ద్వితీయోపదేశకాండము 3

3
బాషాను ప్రజలతో యుద్ధం
1“మనం మళ్లుకొని బాషాను మార్గంలో వెళ్లాము. బాషాను రాజు ఓగు, అతని ప్రజలందరు ఎద్రేయి దగ్గర మనతో యుద్ధం చేయటానికి వచ్చారు. 2‘ఓగును నేను మీకు అప్పగించాలని నిర్ణయించాను గనుక అతని గూర్బి భయపడవద్దు. అతని మనుష్యులందరిని, అతని దేశాన్ని నేను మీకు యిస్తాను. హెష్బోనులో ఏలుబడి చేసిన అమోరీ రాజు సీహోనుకు చేసినట్టే, అతన్ని కూడ మీరు ఓడిస్తారు’ అని యెహోవా నాతో చెప్పాడు.
3“కనుక బాషానురాజు ఓగును, అతని మనుష్యులందరిని మన యెహోవా దేవుడు మనకు అప్పగించాడు. అతని మనుష్యులు ఎవరూ మిగుల కుండా మనం అతన్ని ఓడించాము. 4తర్వాత అప్పట్లో ఓగుకు చెందిన పట్టణాలన్నింటినీ మనం స్వాధీనం చేసుకొన్నాము. ఓగు ప్రజల పట్టణాలు అన్నింటినీ, బాషానులో ఓగు రాజ్యమైన అర్గోబు ప్రాంతం అంతటిలో 60 పట్టణాలను మనం స్వాధీనం చేసుకొన్నాము. 5ఎత్తయిన గోడలు, బలమైన కడ్డీలుగల గేట్లతో ఈ పట్టణాలు చాలా బలమైనవి. మరియు గోడలులేని పట్టణాలు కూడా చాలా ఉన్నాయి. 6హెష్బోను రాజైన సీహోను పట్ణణాలకు మనం చేసినట్టే వీటినికూడా మనం నాశనం చేసాము. ప్రతి పట్టణాన్ని, వాటిలోని ప్రజలందరిని స్త్రీలు, పిల్లలను సహా మనం సమూలంగా నాశనం చేసాము. 7అయితే ఆ పట్టణాల్లోని పశువులన్నింటినీ, విలువైన వస్తువులను మనకోసం ఉంచుకొన్నాము.
8“ఈ విధంగా, అమోరీ ప్రజల ఇద్దరు రాజుల వద్దనుండి దేశాన్ని మన స్వాధీనం చేసుకొన్నాం. ఈ దేశాలు యొర్దాను నదికి తూర్పు వైపున ఉన్నాయి. అర్నోను లోయనుండి హెర్మోను పర్వతంవరకు ఉంది ఈ దేశం. 9(హెర్మోను కొండను సీదోనీ ప్రజలు షిర్యోను అనీ, అమోరీలు శేనీరు అని పిలుస్తారు) 10బాషాను అంతటిని సాలెకానుండి, ఎద్రేయివరకు, గిలాదు పీఠభూమిలోని పట్టణాలన్నింటినీ మనం మన స్వాధీనం చేసుకొన్నాం. సల్కా ఎద్రేయి బాషానులోని ఓగు రాజ్యంలో పట్టణాలు.”
11(ఇంకా జీవించి ఉన్న కొద్దిమంది రెఫాయిము ప్రజల్లో బాషాను రాజు ఓగు ఒక్కడే. ఓగు మంచం ఇనుప మంచం. దాని పొడవు 13 అడుగులు, వెడల్పు 6 అడుగలు. అమ్మోనీ ప్రజలు నివసించే రబ్బా పట్టణంలో ఆ మంచం యింకా ఉంది.)
యొర్దాను నదికి తూర్పున ఉన్న దేశం
12“ఆ సమయంలో ఈ దేశాన్ని మన స్వంతం చేసుకొన్నాము. అర్నోను లోయ ప్రక్కగా అరోయేరు దేశాన్ని, గిలాదు కొండ దేశంలో సగం, వాటి పట్టణాలతోసహా రూబేను వంశంవారికి, గాదు వంశంవారికి నేను ఇచ్చాను. 13గిలాదులో మిగతా సగం, బాషాను అంతా మనష్షే వంశంవారిలో సగం మందికి నేను ఇచ్చాను.”
(బాషాను ఓగు రాజ్యం. బాషానులో కొంత భాగం అర్గోబు అని పిలువబడింది. బాషాను ప్రాంతం రెఫాయిము దేశం అనికూడ పిలువబడింది). 14గెషూరు, మయకాతీతు ప్రజల సరిహద్దువరకు గల మొత్తం అర్గోబు ప్రదేశం అంతా మనష్షే వంశీయుడైన యాయీరు పట్టుకొన్నాడు. ఈ ప్రాంతానికి యాయీరు తన స్వంత పేరు పెట్టుకొన్నాడు. హవ్వీత్‌యాయీరు అని పేరు పెట్టాడు. (నేటికీ ఆ ప్రాంతం బాషాను యాయీరు పట్టణాలు అని పిలువ బడుతుంది).
15“గిలాదును నేను మాకీరుకు ఇచ్చాను. 16మరియు రూబేను వంశానికి, గాదు వంశానికి గిలాదు వద్ద ప్రారంభం అవుతున్న దేశాన్ని నేను ఇచ్చాను. ఈ దేశం అర్నోను లోయనుండి యబ్బోకు నదివరకు ఉంది. (లోయ మధ్య భాగం ఒక సరిహద్దు. యబ్బోకు నది అమ్మోనీ ప్రజలకు సరిహద్దు) 17పడమటి దిక్కున అరాబాలోని యొర్దాను నది వారి ప్రాంతానికి సరిహద్దు. ఈ ప్రాంతానికి ఉత్తరాన కిన్నెరెతు సరస్సు, దక్షిణాన అరాబా సముద్రం (ఉప్పు సముద్రం) ఉన్నాయి. తూర్పున అది పిస్గా కొండచరియల క్రింద ఉంది.
18“ఆ సమయంలో ఆ వంశాలకు నేను ఈ ఆజ్ఞయిచ్చాను: ‘మీరు నివసించడానికి యొర్దాను నదికి యివతలి ప్రక్క దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు యిచ్చాడు. అయితే యిప్పుడు మీ యుద్ధ వీరులు వారి ఆయుధాలు చేతపట్టి మిగతా ఇశ్రాయేలు వంశాలను నది దాటించాలి. 19మీ భార్యలు, మీ చిన్నపిల్లలు, మీ పశువులు (మీకు పశువులు చాలా ఉన్నాయని నాకు తెలుసు) నేను మీకు యిచ్చిన ఈ పట్టణాల్లో యిక్కడ ఉండాలి. 20అయితే మీ బంధువులైన ఇశ్రాయేలీయులకు యొర్దాను నదికి అవతల ప్రక్క యెహోవా యిస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకొనేంతవరకు మీరు వారికి సహాయం చేయాలి. ఇక్కడ మీకు శాంతి ఉన్నట్టుగానే అక్కడ వారికి యెహోవా శాంతి నిచ్చేంతవరకు వారికి సహాయం చేయండి. అప్పుడు నేను మీకు ఇచ్చిన ఈ దేశానికి మీరు తిరిగి రావచ్చును.’
21“అప్పుడు యెహోషువతో నేను యిలా చెప్పాను: ‘మీ దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులకూ చేసిన వాటన్నింటినీ నీవు చూశావు. నీవు ప్రవేశించే రాజ్యాలన్నింటికీ యెహోవా అలాగే చేస్తాడు. 22మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా పోరాడుతాడు గనుక ఈ దేశాల రాజులకు నీవు భయపడవద్దు.’
మోషే కనానులో ప్రవేశించలేకపోవటం
23“ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమలాడి, యిలా చెప్పాను, 24‘యెహోవా, నా ప్రభువా నేను నీ సేవకుడిని. నీవు చేసే ఆశ్చర్యకరమైన, శక్తివంతమైన విషయాలలో కొద్ది భాగం మాత్రమే నీవు నాకు చూపించావు అని నాకు తెలుసు. నీవు చేసిన శక్తివంతమైన మహత్కార్యాలను చేయగల దేవుడు ఆకాశంలో గాని భూమి మీదగాని లేడు. 25యొర్దాను నదికి అవతల ప్రక్క ఉన్న ఆ మంచి దేశాన్ని, సౌందర్యవంతమైన ఆ కొండ దేశాన్ని, లెబానోనును చూడటానికి నన్ను అవతలకు దాటి వెళ్లనియ్యి అని నేను నీకు మనవి చేస్తున్నాను.’
26“కానీ మీ మూలంగా యెహోవా నామీద కోపగించాడు. ఆయన నా మాట వినడానికి తిరస్కరించాడు. యెహోవా నాతో చెప్పాడు, ‘నీకు ఇది చాలు. ఈ విషయం నాతో యింకా చెప్పవద్దు. 27పిస్గా కొండ శిఖరం మీదికి వెళ్లు. పడమర, ఉత్తరం, తూర్పు, దక్షిణం చూడు. నీవు నీ కళ్లతో చూడవచ్చు గాని నీవు మాత్రం ఎన్నటికీ యొర్దాను నది దాటి వెళ్లజాలవు. 28నీవు తప్పక యెహోషువకు హెచ్చరికలు యివ్వాలి. అతణ్ణి ప్రోత్సహించి, బలపర్చు. ఎందుకంటే ప్రజలను యెహోషువ యొర్దాను నది దాటిస్తాడు. దేశాన్ని స్వాధీనం చేసుకొని దానిలో నివసించేందుకు యెహోషువ వారిని నడిపిస్తాడు. ఈ దేశాన్నే నీవు చూస్తావు.’
29“అందుచేత మేము బేత్పెయోరు అవతలివైపు లోయలో నిలిచిపోయాము.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయోపదేశకాండము 3: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి