఉన్నారు. వారు చాలా మొండివారు! ఇశ్రాయేలీయులు నీవు చెప్పేది వినటానికి నిరాకరిస్తారు. వారు నా మాట వినదల్చుకోలేదు! 8కాని వారు ఎంత మొండివారో, నిన్ను కూడా అంత మొండివానిగా నేను చేస్తాను. నీ తల కూడా వారి తలలా కఠినంగా ఉంటుంది! 9చెకుముకిరాయి కంటె వజ్రం కఠినమైనది. అదే రకంగా, నీ తల వారి తలకంటె గట్టిగా తయారవుతుంది. నీవు మిక్కిలి మొండిగా ఉంటావు. అందువల్ల వారంటే నీవు భయపడవు. ఎల్లప్పుడూ నా మీద తిరుగుబాటు చేసే ఆ ప్రజలంటే నీవు భయపడవు.”
10ఇంకా దేవుడు ఇలా చెప్పాడు, “నరపుత్రుడా, నేను నీకు చెప్పే ప్రతీ మాటను వినాలి. విని, వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. 11పిమ్మట దేశాన్నుండి వెళ్ల గొట్ట బడిన నీ ప్రజలందరి వద్దకు వెళ్లు. వారి వద్దకు వెళ్లి, ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు’ అని పలుకు. వారు వినరు. వారు పాపం చేయటం మానరు. అయినా నీవు ఈ విషయాలు చెప్పాలి.”
12పిమ్మట గాలి (ఆత్మ) నన్ను పైకి లేపింది. అప్పుడు వెనుక నుండి నేనొక స్వరం విన్నాను. అది ఉరుములా చాలా బిగ్గరగా ఉంది. ఆ స్వరం, “యెహోవా మహిమ ధన్యమైనది!” అని పలికింది. 13ఆ తరువాత జంతువుల రెక్కలు కదలసాగాయి. రెక్కలు ఒక దానితో ఒకటి తాకగా అవి చాలా గట్టిగా శబ్దం చేశాయి. వాటి ముందునున్న చక్రాలు కూడ పెద్ద శబ్దం చేశాయి. ఆ శబ్దం ఉరుము ఉరిమినట్లుగా ఉంది. 14గాలి (ఆత్మ) నన్ను పైకెత్తి దూరంగా తీసుకొని వెళ్లింది. నేను ఆ స్థలాన్ని వదిలిపెట్టాను. నేను నా ఆత్మలో దుఃఖించి తల క్రిందులయ్యాను! యెహోవా ప్రభావం నాలో శక్తివంతంగా పనిచేస్తూ ఉంది! 15టెల్ అవీవ్‌కు#3:15 టెల్ అవీవ్ తేలాబీబు అని పాఠాంతరం. ఇది ఇశ్రాయేలుకు బయటనున్న ఒక ప్రదేశం. దీని అసలైన ఉనికి ఎవ్వరికి సరిగ్గా తెలియదు. దీనికే “ఊటకొండ” అని కూడ పేరు ఉంది. బబులోను దేశంలో కేబారు కాలువ ప్రక్కనున్న ఒక స్థలం. బలవంతంగా తీసుకొనిపోబడి, అక్కడ ప్రవాసంలోవున్న ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్లాను. ఆ ప్రజలు కెబారు కాలువ వద్ద నివసించారు. ఆ ప్రజలను నేను పరామర్శించాను. అక్కడ నేను వాళ్ల మధ్యలో ఏడు రోజులు భయంతోనూ, మౌనంతోనూ కూర్చుంటిని.
ఇశ్రాయేలు కావలివాడు
16ఏడు రోజుల తరువాత యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: 17“ఓ నరపుత్రుడా, ఇశ్రాయేలుకు నిన్ను కావలివానిగా చేస్తున్నాను. వారికి జరుగబోయే కీడును గూర్చి నేను నీకు తెలియజేస్తాను. కనుక ఆ పరిణామాలను గూర్చి నీవు వారికి హెచ్చరిక చేయాలి. 18‘ఈ దుష్ట వ్యక్తి చనిపోతాడు.’ అని నేను చెప్పితే, నీవతనిని హెచ్చరించాలి.! అతని జీవన విధానం మార్చుకొని, పాపం చేయటం మానమని చెప్పాలి. నీవతనిని హెచ్చరించకపోతే, ఆ వ్యక్తి చనిపోతాడు. అతడు పాపం చేశాడు గనుక అతడు చనిపోతాడు. కాని అతని చావుకు నిన్ను కూడా బాధ్యుణ్ణి చేస్తాను! ఎందుకంటే, నీవతని వద్దకు వెళ్లి అతనిని హెచ్చరిస్తే అతని ప్రాణం రక్షింపబడేది.
19“ఒకవేళ నీవా వ్యక్తి వద్దకు వెళ్లి అతని జీవిత విధానాన్ని మార్చుకోమనీ, చెడు కార్యాలు చేయటం మానమనీ చెప్పావనుకో. ఆ వ్యక్తి నీమాట వినక పోవచ్చు. అప్పుడతడు చనిపోతాడు. అతడు పాపి గనుక చనిపోతాడు. అయినా నీవతనిని హెచ్చరించావు. అందువల్ల నిన్ను నీవు రక్షించుకున్నవాడివవుతావు.
20“లేదా, ఒక మంచి వ్యక్తి మధ్యలో మంచి పనులు చేయడం మానివేసి చెడుపనులు చేస్తాడు. అప్పుడు నేను అతని ముందు ఏదైనా తగిలి పడటానికి (పాపంలో పడటానికి) ఉంచవచ్చు. అతడు చెడుకార్యాలు చేయటం మొదలు పెడతాడు. దానితో అతడు చనిపోతాడు. తన పాపాల కారణంగా అతడు చనిపోతాడు. దానికి తోడు నీవతనిని హెచ్చరించలేదు. అందువల్ల అతని చావుకు నిన్ను బాధ్యుణ్ణి చేస్తాను. చివరికి అతడు చేసిన మంచి పనులేవీ ప్రజలు గుర్తు పెట్టుకోరు.
21“నీవొక మంచి మనిషిని పాపం చేయవద్దని హెచ్చరిస్తావనుకో; అతడు పాపం చేయటం మానితే అతడు రక్షించబడతాడు. ఎందువల్లనంటే నీవతనికి హెచ్చరిక చేయటం, అతడు నీ మాటను వినటం జరిగాయి గనుక. ఈ విధంగా నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.”
22పిమ్మట యెహోవా హస్తం ఆ స్థలంలో నా మీదికి వచ్చింది. “లెమ్ము; లోయలోకి వెళ్లు. అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని దేవుడు నాకు చెప్పాడు.
23నేను లేచి లోయలోకి వెళ్లాను. యెహోవా మహిమ అక్కడ ఉంది. గతంలో నేను కెబారు కాలువవద్ద చూసినట్లే అది ఉంది. నేను శిరస్సు నేలకు ఆన్చి సాష్టాంగ నమస్కారం చేశాను. 24కాని, ఇంతలో ఒక గాలి (ఆత్మ) వచ్చి నన్ను నా పాదాలపైకి లేపింది. ఆయన నాతో ఇలా అన్నాడు, “నీవు ఇంటికి వెళ్లి లోపల కూర్చుని గడియపెట్టుకో. 25ఓ నరపుత్రుడా, ప్రజలు నీ వద్దకు వచ్చి, నిన్ను తాళ్లతో బంధిస్తారు. వారు నిన్ను ప్రజల మధ్యకు వెళ్లనీయరు. 26నేను నీ నాలుకను నీ అంగిలి గుంటలో అతుక్కుపోయేలా చేస్తాను. దానితో నీవు మాట్లాడలేవు. అందువల్ల వారు తప్పు చేస్తున్నట్లు వారికి చెప్పే మనుష్యుడెవ్వడూ ఉండడు. ఎందువల్లనంటే ఆ జనులు నా మీద ఎల్లప్పుడూ తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. 27కాని నేను నీతో మాట్లాడతాను. పిమ్మట నీవు మళ్లీ మాట్లాడటానికి అనుమతిస్తాను. అయితే నీవు మాత్రం ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు’ అని వారికి చెప్పాలి. ఏ వ్యక్తి అయినా వినగోరితే మంచిదే. ఎవ్వరూ వినటానికి ఇష్టపడకపోయినా మంచిదే. ఆ ప్రజలు ఎల్లప్పుడూ నాకు వ్యతిరేకులవుతూ ఉన్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 3: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International