ద్వితీయోపదేశకాండము 13
13
ఇతర దేవుళ్లను సేవించవద్దు
1“ఒక ప్రవక్త లేక కలల భావం చెప్పే ఒక వ్యక్తి మీ దగ్గరకు రావచ్చు. మీకు ఏదో ఒక సూచన లేక అద్భుతం చూపిస్తానని ఆతడు మీతో చెప్పవచ్చు. 2మరియు ఆతడు మీకు చెప్పిన సూచన లేక అద్భుతం నెరవేరవచ్చు. అప్పుడు ఆతడు ఇతర దేవుళ్లను (మీరు ఎరుగని దేవుళ్లను) పూజించమని మీతో చెప్పవచ్చును. ‘మనం ఆ దేవుళ్లనే సేవిద్దాము’ అని అతడు మీతో అనవచ్చును. 3ఆ మనిషి మాట వినవద్దు. ఎందుకంటె మీరు మీ దేవుణ్ణి మీ నిండు హృదయంతోను, మీ నిండు ఆత్మతోను ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకొనేందుకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. 4మీరు మీ దేవుడైన యెహోవాను వెంబడించాలి. మీరు తప్పక ఆయనను గౌరవించాలి. యెహోవా ఆజ్ఞలకు విధేయులై, ఆయన మీతో చెప్పినట్టు చేయండి. యెహోవాను సేవించండి, ఎన్నటికీ ఆయనను విడువకండి. 5అంతేకాదు కలలను గూర్చి చెప్పే ఆ ప్రవక్తను చంపివేయాలి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు లోబడటం మానివేయండి అని మీతో చెబుతున్నాడు గనుక. మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చినవాడు యెహోవా. అక్కడి బానిస జీవితంనుండి ఆయనే మిమ్మల్ని రక్షించాడు. మీరు జీవించాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన జీవితం నుండి మిమ్మల్ని తప్పించి వేయాలని ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. అందుచేత మీ ప్రజలనుండి చెడుగును తీసివేసేందుకు మీరు ఆ వ్యక్తిని చంపివేయాలి.
6“మీతో సన్నిహితంగా ఉండేవారు ఎవరైనా, మీరు ఇతర దేవుళ్లను పూజించేందుకు రహస్యంగా మిమ్మల్ని ఒప్పించవచ్చు. నీ స్వంత సోదరుడు. నీ కుమారడు, నీ కుమార్తె, నీవు ప్రేమించే నీ భార్య, లేక నీ అతి సన్నిహిత మిత్రుడు కావచ్చు. ‘మనం పోయి యితర దేవుళ్లను పూజిద్దాము’ అని ఆ వ్యక్తి చెప్పవచ్చు. (ఈ దేవుళ్లను మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎన్నడూ ఎరుగరు. 7ఆ దేవుళ్లు మీకు దగ్గర్లో, దూరంలో, మీ చుట్టు పక్కల రాజ్యాల్లో ఉండే ప్రజల దేవుళ్లు.) 8మీరు ఆ వ్యక్తితో సమ్మతించకూడదు. ఆతని మాట వినవద్దు. ఆతని మీద జాలిపడవద్దు, అతణ్ణి స్వేచ్ఛగా వెళ్ళిపోనివ్వవద్దు. ఆతణ్ణి కాపాడవద్దు. 9-10కాని, మీరు అతణ్ణి చంపాల్సిందే. మీరు అతణ్ణి రాళ్లతో కొట్టి చంపెయ్యాలి. నీవే మొట్టమొదట రాళ్లు తీసుకొని అతని మీద విసరాలి. తర్వాత ప్రజలందరూ రాళ్లు విసిరి అతణ్ణి చంపాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని మీ దేవుడైన యెహోవాకు దూరం చేయాలని ప్రయత్నించాడు. మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు రప్పించిన వాడు యెహోవాయే. 11అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరు విని భయపడతారు. అంతేకాదు, వారు యిలాంటి చెడ్డపనులు ఇంకేమీ మీ మధ్య జరిగించరు.
12“మీ దేవుడైన యెహోవా మీరు నివసించేందుకు పట్టణాలు మీకు ఇచ్చాడు. కొన్నిసార్లు ఈ పట్టణాల్లో ఒకదాన్ని గూర్చి మీరు ఏదైనా చెడువార్త వినవచ్చును. మీరు 13మీ స్వంత దేశంలోనే దుర్మార్గులు కొందరు వారి పట్టణస్థులను చెడ్డపనులు చేసేందుకు ప్రేరేపిస్తున్నారని వినవచ్చును. ‘మనం వెళ్లి యితర దేవుళ్లను సేవిద్దాము, అని వారు వారి పట్టణస్థులతో అనవచ్చును.’ (ఈ దేవుళ్లు యింతకు ముందు మీరు ఎన్నడూ ఎరుగని దేవుళ్లు.) 14మీరు ఇలాంటి వార్త వింటే, అది సత్యమా అని తెలుసుకొనేందుకు మీరు చేయగలిగింది అంతా చేయాలి. అది వాస్తవమేనని మీకు తెలిస్తే-అలాంటి దారుణ విషయం నిజంగానే జరిగిందని మీకు ఋజువైతే 15అప్పుడు మీరు ఆ పట్టణస్థులను శిక్షించాలి. వాళ్లందరినీ చంపివేయాలి. మరియు వారి పశువులన్నింటినీ చంపివేయండి. మీరు ఆ పట్టణాన్ని పూర్తిగా నాశనం చేయాలి. 16అప్పుడు మీరు విలువైన వస్తువులన్నింటినీ పోగు చేసి పట్టణం మధ్యకు వాటిని తీసుకొని వెళ్లాలి. ఆ పట్టణాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని మీ దేవుడైన యెహోవాకు దహనబలిగా మీరు కాల్చివేయాలి. ఆ పట్టణం శాశ్వతంగా పాడు దిబ్బగా అవుతుంది. అది ఎన్నటికీ తిరిగి కట్టబడకూడదు. 17ఆ పట్టణంలో ఉన్న సమస్తం నాశనం చేయబడేందుకు అది యెహోవాకు అప్పగించబడాలి. కనుక ఆ వస్తువుల్లో ఏదీ మీకోసం మీరు ఉంచుకోకూడదు. మీరు ఈ ఆజ్ఞను పాటిస్తే, అప్పుడు యెహోవా మీ మీద కోపం చాలిస్తాడు. యెహోవా మీకు దయను ప్రసాదిస్తాడు. ఆయనకు మీమీద జాలి ఉంటుంది. ఆయన మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ప్రకారం మీ రాజ్యాన్ని విస్తారంగా పెరుగనిస్తాడు. 18మీరు మీ దేవుడైన యెహోవా మాట ఆలకించి, నేడు నేను మీకు యిస్తున్న ఆజ్ఞలకు విధేయులైతే యిలా జరుగుతుంది. మీ దేవుడైన యెహోవా సరైనవి అని చెప్పేవాటిని మీరు చేయాలి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ద్వితీయోపదేశకాండము 13: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International