చివరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది. సాతాను పన్నే పన్నాగాలను ఎదిరించటానికి దేవుడిచ్చిన ఆయుధాలన్నిటిని ధరించండి. మనం పోట్లాడుతున్నది మానవులతో కాదు. చీకటిని పాలించే వాళ్ళతో, దానిపై అధికారమున్న వాళ్ళతో, చీకటిలోని శక్తులతో ఆకాశంలో కనిపించని దుష్టశక్తులతో మనం పోరాడుతున్నాము. కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించండి. అప్పుడు ఆ దుర్దినమొచ్చినప్పుడు మీరు శత్రువును ఎదిరించ గలుగుతారు. చివరిదాకా పోరాడాక కూడా మీ యుద్ధరంగంలో మీరు నిలబడగలుగుతారు. కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని, నీతి అనే కవచాన్ని ధరించండి. శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి. వీటితో పాటు విశ్వాసమనే డాలును ధరించి సాతాను ప్రయోగించే అగ్నిబాణాల్ని ఆర్పటానికి సిద్ధంకండి. రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మ యిచ్చిన వాక్యమనే దేవుని ఖడ్గాన్ని ధరించండి. ప్రార్థనలు, విన్నపాలు, పరిశుద్ధాత్మ ద్వారా చెయ్యండి. అన్ని వేళలా ప్రార్థించండి. మెలకువతో ఉండండి. దేవుని ప్రజలకోసం ప్రార్థించటం మానవద్దు. వాళ్ళ కోసం అన్ని వేళలా ప్రార్థించండి. నేను నా నోరు కదల్చినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నాకోసం కూడ ప్రార్థించండి. అప్పుడు నేను దైవసందేశంలో ఉన్న రహస్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతాను. సంకెళ్ళలోవున్న నేను ఈ సందేశం బోధించటానికి రాయబారిగా వచ్చాను. నేను ధైర్యంగా ప్రకటించాలి కనుక ఆ ధైర్యం నాలో కలిగేటట్లు నాకోసం ప్రార్థించండి. ప్రభువును విశ్వసిస్తున్న సేవకుడు, మన ప్రియ సోదరుడు అయిన “తుకికు” మీకు అన్నీ చెబుతాడు. అతని ద్వారా మీకు నేను ఎలా ఉన్నానో, ఏమి చేస్తున్నానో తెలుస్తుంది. మేము ఏ విధంగా ఉన్నామో మీరు తెలుసుకోవాలని మరియు అతడు మీకు ప్రోత్సాహం కలిగించాలని అతణ్ణి నేను మీ దగ్గరకు పంపుతున్నాను. సోదరులందరికీ తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి విశ్వాసంతో పాటు శాంతి, ప్రేమ లభించుగాక!
చదువండి ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6
వినండి ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:10-23
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు