కీర్తన 18:1-15

కీర్తన 18:1-15 IRVTEL

యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యెహోవా నా ఆశ్రయశిల, నా కోట, నన్ను రక్షించేవాడు, ఆయన నా దేవుడు, నా ఆశ్రయశిల. నేను ఆయనలో ఆశ్రయం పొందుతాను. ఆయన నా డాలు, నా రక్షణ కొమ్ము, నా బలమైన పట్టు. స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను నివేదన చేస్తాను, నేను నా శత్రువులనుంచి రక్షణ పొందుతాను. మరణ పాశాలు నన్ను చుట్టుకున్నాయి, దుర్మార్గులు వరద ప్రవాహంలా నా మీద పడి నన్ను అణిచివేస్తున్నారు పాతాళ పాశాలు నన్ను చుట్టుముట్టాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి. నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను. నాకు సహాయం చెయ్యమని దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయంలోనుంచి నా స్వరం విన్నాడు, నా నివేదన ఆయన సన్నిధిలో ఆయన చెవిన పడింది. అప్పుడు భూమి కంపించి వణికింది. దేవుడు కోపంగా ఉన్నాడు గనక పర్వతాల పునాదులు కూడా కదిలి వణికాయి. ఆయన ముక్కు పుటాలనుంచి పొగ లేచింది. ఆయన నోట్లోనుంచి అగ్ని వచ్చి నిప్పులు రగిలించింది. ఆయన ఆకాశాలను తెరిచి కిందకు వచ్చాడు. ఆయన పాదాల కింద చిమ్మచీకటి ఉంది. కెరూబు మీద స్వారీ చేస్తూ ఆయన ఎగిరి వచ్చాడు. గాలి రెక్కల మీద ఆయన తేలి వచ్చాడు. తన చుట్టూ అంధకారాన్ని, దట్టమైన వర్షమేఘాలను గుడారంగా చేశాడు. ఆయన ఎదుట మెరుపులు, వడగళ్ళు, మండుతున్న నిప్పులు కురిసాయి. యెహోవా ఆకాశంలో ఉరిమాడు! సర్వోన్నతుడు సింహనాదం చేసి వడగళ్ళు, మండుతున్న నిప్పులు కుమ్మరించాడు. ఆయన తన బాణాలు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టాడు. మెరుపులు మెండుగా మెరిపించి వాళ్ళను బెదరగొట్టాడు. యెహోవా, నీ నాసికారంధ్రాల ఊపిరికి నీ సింహనాదానికి ప్రవాహాలు బయలు దేరాయి. భూమి పునాదులు బయటపడ్డాయి.