అహరోను సంతతి వారు నివసించిన ప్రదేశాలు: వారికివ్వబడిన భూములలో స్థావరాలు ఏర్పరచుకొని వారు నివసించారు. లేవీయులకియ్యబడిన భూముల్లో కహాతీయులకు మొదటి భాగం ఇవ్వబడింది. వారికి హెబ్రోను పట్టణం, దాని చుట్టు ప్రక్కల భూములు ఇవ్వబడ్డాయి. ఇది యూదా దేశంలో వుంది. కాని పట్టణానికి దూరంగావున్న భూములు, హెబ్రోను పట్టణానికి దగ్గరలో వున్న గ్రామాలు కాలేబుకు ఇవ్వబడ్డాయి. కాలేబు తండ్రి పేరు యెపున్నె. అహరోను సంతతివారికి హెబ్రోను నగరం ఇవ్వబడింది. హెబ్రోను ఆశ్రయపురం వారికింకా లిబ్నా, యత్తీరు, ఎష్టెమో, హీలేను, దెబీరు, ఆషాను, యుట్ట, బేత్షెమెషు నగరాలు కూడ ఇవ్వబడ్డాయి. ఈ నగరాలతో పాటు వాటి సమీపంలోని పచ్చిక బయళ్ళు కూడ వారికియ్యబడ్డాయి. బెన్యామీను సంతతి వారికి గిబియోను, గెబ, అల్లెమెతు, అనాతోతు నగరాలు ఇవ్వబడ్డాయి. ఈ నగరాలతో పాటు ఆ ప్రాంతాలలోని పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి.
పదమూడు నగరాలు కహాతీయుల కుటుంబాల వారికియ్యబడ్డాయి.
కహాతు సంతతి వారైన వంశాల వారికి మనష్షే వంశం వారి సగంమందికి పది పట్టణాలు ఇవ్వబడ్డాయి.
గెర్షోను సంతతి వారైన వంశాల వారికి పదమూడు నగరాలు ఇవ్వబడ్డాయి. వారికి ఈ నగరాలు ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషాను ప్రాంతాలలో నివసించే కొందరికి మనష్షే వారినుండి సంక్రమించాయి.
మెరారీ సంతతి వారైన వంశాల వారికి పన్నెండు నగరాలు వచ్చాయి. వారికి ఈ నగరాలు రూబేను, గాదు, జెబూలూను కుటుంబాల వారినుండి వచ్చాయి. వారికి ఆ నగరాలు చీట్లువేసి ఇచ్చారు.
ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ నగరాలను, పొలాలను లేవీయులకు ఇచ్చారు. పైన పేర్కొనబడిన ఆ నగరాలన్నీ చీట్లువేసి యూదా, షిమ్యోను, బెన్యామీను కుటుంబాల వారినుండి తీసుకొనబడి వారికియ్యబడ్డాయి.
ఎఫ్రాయిము వంశం వారు కూడ కొందరు కహాతీయుల కుటుంబాల వారికి కొన్ని పట్టణాలను ఇచ్చారు. ఈ పట్టణాలను కూడ చీట్లువేసి ఇచ్చారు. వారికి షెకెము నగరం ఇవ్వబడింది. షెకెము కూడ ఒక రక్షణ (ఆశ్రయ) నగరం. వారికి ఇంకను గెజెరు, యొక్మెయాము, బేత్‌హోరోను, అయ్యాలోను, మరియు గత్రిమ్మోను పట్టణాలు కూడ ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలతో పాటు వారికి పొలాలు కూడ ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలు ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో వున్నాయి. సగం మనష్షే గోత్రం వారి నుండి ఆనేరు, బిలియాము పట్టణాలను ఇశ్రాయేలు వారు తీసుకొని కహాతీయులకు ఇచ్చారు. పట్టణాలతో పాటు కహాతీయులకు పొలాలు కూడ ఇవ్వబడ్డాయి.
గెర్షోను ప్రజలకు బాషాను ప్రాంతంలోని గోలాను పట్టణం, మనష్షే సగం వంశం వారి నుండి అష్తారోతు పట్టణం ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలకు దగ్గరలో వున్న పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి.
గెర్షోను కుటుంబాల వారికి ఇశ్శాఖారు వంశం నుంచి కెదెషు, దాబెరతు, రామోతు మరియు ఆనేము అను పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల సమీపంలో గల భూములు కూడ వారికివ్వబడ్డాయి.
గెర్షోను ప్రజలకు ఆషేరు వంశం నుండి మాషాలు, అబ్దోను, హుక్కోకు మరియు రెహాబు పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల పరిసరాలలోగల భూములు కూడ వారికివ్వబడ్డాయి.
గెర్షోను వారు నఫ్తాలి వంశం నుండి గలిలయలోని కెదెషు, హమ్మోను మరియు కిర్యతాయిము పట్టణాలను పొందారు. ఆ పట్టణాలతో పాటు సమీప పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి.
మిగిలిన లేవీయులైన మెరారీయులకు జెబూలూను వంశం నుండి యొక్నెయాము, కర్తా, రిమ్మోను మరియు తాబోరు పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల దగ్గరలో గల భూములు కూడ వారికి ఇవ్వబడ్డాయి.
మెరారీయులు రూబేను వంశం నుండి అరణ్య ప్రాంతంలోని బేసెరు, యహజా, కెదేమోతు మరియు మేఫాతు పట్టణాలను పొందారు. రూబేను వంశస్థులు యొర్దాను నదికి తూర్పున, యెరికో నగరానికి తూర్పున నివసించారు. మెరారీయులకు పట్టణాలతో పాటు పరిసర భూములు కూడ ఇవ్వబడ్డాయి.
మెరారీయులు ఇంకను గాదు వంశం నుండి గిలాదు నందలి రామోతు, మహనయీము, హెష్బోను మరియు యాజెరు పట్టణాలను పొందారు. వారికి పట్టణాలతో పాటు సమీప పొలాలు కూడ ఇవ్వబడ్డాయి.