2 రాజులు 6

6
ఎలీషా మరియు గొడ్డలి
1ప్రవక్తల బృందం ఎలీషాతో ఇలా చెప్పింది: “మేమా ప్రదేశంలో నివసిస్తున్నాము. కాని మాకది చాలా చిన్నదిగా వుంది. 2యోర్దాను నదివద్దకు వెళ్లి, అడవిలో చెట్లు నరుకుదాము. మనలో ప్రతి ఒక్కరికి ఒక దూలము లభిస్తుంది. అక్కడ నివాసయ్యోగ్యమైన ఇల్లు నిర్మించుకుందాము.”
“బాగుంది, అలాగే కానివ్వండి” అని ఎలీషా బదులు చెప్పాడు.
3“మాతో మీరు రండి” అని ఒకడనెను. ఎలీషా “బాగుంది, నేను కూడా మీతో వస్తాను” అని చెప్పాడు.
4అందువల్ల ఎలీషా ప్రవక్తల బృందంతో పాటు వెళ్లాడు. వారు యోర్దాను నది వద్దకు చేరుకుని కొన్ని చెట్లు నరకసాగారు. 5కాని ఒక వ్యక్తి ఒక చెట్టు నరికేటప్పుడు, చేతినుండి గొడ్డలి జారిపోయి నీళ్లలో పడింది. అప్పుడతను, “యజమానీ, నేను ఆ గొడ్డలి చేబదులుగా తెచ్చాను” అని అరిచాడు.
6దైవజనుడైన ఎలీషా, “అది ఎక్కడ పడింది” అని అడిగాడు.
గొడ్డలి పడిన చోటును అతను ఎలీషాకు చూపాడు. అప్పుడు ఎలీషా ఒక కొమ్మ నరికి, కర్రను నదిలోకి విసిరివేశాడు. ఆ కొమ్మ ఇనుప గొడ్డలి నీళ్లలో తేలునట్లు చేసింది. 7“గొడ్డలి పైకి తీసుకో” అని ఎలీషా చెప్పాడు. అప్పుడా వ్యక్తి గొడ్డలిని తీసుకున్నాడు.
సిరియా ఇశ్రాయేలును పట్టుకొనుటకు ప్రయత్నించుట
8సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని తన సైనికోద్యోగులతో ఆయన సమాలోచన చేస్తున్నాడు. “ఈ చోట దాక్కుని ఇశ్రాయేలు వారు వచ్చినప్పుడు వారిని ఎదుర్కోనండి” అని అతను చెప్పాడు.
9కాని దైవజనుడు అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకి ఒక సందేశం పంపాడు. ఎలీషా ఇట్లన్నాడు: “జాగ్రత్తగా వుండండి. ఆ స్థలంగుండా పోవద్దు! సిరియా సైనికులు అక్కడ దాగుకొని వున్నారు”
10ఇశ్రాయేలు రాజు తన మనుష్యులకు సందేశం పంపుతూ దైవజనుడు (ఎలీషా) తనకు హెచ్చరిక చేశాడని తెలియపరిచాడు. ఇశ్రాయేలు రాజు పలువురిని కాపాడగలిగాడు.
11ఇందువల్ల సిరియా రాజు తలక్రిందులయ్యాడు. తన సైనికోద్యోగుల్ని సమావేశ పరచి వారితో, “ఇశ్రాయేలు రాజుకోసం గూఢచారి పని చేస్తున్నదెవరో చెప్పండి” అని అడిగాడు.
12సిరియా రాజు అధికారులలో ఒకడు, “ప్రభూ, రాజా, మాలో ఎవ్వరమూ గూఢాచారులము కాము. ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకు అనేక రహస్య విషయాలు చెప్పగలడు. మీరు నిద్రించే గృహంలో మీరు మాట్లాడే మాటలు కూడా చెప్పగలడు” అన్నాడు.
13అప్పుడు సిరియా రాజు, “ఎలీషాని కనుగొనండి. అతనిని పట్టుకునేందుకు నేను మనుష్యులను పంపుతాను” అన్నాడు.
“ఎలీషా దోతానులో ఉన్నాడు” అని రాజ సేవకులు చెప్పారు.
14అప్పుడు సిరియా రాజు గుర్రాలు, రథాలు, ఒక పెద్ద సైన్యం దోతానుకు పంపాడు. వారు రాత్రి వేళ చేరి నగరాన్ని చుట్టుముట్టారు. 15ఆ ఉదయం ఎలీషా సేవకుడు తర్వగా మేల్కోన్నాడు. అతను వెలుపలికి పోయి నగరం చుట్టూ ఒక పెద్ద సైన్యం రథాలు, గుర్రాలు ఉండటం చూశాడు.
ఎలీషా సేవకుడు, “నా యజమానీ! మనమేమి చేయగలము” అని ఎలీషాని చూసి అడిగాడు.
16“భయపడకు, సిరియా కోసం యుద్ధం చేసే సైన్యం కంటె మనకోసం చేసే సైన్యం చాలా పెద్దది” అని ఎలీషా చెప్పాడు.
17అప్పుడు ఎలీషా ప్రార్థించి ఇలా చెప్పాడు: “యెహోవా, నా సేవకుని కళ్లు తెరిపింపుము. అప్పుడతను చూడగలడు.”
యెహోవా ఆ యువకుని కళ్లు తెరిపించాడు. మరియు సేవకుడు కొండ చుట్టూ అగ్నిరథాలు గుర్రాలు వుండటం చుశాడు. అవి ఎలీషా చుట్టూ ఉన్నాయి.
18ఈ అగ్నిరథాలు గుర్రాలు ఎలీషాకోసం క్రిందికి దిగి వచ్చాయి. ఎలీషా యెహోవాను ప్రార్థించాడు. “ఈ మనష్యులను అంధులను చేయవలసిందిగా నిన్ను ప్రార్థించుచున్నాను” అన్నాడు.
ఎలీషా ప్రార్థించిన ప్రాకారం యెహోవా చేశాడు. సిరియా సైనికులు అంధులగునట్లు యెహోవా చేశాడు. 19సిరియా సైనికులను వుద్దేశించి ఎలీషా, “ఇది సరి అయిన మార్గం కాదు. ఇది సరి అయిన నగరం కాదు. నన్ను అనుసరించండి. మీరు ఎవరికోసం వెతుకుతున్నారో నేను అతని వద్దకు మిమ్మలను తీసుకుని వెళతాను” అన్నాడు. తర్వాత ఎలీషా సిరియా సైన్యాన్ని షోమ్రోనుకు నడిపించాడు.
20వారు షోమ్రోనుకు చేరుకోగానే, “యెహోవా, వీరి కళ్లు తెరిపించుము. అప్పుడు వారు చూడగలుగుతారు” అని ఎలీషా ప్రార్థించాడు.
అప్పుడు యెహోవా వారి కళ్లు తెరిపించాడు. 21తామప్పుడు షోమ్రోను నగరంలో వునన్నట్లుగా సైనికులు చూశారు. ఇశ్రాయేలు రాజు సిరియా సైన్యాన్ని చూశాడు. ఎలీషాతో ఇశ్రాయేలు రాజు, “తండ్రీ, వారిని నేను చంపనా,” అని అడిగాడు.
22“నీ ఖడ్గముతో, విల్లమ్ములతో నీవు యుద్ధంలో పట్టుకున్న ఈ మనుష్యులను నీవు చంపగోరుచున్నావా? సిరియా సైనికులకు రొట్టెలు మంచినీళ్లు ఇమ్ము. వారిని తిని త్రాగనిమ్ము. తర్వాత వారు వారి దేశానికి యజమాని వద్దకు వెళ్తారు” అని ఎలీషా చెప్పాడు.
23ఇశ్రాయేలు రాజు సిరియా సైన్యానికై చాలా ఆహారం తయారు చేయించాడు. ఆ సైనికులు తిన్నారు, త్రాగారు. తర్వాత ఇశ్రాయేలు రాజు సిరియా సైనికులను వారి దేశానికి పంపించాడు. సిరియా సైనికులు వారి యజమాని వద్దకు వెళ్లారు. సిరియా వారు దాడి చేయడానికై సైనికులెవరినీ ఇశ్రాయేలుకి పంపలేదు.
భయంకరమైన కరవు కాలం షోమ్రోనులో ఏర్పడుట
24ఇది జరిగిన తర్వాత, సిరియా రాజుయిన బెన్హదదు తన సర్వసైన్యాన్ని సమీకరించి షోమ్రోను నగరాన్ని చుట్టుముట్టి దాడి చేయడానికి వెళ్లాడు. 25నగరంలోకి ప్రజలు ఆహారం తీసుకురాకుండా సైనికులు చేశారు. అందువల్ల షోమ్రోనులో భయంకరమైన కరువు ఏర్పడింది. అది యెంత కష్టకాలమంటే, ఒక గాడిద తల ఎనభై వెండి రూపాయిలకు మరియు పావురపు పావు రెట్ట ఐదు వెండి రూపాయిలకు అమ్మబడింది.
26ఇశ్రాయేలు రాజు నగరాన్ని ఆవరించిన ప్రాకారము మీద నడుస్తున్నాడు. ఒక స్త్రీ అతనిని ఉద్దేశించి కేక పెట్టింది. “నా ప్రభువా, యజమాని! దయచేసి నాకు సహాయం చెయ్యండి” అని.
27ఇశ్రాయేలు రాజు, “యెహోవా కనుక సహాయం చేయకపోతే, నేను ఎలా సహాయం చేయగలను? నీకు ఇవ్వదగింది నావద్ద ఏమియులేదు, కళ్లంలో ధాన్యం లేదు. ద్రాక్షరసపు శాలలో ద్రాక్షరసం లేదు.” 28తర్వాత, “నీకు వచ్చిన కష్టమేమి?” అని ఇశ్రాయేలు రాజు అడిగాడు.
ఆ స్త్రీ ఇలా బదులు చెప్పింది. “నీవు నీ కుమారుని మాకిచ్చివేయండి. అతనిని చంపి నేడు ఆహారం భుజిస్తాము. ఆ తర్వాత మేము మా కుమారుని రేపు భుజిస్తాము” అని ఈమె చెప్పింది. 29కాబట్టి మా కుమారుణ్ణి ఉడికించి తినేశాము. ఆ మరుసటి రోజు నేను ఆ స్త్రీని ఇలా అడిగాను: “నీవు నీ కుమారుని ఇమ్ము. మేము అతనిని చంపి నేడు భుజిస్తాము. కాని ఆమె తన కుమారుని దాచివేసింది.”
30ఆ స్త్రీ పలుకులు వినగానే, రాజు తాను తలక్రిందులైనానని దుఃఖాన్ని తెలపడానికి తన వస్త్రాలు చింపుకున్నాడు. ఆ గోడమీదుగా రాజు వెళ్తున్నప్పుడు రాజు గోనె పట్ట ధరించాడనీ, అది అతడు తల క్రిందులయిన, వ్యసనమయిన స్థితిని తెలుపుతున్నదని ప్రజలు గ్రహించారు.
31రాజు, “ఈరోజు ఆఖరికి షాపాతు కుమారుడైన ఎలీషా తల కనుక అతని దేహం మీద ఉంటే, నన్ను దేవుడు శిక్షించునుగాక!” అని చెప్పాడు.
32ఎలీషా వద్దకు రాజు ఒక దూతను పంపించాడు. ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు. మరియు పెద్దలు (నాయకులు) అతనితోపాటు ఉన్నారు. ఆ దూత అక్కడికి చేరుకోవడానికి ముందుగా, పెద్దల్ని ఉద్దేశించి అతను ఇలా అన్నాడు: “చూడండి, ఆ హంతకుని కుమారుడు (ఇశ్రాయేలు రాజు) నా తల నరికి వేసేందుకు మనుష్యులను పంపిస్తున్నాడు. ఆ దూత చేరగానే, తలుపు మూసివేయండి తలుపు పట్టుకుని, అతనిని లోపలికి రానివ్వకండి. నేనతని యజమాని అడుగులు అతని వెనుక వస్తున్నట్టు ఆ సవ్వడి మనకు వినిపించునుగదా.”
33ఎలీషా ఆ పెద్దలతో (నాయకులతో) మాట్లాడుతూండగా, దూత అక్కడికి వచ్చాడు. ఆ సందేశమిది: “యెహోవా నుండి ఈ కష్టం వచ్చింది. ఇంకా యెహోవా కోసం నేనెందుకు వేచివుండాలి.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 6: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి