కీర్తన 9:1-12

కీర్తన 9:1-12 IRVTEL

హృదయ పూర్వకంగా నేను యెహోవాకు ధన్యవాదాలు చెల్లిస్తాను. యెహోవా, నీ ఆశ్చర్య కార్యాలన్నిటి గురించి నేను చెబుతాను. మహోన్నతుడైన యెహోవా! నేను నీ గురించి సంతోషించి హర్షిస్తాను. నీ నామానికి స్తుతి కీర్తన పాడుతాను. నా శత్రువులు వెనుదిరిగినప్పుడు, వాళ్ళు తొట్రుపడి నీ ఎదుట నాశనం అవుతారు. ఎందుకంటే, నా న్యాయయుక్తమైన పనిని నువ్వు సమర్థించావు. నీ సింహాసనం మీద ఒక నీతిగల న్యాయమూర్తిగా నువ్వు కూర్చున్నావు. నీ యుద్ధ నినాదంతో అన్యజాతులను నువ్వు భయభీతులను చేశావు. నువ్వు దుర్మార్గులను నాశనం చేశావు. వాళ్ళ జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిచివేశావు. తమ పట్టణాలను నువ్వు జయించినప్పుడు శిథిలాలు కూలినట్టు శత్రువు కూలిపోయాడు. వాళ్ళ గుర్తులన్నీ చెరిగిపోయాయి. కాని యెహోవా శాశ్వత కాలం ఉంటాడు. న్యాయం తీర్చడానికి ఆయన తన సింహాసనాన్ని స్థాపిస్తాడు. యెహోవా లోకానికి న్యాయమైన తీర్పు తీరుస్తాడు. జాతుల కోసం న్యాయమైన నిర్ణయాలు చేస్తాడు. పీడిత ప్రజలకు యెహోవా బలమైన ఆశ్రయం. ఆపత్కాలంలో బలమైన అండ. యెహోవా, నీ నామం తెలిసిన వాళ్ళు నిన్ను నమ్ముతారు. ఎందుకంటే, నిన్ను వెదికే వాళ్ళను నువ్వు విడిచిపెట్టవు. సీయోనులో ఏలుతున్న యెహోవాకు స్తుతులు పాడండి. ఆయన చేసిన వాటిని జాతులకు చెప్పండి. ఎందుకంటే, రక్తపాతానికి శాస్తి చేసే దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. పీడిత ప్రజల కేకలు ఆయన మరచిపోడు.