కీర్తన 144

144
దావీదు కీర్తన
1నా ఆశ్రయశిల అయిన యెహోవాకు స్తుతి. నా చేతులకు, వేళ్లకు యుద్ధ నైపుణ్యం నేర్పించేవాడు ఆయనే.
2నీవే నా నిబంధన విశ్వసనీయుడివి, నా దుర్గానివి. ఆయనే నన్ను కాపాడే ఎత్తయిన నా గోపురం. నేను దాగి ఉండే నా డాలు ఆయనే. ఆయన పైనే నేను ఆధారపడతాను. జాతులు నాకు లోబడేలా అణిచేవాడు యెహోవానే.
3యెహోవా, నువ్వు మనుషులను లక్ష్యపెట్టడానికి వాళ్ళు ఎంతటి వాళ్ళు? వాళ్ళ గురించి ఆలోచించడానికి వాళ్ళకున్న అర్హత ఏమిటి?
4మనిషి కేవలం శ్వాస వంటివాడు. వాళ్ళ రోజులు కదిలిపోతున్న నీడలాగా ఉన్నాయి.
5యెహోవా, ఆకాశాలను కృంగజేసి కిందికి దిగిరా. పర్వతాలను తాకి అవి పొగలు వెళ్ళగక్కేలా చెయ్యి.
6మెరుపులు మెరిపించి శత్రువులను చెదరగొట్టు. నీ బాణాలు వేసి వాళ్ళను ఓడించు.
7ఆకాశం నుండి నీ చెయ్యి చాపి నన్ను తప్పించు. మహా జలప్రవాహాల నుండి, విదేశీయుల చేతిలోనుండి నన్ను విడిపించు.
8వాళ్ళు వంచన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కుడిచేతులు మోసంతో నిండి ఉన్నాయి.
9దేవా, నిన్ను గురించి నేనొక కొత్త గీతం పాడతాను. పదితంతుల సితారా మోగిస్తూ నిన్ను కీర్తిస్తాను.
10రాజులకు విజయం ఇచ్చేది నువ్వే. దుర్మార్గుల కత్తివేటు నుండి నీ సేవకుడైన దావీదును తప్పించే వాడివి నువ్వే.
11విదేశీయుల చేతుల్లోనుంచి నన్ను విడిపించు. వాళ్ళు వంచన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కుడిచేతులు మోసంతో నిండి ఉన్నాయి.
12యవ్వనంలో ఉన్న మా కొడుకులు మొక్కల్లాగా ఏపుగా ఎదగాలి. మా కూతుళ్ళు రాజభవనం కోసం చెక్కిన మూల స్తంభాల్లాగా ఉండాలి.
13మా గోదాముల్లో రకరకాల ధాన్య నిధులు నిండాలి. మా పచ్చిక మైదానాల్లో మా గొర్రెలు వేలు, పదివేలు పిల్లలు పెట్టాలి.
14అప్పుడు మా పశువులు ఎన్నో దూడలు ఈనతాయి. అవేవీ మా కంచెలు విరగ్గొట్టుకుని పరుగులెత్తకుండా ఉండాలి. మా వీధుల్లో ఎలాటి గలాటా ఉండకూడదు.
15ఇలాంటి దీవెనలు గల ప్రజలు ధన్యులు. యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో వాళ్ళు ధన్యజీవులు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తన 144: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

కీర్తన 144 కోసం వీడియో